అతివల ధనాధన్‌

ధనాధన్‌ బ్యాటింగ్‌.. అద్భుతమైన బౌలింగ్‌.. కళ్లు చెదిరే ఫీల్డింగ్‌ విన్యాసాలు వీక్షించే సమయం ఆసన్నమైంది. అభిమానులను తమ ఆటతో అలరించేందుకు అమ్మాయిలు సిద్ధమయ్యారు. నేటి నుంచే మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) రెండో సీజన్‌. ఐపీఎల్‌కు ముందే టీ20 కిక్కు షురూ!

Updated : 23 Feb 2024 03:26 IST

నేటి నుంచే డబ్ల్యూపీఎల్‌ రెండో సీజన్‌
ట్రోఫీ కోసం అయిదు జట్ల పోరు
తొలి మ్యాచ్‌లో ముంబయితో దిల్లీ ఢీ

రాత్రి 8 నుంచి బెంగళూరు

ధనాధన్‌ బ్యాటింగ్‌.. అద్భుతమైన బౌలింగ్‌.. కళ్లు చెదిరే ఫీల్డింగ్‌ విన్యాసాలు వీక్షించే సమయం ఆసన్నమైంది. అభిమానులను తమ ఆటతో అలరించేందుకు అమ్మాయిలు సిద్ధమయ్యారు. నేటి నుంచే మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) రెండో సీజన్‌. ఐపీఎల్‌కు ముందే టీ20 కిక్కు షురూ!

యిదు జట్లు.. బరిలో అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లు.. అందరి లక్ష్యం ఒక్కటే.. అదే డబ్ల్యూపీఎల్‌ ట్రోఫీ. గతేడాది ఆరంభ సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి ఇండియన్స్‌, రన్నరప్‌ దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌తో శుక్రవారం రెండో సీజన్‌కు తెరలేవనుంది. స్టార్‌ క్రికెటర్లతో నిండిన ఈ రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగే ఆస్కారముంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ జెయింట్స్‌, యూపీ వారియర్స్‌ కూడా సమరానికి సై అంటున్నాయి. మార్చి 17న జరిగే ఫైనల్లో విజేతగా నిలవడమే ధ్యేయంగా బరిలో దిగుతున్నాయి. హర్మన్‌ప్రీత్‌, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌, దీప్తి శర్మ, షెఫాలీ వర్మ, శిఖా పాండే, రేణుక సింగ్‌ లాంటి స్టార్లతో పాటు శ్రేయాంక పాటిల్‌, తితాస్‌ సాధు, మిన్ను మణి, పర్శవి లాంటి భారత యువ క్రికెటర్లూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు మెగ్‌ లానింగ్‌, హేలీ మాథ్యూస్‌, ఎలీస్‌ పెర్రీ, సోఫీ డివైన్‌, అలీసా హీలీ, చమరి ఆటపట్టు, బెత్‌ మూనీ వంటి విదేశీ అగ్రశ్రేణి క్రికెటర్లూ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన స్నేహ దీప్తి, అరుంధతి రెడ్డి (దిల్లీ), త్రిష పూజిత, షబ్నం (గుజరాత్‌), సబ్బినేని మేఘన (బెంగళూరు), యషశ్రీ, అంజలి, గౌహర్‌ సుల్తానా (యూపీ) కూడా లీగ్‌లో ప్రాతినిథ్యం వహించబోతున్నారు.  

రెండు నగరాల్లో..: గతేడాది డబ్ల్యూపీఎల్‌ ఆరంభ సీజన్‌ కేవలం ముంబయిలోని డీవై పాటిల్‌, బ్రబౌర్న్‌ స్టేడియాల్లోనే జరిగిన సంగతి తెలిసిందే. అమ్మాయిల ఆటకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి రెండు నగరాల్లో మ్యాచ్‌లు జరగబోతున్నాయి. తొలి 11 మ్యాచ్‌లకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం, ఫైనల్‌ సహా చివరి 11 మ్యాచ్‌లకు దిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం ఆతిథ్యమిస్తాయి. స్పోర్ట్స్‌ 18, జియో సినిమాలో మ్యాచ్‌లు ప్రసారమవుతాయి.

బాలీవుడ్‌ హీరోలతో..: చిన్నస్వామి స్టేడియంలో జరిగే డబ్ల్యూపీఎల్‌ రెండో సీజన్‌ ఆరంభ వేడుకల్లో బాలీవుడ్‌ హీరోలు షారుక్‌ ఖాన్‌, షాహిద్‌ కపూర్‌, టైగర్‌ ష్రాఫ్‌, వరుణ్‌ ధావన్‌, సిద్ధార్థ్‌ మల్హోత్ర, కార్తీక్‌ ఆర్యన్‌.. ప్రత్యేక ప్రదర్శన ఇవ్వబోతున్నారు. ఈ వేడుకలు సాయంత్రం 6.30 గంటలకు మొదలవుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు