ముగిస్తారా ఇక్కడే..

ఓటమితో ఆరంభించినా.. గిరగిరా తిరిగే పిచ్‌లు లేకపోయినా.. కొందరు కీలక ఆటగాళ్లు దూరమైనా అదిరే ఆటతో సిరీస్‌లో 2-1తో ఆధిక్యం సంపాదించింది. వరుసగా రెండు టెస్టుల్లో గెలుపుతో రెట్టించిన ఉత్సాహంతో ఉంది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా కీలక సమరానికి సిద్ధమైంది.

Updated : 23 Feb 2024 07:41 IST

ఇంగ్లాండ్‌తో భారత్‌ నాలుగో టెస్టు నేటి నుంచే
ఉదయం 9.30 నుంచి
రాంచి

ఓటమితో ఆరంభించినా.. గిరగిరా తిరిగే పిచ్‌లు లేకపోయినా.. కొందరు కీలక ఆటగాళ్లు దూరమైనా అదిరే ఆటతో సిరీస్‌లో 2-1తో ఆధిక్యం సంపాదించింది. వరుసగా రెండు టెస్టుల్లో గెలుపుతో రెట్టించిన ఉత్సాహంతో ఉంది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా కీలక సమరానికి సిద్ధమైంది. రాంచిలో ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు నేటి నుంచే. స్టార్‌ పేసర్‌ బుమ్రా లేకున్నా.. ఆతిథ్య జట్టు జోరుమీదుంది. అయితే వరుసగా రెండు టెస్టుల్లో ఓడినా.. బజ్‌బాల్‌ వ్యూహాన్ని వీడనంటోన్న ఇంగ్లాండ్‌తో పోరు అంత తేలికేమీ కాదు. రసవత్తర సమరం ఖాయం.

భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య అయిదు టెస్టుల సిరీస్‌లో కీలక పోరుకు వేళైంది. సిరీస్‌ ఫలితాన్ని నిర్ణయించే అవకాశమున్న నాలుగో టెస్టు శుక్రవారం ఆరంభం కానుంది.  జోరు మీదున్న టీమ్‌ఇండియా సొంతగడ్డపై వరుసగా 17వ సిరీస్‌పై కన్నేసింది. 2012లో ఇంగ్లాండ్‌కు సిరీస్‌ కోల్పోయాక.. స్వదేశంలో ఆడిన 47 టెస్టుల్లో భారత్‌ ఏకంగా 38 గెలిచింది. ఇప్పుడు రాంచిలో ధీమాగా బరిలోకి దిగుతోంది. ఇక్కడి పిచ్‌పై బంతి బాగా తిరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో ఇరు జట్ల బ్యాటర్లు స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటారన్నదే మ్యాచ్‌ ఫలితాన్ని నిర్దేశించనుంది. ఇంగ్లాండ్‌ సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో ఉంది. చూద్దాం.. ఎవరిదో పైచేయి అవుతుందో!

ఇక్కడే ముగించాలని..: రాంచిలోనే సిరీస్‌ను చేజిక్కించుకోవాలని టీమ్‌ఇండియా తహతహలాడుతోంది. హైదరాబాద్‌లో షాక్‌ తర్వాత రోహిత్‌సేన పుంజుకున్న తీరు అద్భుతం. కోహ్లి, రాహుల్‌ దూరం కావడం, శ్రేయస్‌ అయ్యర్‌ ఫామ్‌లో లేకపోవడంతో బ్యాటింగ్‌లో బలహీనపడ్డ భారత్‌ను యువ బ్యాటర్లు నిలబెట్టారు. సిరీస్‌లో ఇప్పటివరకు వాళ్ల ప్రదర్శనే హైలైట్‌. ముఖ్యంగా ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ అదిరే ఫామ్‌ జట్టుకు కొండంత బలం. చెలరేగి ఆడుతున్న అతడు వరుసగా రెండు ద్విశతకాలతో సిరీస్‌లో టీమ్‌ఇండియా ఆధిక్యం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 109 సగటుతో 545 పరుగులు చేసి సిరీస్‌ టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. సిరీస్‌లో ఏకంగా 22 సిక్స్‌లు కొట్టాడు .అతడు రాంచిలోనూ అదే జోరు కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సర్ఫరాజ్‌ ఖాన్‌.. రాజ్‌కోట్‌లో అరంగేట్రంలోనే రెండు అర్ధశతకాలు సాధించాడు. ఇక గిల్‌ క్రమంగా మూడో స్థానంలో నిలదొక్కుకుంటున్నాడు. పేలవ ఫామ్‌ నుంచి బయటపడుతూ ఇప్పటివరకు 42 సగటుతో 252 పరుగులు సాధించాడు. జట్టు ధీమా పెంచుతున్నది వీళ్ల ఫామే. కెప్టెన్‌ రోహిత్‌ కూడా గత మ్యాచ్‌లో సెంచరీతో జోరుందుకున్నాడు. మరోవైపు వికెట్‌కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ అరంగేట్రంలోనే బ్యాటుతో ఆకట్టుకున్నాడు. ఈ బ్యాటర్లు మరోసారి చెలరేగాలని జట్టు ఆశిస్తోంది. కొత్త ఆటగాడు రజత్‌ పటీదార్‌ ఈసారైనా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడా అన్నది చూడాలి. మరోవైపు బౌలింగ్‌లో అత్యంత కీలకమైన ఫాస్ట్‌బౌలర్‌ బుమ్రాకు భారత్‌ విశ్రాంతినిచ్చింది. స్పిన్నర్ల హవా నడిచిన సిరీస్‌లో 17 వికెట్లు పడగొట్టిన అతడు.. టీమ్‌ఇండియా విజయాల్లో ముఖ్య పాత్ర పోషించాడు. నిర్జీవమైన రాజ్‌కోట్‌ పిచ్‌పై సైతం అతడు వికెట్లను అందించాడు. బుమ్రా గైర్హాజరీ భారత బౌలింగ్‌ దళానికి పరీక్షే. ఈ మ్యాచ్‌కిక సిరాజే అనుభవజ్ఞుడైన ఫాస్ట్‌బౌలర్‌. రెండో పేసర్‌ స్థానం కోసం ముకేశ్‌ కుమార్‌, ఇంకా అరంగేట్రం చేయని ఆకాశ్‌దీప్‌ మధ్య పోటీ ఉంది. ఆకాశ్‌దీప్‌కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అశ్విన్‌, జడేజా, కుల్‌దీప్‌ త్రయం స్పిన్‌ బాధ్యతలు చూసుకుంటుంది. 500 వికెట్ల ఘనతను పూర్తి చేసిన అశ్విన్‌.. రాజ్‌కోట్‌లో అదరగొట్టిన జడేజా.. స్పిన్‌కు పూర్తి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్న రాంచి పిచ్‌పై విజృంభిస్తారని జట్టు ఆశిస్తోంది.

ఇంగ్లాండ్‌కు పరీక్ష: రాజ్‌కోట్‌లో 434 పరుగుల భారీ తేడాతో చిత్తయిన ఇంగ్లాండ్‌కు ఈ మ్యాచ్‌ పెద్ద పరీక్షే. బజ్‌బాల్‌ వ్యూహంతో ఆ జట్టు విమర్శలపాలైన సంగతి తెలిసిందే. మిడిల్‌ ఆర్డర్‌ పుంజుకోవడం ఇంగ్లాండ్‌కు చాలా అవసరం. కీలక బ్యాటర్లు రూట్‌, బెయిర్‌స్టోల ఫామ్‌ ఆ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. రూట్‌ సిరీస్‌లో ఇప్పటివరకు ఆరు ఇన్నింగ్స్‌లో 12.83 సగటుతో 77 పరుగులే చేశాడు. బెయిర్‌స్టో 17 సగటుతో 102 పరుగులు మాత్రమే సాధించాడు. పేలవ ఫామ్‌ను నుంచి ఈ బ్యాటర్లు ఎలా బయటపడతారన్నది ఆసక్తికరం. కెప్టెన్‌ స్టోక్స్‌ బౌలింగ్‌ చేసే అవకాశముండడం ఇంగ్లాండ్‌కు సానుకూలాంశం. ఈ మ్యాచ్‌ కోసం పర్యటక జట్టు రెండు మార్పులు చేసింది. మార్క్‌ వుడ్‌ స్థానంలో ఓలీ రాబిన్సన్‌, రెహాన్‌ అహ్మద్‌ స్థానంలో ఆఫ్‌స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ తుది జట్టులోకి వచ్చారు. హైదరాబాద్‌లో స్పిన్‌ అనుకూల పిచ్‌పై ఇంగ్లాండ్‌ స్పిన్నర్లు ఎలా విజృంభించారో తెలిసిందే. ముఖ్యంగా హార్ట్‌లీతో ముప్పు పొంచి ఉంది. అతడితో పాటు బషీర్‌, పార్ట్‌టైమర్‌ రూట్‌ స్పిన్‌ దాడి చేయనున్నారు.

తుది జట్లు: భారత్‌ (అంచనా): రోహిత్‌, యశస్వి జైస్వాల్‌, గిల్‌, రజత్‌ పటీదార్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, ధ్రువ్‌ జురెల్‌, జడేజా, అశ్విన్‌, కుల్‌దీప్‌, సిరాజ్‌, ఆకాశ్‌దీప్‌/ముకేశ్‌; ఇంగ్లాండ్‌: క్రాలీ, డకెట్‌, పోప్‌, రూట్‌, బెయిర్‌స్టో, స్టోక్స్‌, ఫోక్స్‌, హార్ట్‌లీ, రాబిన్సన్‌, అండర్సన్‌, బషీర్‌.

పిచ్‌ ఎలా..

సిరీస్‌లో గత పిచ్‌లన్నింటికన్నా రాంచి పిచ్‌ స్పిన్‌కు ఎక్కువ అనుకూలంగా కనిపిస్తోంది. పిచ్‌ మూడో రోజు నుంచి స్పిన్‌కు సహకరిస్తుందని క్యురేటర్‌ చెప్పాడు. పరిస్థితులు బ్యాటింగ్‌కూ అనుకూలమే. మ్యాచ్‌ మూడో రోజు, అయిదో రోజు జల్లులు పడే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని