ఇషాన్‌, అయ్యర్‌లపై వేటు!

రంజీ ట్రోఫీకి దూరంగా ఉన్న భారత ఆటగాళ్లు ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌పై బీసీసీఐ వేటు వేయనున్నట్లు సమాచారం. 2023-24 సీజన్‌ కేంద్ర కాంట్రాక్టు జాబితా నుంచి ఇషాన్‌, అయ్యర్‌లను తప్పించనున్నట్లు తెలుస్తోంది.

Published : 24 Feb 2024 03:38 IST

సెంట్రల్‌ కాంట్రాక్టుల నుంచి తొలగించే ప్రమాదం

దిల్లీ: రంజీ ట్రోఫీకి దూరంగా ఉన్న భారత ఆటగాళ్లు ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌పై బీసీసీఐ వేటు వేయనున్నట్లు సమాచారం. 2023-24 సీజన్‌ కేంద్ర కాంట్రాక్టు జాబితా నుంచి ఇషాన్‌, అయ్యర్‌లను తప్పించనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ బాధ్యతలకు దూరంగా ఉన్న ఇషాన్‌, అయ్యర్‌ భిన్నమైన కారణాలతో రంజీ ట్రోఫీలో ఆడలేదు. ఐపీఎల్‌ కోసం తన టెక్నిక్‌పై పని చేస్తున్నానని ఇషాన్‌ చెప్పగా.. వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు అయ్యర్‌ తెలిపాడు. అయితే ఇషాన్‌, అయ్యర్‌ వ్యవహార శైలి పట్ల సంతృప్తిగా లేని బీసీసీఐ వీరిద్దరికి సెంట్రల్‌ కాంట్రాక్టులు నిరాకరించాలని భావిస్తోందట. ‘‘అజిత్‌ అగర్కార్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ 2023-24 సీజన్‌ కోసం ఆటగాళ్ల కేంద్ర కాంట్రాక్టు జాబితాను దాదాపు ఖరారు చేసింది. త్వరలోనే బీసీసీఐ ఆ జాబితాను ప్రకటించనుంది. కిషన్‌, అయ్యర్‌ను జాబితా నుంచి తప్పించే అవకాశముంది. దేశవాళీ క్రికెట్లో ఆడాలన్న బోర్డు ఆదేశాల్ని ఇద్దరు ఆటగాళ్లు పట్టించుకోకపోవడమే ఇందుకు కారణం’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే నిరుడు వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున సత్తాచాటిన ఆటగాళ్లలో ఒకడైన అయ్యర్‌ను రంజీ మ్యాచ్‌ ఆడలేదన్న కారణంతో పక్కనబెట్టకపోవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. 2022-23 కాంట్రాక్టు ప్రకారం సి- కేటగిరిలో ఇషాన్‌ (ఏడాదికి రూ.1 కోటి), బి- కేటగిరిలో అయ్యర్‌ (రూ.3 కోట్లు) ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని