అమ్మాయిల మెరుపులకు సిద్ధమా?

అమ్మాయిల క్రికెట్‌ అంటే పరమ బోర్‌ అంటూ తేలిగ్గా తీసుకునేవాళ్లు ఒకప్పుడు. కానీ అది పాత కథ. ఇప్పుడు వాళ్లాడుతుంటే వేలమంది స్టేడియాలకు వెళ్తున్నారు. టీవీల ముందు కోట్లమంది కూర్చుంటున్నారు.

Updated : 22 Feb 2024 07:06 IST

రేపటి నుంచే మహిళల ప్రిమియర్‌ లీగ్‌

అమ్మాయిల క్రికెట్‌ అంటే పరమ బోర్‌ అంటూ తేలిగ్గా తీసుకునేవాళ్లు ఒకప్పుడు. కానీ అది పాత కథ. ఇప్పుడు వాళ్లాడుతుంటే వేలమంది స్టేడియాలకు వెళ్తున్నారు. టీవీల ముందు కోట్లమంది కూర్చుంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్లోనే కాదు.. టీ20 లీగ్‌ల్లో కూడా అమ్మాయిల ఆట ఆకర్షణీయంగా మారుతోంది. భారత అమ్మాయిలకు ఎన్నో ఏళ్ల నుంచి కలగా ఉన్న మహిళల ఐపీఎల్‌ను కూడా గత ఏడాదే మొదలుపెట్టేసింది బీసీసీఐ. తొలి సీజన్‌ సూపర్‌ హిట్‌! ఇప్పుడు రెండో సీజన్‌కు రంగం సిద్ధమైంది. అయిదు జట్ల ఆసక్తికర సమరానికి రేపే శ్రీకారం.

ఈనాడు క్రీడావిభాగం

మహిళల క్రికెట్‌కు ఆదరణ పెరిగాక ఐపీఎల్‌ లాగే వాళ్లకూ ఓ లీగ్‌ ఉండాలన్న డిమాండ్‌ మొదలైంది. అయితే నేరుగా పూర్తి స్థాయి లీగ్‌ ఆరంభించకుండా.. పురుషుల ఐపీఎల్‌ సమయంలోనే కొన్ని రోజుల్లో ముగిసిపోయే మినీ లీగ్‌ను నిర్వహించింది బీసీసీఐ. ఆ మ్యాచ్‌లకు స్పందన బాగుండడంతో నిరుడు మహిళల ప్రిమియర్‌ లీగ్‌ను మొదలుపెట్టింది. మూడు వారాల పాటు 22 మ్యాచ్‌లతో జరిగిన లీగ్‌కు అభిమానుల నుంచి మంచి ఆదరణే లభించింది. ఈ ఏడాది కొంచెం ముందుగానే రెండో సీజన్‌ మొదలవుతోంది. గత ఏడాది ఫార్మాట్లోనే అవే జట్లతో లీగ్‌ జరగబోతోంది. దాదాపుగా అన్ని జట్ల స్టార్‌ క్రికెటర్లూ ఆడబోతుండటంతో లీగ్‌ రసవత్తరంగా, హోరాహోరీగా సాగడం ఖాయం. తొలి సీజన్లో విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్స్‌ మరోసారి టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా.. నిరుటి రన్నరప్‌ దిల్లీ క్యాపిటల్స్‌ కూడా చాలా బలంగా కనిపిస్తోంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, యూపీ వారియర్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ ఈసారి ప్రదర్శన మార్చాలని పట్టుదలతో ఉన్నాయి.


ముంబయి.. మళ్లీ కొట్టేనా

తొలి సీజన్లో అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ గెలిచింది హర్మన్‌ప్రీత్‌ నేతృత్వంలోని ముంబయి. ఆ జట్టు బలం చూస్తే మరోసారి కప్పు గెలిచేందుకు మెండుగానే అవకాశాలున్నాయి. హర్మన్‌కు తోడు పూజ వస్త్రాకర్‌, యాక్తిక భాటియా, అమన్‌జ్యోత్‌ లాంటి టీమ్‌ఇండియా క్రికెటర్లు జట్టులో ఉన్నారు. విదేశీ స్టార్లు హేలీ మాథ్యూస్‌, అమేలియా కెర్‌, నాట్‌ సీవర్‌ క్లో ట్రైయన్‌ బ్యాటుతో, బంతితో తిరుగులేని ప్రదర్శన చేయగలరు. షబ్నమ్‌, ఇసీ వాంగ్‌ల పేస్‌ ఆ జట్టుకు మరో బలం.

దేశీయ క్రికెటర్లు: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, యాస్తిక భాటియా, పూజ వస్త్రాకర్‌, అమన్‌జ్యోత్‌ కౌర్‌, అమన్‌దీప్‌ కౌర్‌, సైకా ఇషాక్‌, జింతిమని కలిత, ప్రియాంక బాల, ఫాతిమా జాఫర్‌, హుమేరియా కాజి, కీర్తన సత్యమూర్తి, సజన సజీవన్‌.

విదేశీయులు: హేలీ మాథ్యూస్‌, అమేలియా కెర్‌, నాట్‌ సీవర్‌, క్లో ట్రైయన్‌, షబ్నమ్‌ ఇస్మాయిల్‌, ఇసీ వాంగ్‌.


దిల్లీ.. ఈసారి ధీమాతో

గత ఏడాది ముంబయికి దీటైన ప్రదర్శనతో ఫైనల్‌ చేరి.. తుది మెట్టుపై బోల్తా కొట్టిన దిల్లీ క్యాపిటల్స్‌ ఈసారి విజేతగా నిలవగలమని ధీమాతో ఉంది. షెఫాలి వర్మ లాంటి దూకుడైన ఓపెనర్‌కు తోడు జెమీమా, తానియా ఇండియన్‌ స్టార్లు బ్యాటింగ్‌లో బలం. యువ సంచలనం తితాస్‌ సాధుకు తోడు శిఖ పాండే, పూనమ్‌ యాదవ్‌, అరుంధతి రెడ్డి లాంటి సీనియర్లు బౌలింగ్‌లో జట్టుకు అండ. దిల్లీ విదేశీ బలం మామూలుగా లేదు. మరిజేన్‌ కాప్‌, అనాబెల్‌ సదర్లాండ్‌, ఎలీస్‌ క్యాప్సీ, జెస్‌ జొనాసెన్‌ లాంటి మేటి ఆల్‌రౌండర్లు ఆ జట్టు సొంతం. మెగ్‌ లానింగ్‌ బ్యాటింగ్‌ కూడా ప్లస్సే.

దేశీయ క్రికెటర్లు: షెఫాలి వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, తానియా భాటియా, శిఖ పాండే, మిన్ను మణి, పూనమ్‌ యాదవ్‌, అరుంధతి రెడ్డి, తితాస్‌ సాధు, రాధ యాదవ్‌, అశ్విని కుమారి, అపర్ణ మొండల్‌, స్నేహ దీప్తి.

విదేశీయులు: మరిజేన్‌ కాప్‌, మెగ్‌ లానింగ్‌, ఎలీస్‌ క్యాప్సీ, అనాబెల్‌ సదర్లాండ్‌, జెస్‌ జొనాసెన్‌, లారా హారిస్‌.


బెంగళూరు.. స్టార్లు ఎందరో..

పురుషుల ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటనే తలపించింది మహిళల జట్టు కూడా తొలి సీజన్లో. జట్టులో స్టార్లకు కొదవ లేదు. కానీ ప్రదర్శన మాత్రం అంచనాలకు తగ్గట్లు సాగలేదు. స్మృతి మంధాన, రిచా ఘోష్‌, రేణుక సింగ్‌ లాంటి భారత స్టార్లు ఆ జట్టు సొంతం. శ్రేయాంక పటేల్‌, సబ్బినేని మేఘన కూడా ప్రతిభావంతులే. ఎలీస్‌ పెర్రీ, సోఫీ డివైన్‌, హెదర్‌ నైట్‌, నదీన్‌ డిక్లెర్క్‌ లాంటి ఉత్తమ ఆల్‌రౌండర్లు ఆ జట్టులో ఉన్నారు. కేట్‌ క్రాస్‌, జార్జియా వేర్‌హామ్‌ల బౌలింగ్‌ కూడా మరో సానుకూలత.

దేశీయ క్రికెటర్లు: స్మృతి మంధాన, రిచా ఘోష్‌, రేణుక సింగ్‌, దిశా కసట్‌, సబ్బినేని మేఘన, ఇంద్రాణి రాయ్‌, సతీశ్‌ శుభా, శోభన ఆశ, సిమ్రన్‌ బహదూర్‌, శ్రేయంక పాటిల్‌, కనిక ఆహుజా, ఏక్తా బిస్త్‌, శ్రద్ధ పొఖార్కర్‌.

విదేశీయులు: ఎలీస్‌ పెర్రీ, సోఫీ డివైన్‌, హెదర్‌ నైట్‌, నదీన్‌ డిక్లెర్క్‌, కేట్‌ క్రాస్‌, సోఫీ మాలినెక్స్‌, జార్జియా వేర్‌హామ్‌.


గుజరాత్‌.. విదేశీ పవర్‌

మహిళల లీగ్‌లోని మిగతా జట్లతో పోలిస్తే గుజరాత్‌ జట్టులో స్టార్లు తక్కువే. ముఖ్యంగా భారత జట్టులోని పేరున్న క్రికెటర్లలో ఒక్కరూ ఈ జట్టులో లేరు. స్నేహ్‌ రాణా, హర్లీన్‌ డియోల్‌ మాత్రమే చెప్పుకోదగ్గ క్రీడాకారులు. చాన్నాళ్లుగా భారత జట్టుకు దూరంగా ఉన్న వేద కృష్ణమూర్తి, ఫామ్‌లో లేని హేమలత లీగ్‌లో ఏమాత్రం రాణిస్తారో చూడాలి. అయితే విదేశీ బలం మాత్రం గుజరాత్‌కు బాగానే ఉంది. ఆష్లీ గార్డ్‌నర్‌ జట్టుకు అతి పెద్ద ఆకర్షణ. యువ సంచనలం లిచ్‌ ఫీల్డ్‌కు తోడు బెత్‌ మూనీ, లారా వోల్వార్ట్‌తో బ్యాటింగ్‌ బాగుంది.

దేశీయ క్రికెటర్లు: హర్లీన్‌ డియోల్‌, స్నేహ్‌ రాణా, హేమలత, వేద కృష్ణమూర్తి, మన్నత్‌ కశ్యప్‌, తనూజ కన్వర్‌, మేఘనా సింగ్‌, షబ్నమ్‌, తరనుమ్‌ పఠాన్‌, పూజిత, ప్రియ మిశ్రా, సయాలి.

విదేశీయులు: ఆష్లీ గార్డ్‌నర్‌, లిచ్‌ఫీల్డ్‌, బెత్‌ మూనీ, లారా వోల్వార్ట్‌, కేథరిన్‌ బ్రైస్‌, లియా తహుహు, లారెన్‌ చీటెల్‌.


యూపీ.. ఆల్‌రౌండర్ల జట్టు

తొలి సీజన్లో ఓ మోస్తరు ప్రదర్శన చేసిన యూపీ వారియర్స్‌.. ఆల్‌రౌండర్లే బలంగా బరిలోకి దిగుతోంది. భారత స్టార్‌ దీప్తి శర్మకు తోడు.. తాలియా మెక్‌గ్రాత్‌, సోఫీ ఎకిల్‌స్టోన్‌, చమరి ఆటపట్టు, గ్రేస్‌ హారిస్‌ లాంటి ప్రపంచ స్థాయి ఆల్‌రౌండరు ఆ జట్టు సొంతం. డానీ వ్యాట్‌, అలీసా హీలీ లాంటి మేటి బ్యాటర్లు కూడా యూపీకి బలమే. స్పిన్నర్‌ రాజేశ్వరి గైక్వాడ్‌, బ్యాటర్‌ కిరణ్‌ నవ్‌గిరెల నుంచి కూడా జట్టు మంచి ప్రదర్శన ఆశిస్తోంది. తెలుగమ్మాయి, పేసర్‌ అంజలి శర్వాణి లీగ్‌పై తనదైన ముద్ర వేయాలని చూస్తోంది.

దేశీయ క్రికెటర్లు: దీప్తి శర్మ, కిరణ్‌ నవ్‌గిరె, రాజేశ్వరి గైక్వాడ్‌, పర్శవి చోప్రా, శ్వేత సెహ్రావత్‌, అంజలి శర్వాణి, పూనమ్‌ ఖేమ్నార్‌, గౌహర్‌ సుల్తానా, సలీమా ఠాకూర్‌, వృంద దినేశ్‌, లక్ష్మి యాదవ్‌, యశశ్రీ.

విదేశీయులు: తాలియా మెక్‌గ్రాత్‌, అలీసా హీలీ, సోఫీ ఎకిల్‌స్టోన్‌, చమరి ఆటపట్టు, డానీ వ్యాట్‌, గ్రేస్‌ హారిస్‌, లారెన్‌ బెల్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని