పోలీస్‌ కావాలని కలలు కన్నా

చిన్నప్పటి నుంచి పోలీస్‌ కావాలని కలలు కన్నానని భారత మహిళల క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ చెప్పింది. ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసు శాఖలో డీఎస్పీగా నియమితురాలైన నేపథ్యంలో ఆమె ఇలా వ్యాఖ్యానించింది.

Published : 24 Feb 2024 03:37 IST

దిల్లీ: చిన్నప్పటి నుంచి పోలీస్‌ కావాలని కలలు కన్నానని భారత మహిళల క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ చెప్పింది. ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసు శాఖలో డీఎస్పీగా నియమితురాలైన నేపథ్యంలో ఆమె ఇలా వ్యాఖ్యానించింది. ‘‘చిన్నప్పటి నుంచి పోలీసు ఆఫీసర్‌ కావాలనేది నా కల. అది ఎంత కష్టమైన వృత్తో తెలుసు. కానీ ఒక్కసారైనా యూనిఫాం వేసుకోవాలని అనుకునేదాన్ని. ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసు శాఖలో డీఎస్పీగా ఉద్యోగం పొందడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని దీప్తి చెప్పింది. ఆగ్రాకు చెందిన దీప్తిని గత నెలలోనే డీఎస్పీగా నియమించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌.. క్రికెటర్‌గా ఆమె ప్రదర్శనలకు గుర్తింపుగా రూ.3 కోట్ల నగదు బహుమతి కూడా అందజేశారు.


విజృంభించిన శశికాంత్‌, నితీశ్‌

మధ్యప్రదేశ్‌ 234/9
రంజీ క్వార్టర్‌ఫైనల్‌

ఇండోర్‌: శశికాంత్‌ (4/37), నితీశ్‌కుమార్‌ (3/50) విజృంభించడంతో ఆంధ్రతో రంజీ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్లో మొదటిరోజు ఆట చివరికి మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 234/9తో నిలిచింది. శుక్రవారం టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న మధ్యప్రదేశ్‌కు ఓపెనర్లు యశ్‌ దూబె (64), హిమాంశు మంత్రి (49) బలమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఒక దశలో ఆ జట్టు 123/0తో పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ శశికాంత్‌, నితీశ్‌ దెబ్బకు తడబడింది. 36 పరుగుల తేడాతో 7 వికెట్లు కోల్పోయి 159/6తో కష్టాల్లో చిక్కుకుంది. ఈ స్థితిలో సారాంశ్‌ జైన్‌ (41 బ్యాటింగ్‌), కుమార్‌ కార్తికేయ (29)తో కలిసి స్కోరు 200 దాటించాడు. కార్తికేయ, అవేష్‌ ఖాన్‌ (7) ఔటైనా.. కుల్వంత్‌ (1) తోడుగా సారాంశ్‌ క్రీజులో ఉన్నాడు.


మహిళల హాకీ కోచ్‌ రాజీనామా

దిల్లీ: భారత మహిళల హాకీ జట్టు చీఫ్‌ కోచ్‌ జానెక్‌ షాప్‌మన్‌ తన పదవికి రాజీనామా చేసింది. భారత హాకీ సమాఖ్య తనకు సరైన గౌరవం, విలువ ఇవ్వట్లేదని ఇటీవల ఆవేదన వ్యక్తం చేసిన జానెక్‌.. శుక్రవారం పదవి నుంచి దిగిపోయింది. 2021లో ఈ డచ్‌ మాజీ క్రీడాకారిణి కోచ్‌ అయింది. ఆమె శిక్షణలో భారత జట్టు.. టోక్యో ఒలింపిక్స్‌లో అంచనాలను మించిన ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచింది. అయితే ఇటీవల భారత మహిళలు పేలవ ప్రదర్శన చేశారు. ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించలేదు.


స్వదేశానికి రెహాన్‌ అహ్మద్‌

రాంచి: భారత్‌తో నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్‌ యువ లెగ్‌ స్పిన్నర్‌ రెహాన్‌ అహ్మద్‌ దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో రెహాన్‌ స్వదేశానికి తిరిగి వెళ్లనున్నాడు. అయిదో టెస్టుకు కూడా అందుబాటులో ఉండడని ఈసీబీ తెలిపింది. 19 ఏళ్ల రెహాన్‌ మొదటి మూడు టెస్టుల్లో 44 సగటుతో 11 వికెట్లు తీశాడు. ‘‘వ్యక్తిగత కారణాలతో రెహాన్‌ తక్షణం ఇంగ్లాండ్‌ జట్టు నుంచి వైదొలిగి స్వదేశానికి తిరిగి వెళ్లనున్నాడు. ఈ సిరీస్‌కు అతను అందుబాటులో ఉండడు. రెహాన్‌ స్థానంలో ఎవరినీ ఎంపిక చేయట్లేదు’’ అని ఈసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది.


భారత్‌ ప్రతీకార పోరు

రవూర్కెలా: ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ హాకీ టోర్నీలో భారత్‌ ప్రతీకార పోరుకు సిద్ధమైంది. శనివారం జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. భువనేశ్వర్‌లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని భారత్‌ పట్టుదలగా ఉంది. గత మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ నెదర్లాండ్స్‌ చేతిలో 4-2తో ఓడిన భారత్‌ మళ్లీ గెలుపు బాట పట్టాలని భావిస్తుంది. అయితే టోర్నీలో అజేయంగా ఉన్న ఆసీస్‌ను నిలువరించాలంటే హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలోని భారత జట్టు చెమటోడ్సాల్సిందే. ప్రస్తుతం 11 పాయింట్లతో పట్టికలో భారత్‌ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. నెదర్లాండ్స్‌ (23), ఆస్ట్రేలియా (18), అర్జెంటీనా (13) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని