కశ్మీర్‌లో కుర్రాళ్లతో..

యురిలోని ఓ రహదారిపై కొంతమంది కుర్రాళ్లు కలిసి గల్లీ క్రికెట్‌ ఆడుతున్నారు. ఒక్కసారిగా అక్కడికి ఓ పెద్ద కారు వచ్చి ఆగింది. అందులో నుంచి ఓ క్రికెట్‌ దిగ్గజం దిగడం, ఆ కుర్రాళ్లతో కలిసి క్రికెట్‌ ఆడటం.. ఇలా ఊహించని సంఘటనలు జరిగాయి.

Published : 23 Feb 2024 03:20 IST

శ్రీనగర్‌: యురిలోని ఓ రహదారిపై కొంతమంది కుర్రాళ్లు కలిసి గల్లీ క్రికెట్‌ ఆడుతున్నారు. ఒక్కసారిగా అక్కడికి ఓ పెద్ద కారు వచ్చి ఆగింది. అందులో నుంచి ఓ క్రికెట్‌ దిగ్గజం దిగడం, ఆ కుర్రాళ్లతో కలిసి క్రికెట్‌ ఆడటం.. ఇలా ఊహించని సంఘటనలు జరిగాయి. ఆ కుర్రాళ్లకు మరపురాని బహుమతి అందించిన ఆ దిగ్గజం.. సచిన్‌ తెందుల్కర్‌. కుటుంబంతో కలిసి జమ్ముకశ్మీర్‌ పర్యటనకు వెళ్లిన సచిన్‌.. అక్కడ కొంతమంది కుర్రాళ్లతో కలిసి గల్లీ క్రికెట్‌ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియోను.. ‘‘క్రికెట్‌, కశ్మీర్‌.. ఇది స్వర్గంలో నిర్ణయించిన బంధం’’ అనే శీర్షికతో గురువారం ఎక్స్‌లో పంచుకున్నాడు. ఇందులో.. ‘‘మేం ఆడొచ్చా.. మీ బౌలర్‌ ఎవరూ’’ అంటూ సచిన్‌ ఆ కుర్రాళ్లతో మాట్లాడాడు. తొమ్మిది బంతులు ఎదుర్కొన్న అతను.. స్కూప్‌ షాట్‌, స్ట్రెయిట్‌ డ్రైవ్‌లు కొట్టాడు. తనను ఔట్‌ చేయాలని పేర్కొంటూ.. బ్యాట్‌ను తిప్పి హ్యాండిల్‌ కింది వైపు వచ్చేలా పట్టుకుని షాట్‌ ఆడాడు. ఆ తర్వాత అక్కడి కుర్రాళ్లు, అభిమానులతో సచిన్‌ సెల్ఫీలు దిగాడు. మరోవైపు అమన్‌ సేతు దగ్గర్లోని కమన్‌ పోస్టు వద్ద సైనికులతో సచిన్‌ మాట్లాడాడు. శ్రీనగర్‌- జమ్ము జాతీయ రహదారిపై పక్కన ఉన్న ఓ క్రికెట్‌ బ్యాట్ల తయారీ కేంద్రాన్ని కూడా అతను సందర్శించాడు.


ఇది విలక్షణ పిచ్‌

రాంచి పిచ్‌పై పగుళ్లు ఉన్నాయని, స్పిన్నర్లకు సహకారం లభిస్తుందని భారత బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అన్నాడు. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలిగితే సత్తా తమ జట్టుకు ఉందని చెప్పాడు. ‘‘భారత్‌లో ఎప్పుడు మ్యాచ్‌లు ఆడినా పిచ్‌లపై ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. రాంచిలోనిది విలక్షణ భారత పిచ్‌. పగుళ్లు కనిపిస్తున్నాయి. బంతి స్పిన్నవుతుంది. ఎంత టర్నవుతుంది, ఎప్పటి నుంచి టర్నవుతుంది అన్నది చెప్పలేం. కానీ మా జట్టులో సరైన సమతూకం ఉంది’’ అని రాఠోడ్‌ చెప్పాడు. ఫాస్ట్‌ బౌలర్‌ బుమ్రా బాగానే ఉన్నాడని, వరుసగా మ్యాచ్‌లు ఆడించడం మంచిది కాదనే విశ్రాంతి ఇచ్చామని చెప్పాడు.


బౌలింగ్‌ చేస్తానో లేదో..

ఇటీవల కాలంలో బౌలింగ్‌కు దూరంగా ఉంటున్న ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ నెట్స్‌లో పూర్తి స్థాయిలో బౌలింగ్‌ చేశాడు. అయితే నాలుగో టెస్టులో తాను బౌలింగ్‌ చేస్తానా లేదా అన్నది చెప్పలేనని అన్నాడు. మోకాలి సమస్య కారణంగా నిరుడు జూన్‌లో యాషెస్‌ రెండో టెస్టు నుంచి స్టోక్స్‌ కేవలం బ్యాటర్‌గానే ఆడుతున్నాడు. ‘‘నేను బౌలింగ్‌ చేయొచ్చు, చేయకపోవచ్చు. రాబిన్సన్‌ను తీసుకోవడం వల్ల మాకు మంచి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇక్కడ పిచ్‌ స్పిన్నర్లకు సహకరిస్తుంది. కానీ ఇద్దరు సీమర్లు ఉండడం వల్ల కూడా మాకు మంచి అవకాశాలు ఉంటాయని అనిపిస్తోంది’’ స్టోక్స్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు