ఆఖరి బంతికి సిక్స్‌

మహిళల ప్రిమియర్‌ లీగ్‌ సీజన్‌-2లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ బోణీ కొట్టింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది.

Published : 24 Feb 2024 03:38 IST

ముంబయిని గెలిపించిన సజన
రాణించిన యాస్తిక, హర్మన్‌

బెంగళూరు: మహిళల ప్రిమియర్‌ లీగ్‌ సీజన్‌-2లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ బోణీ కొట్టింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. మొదట దిల్లీ 171/5 స్కోరు చేసింది. అలీస్‌ క్యాప్సీ (75; 53 బంతుల్లో 8×4, 3×6) టాప్‌ స్కోరర్‌. లక్ష్యాన్ని ముంబయి 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యాస్తిక భాటియా (57; 45 బంతుల్లో 8×4, 2×6), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (55; 34 బంతుల్లో 7×4, 1×6) విజయంలో కీలకపాత్ర పోషించారు. ఛేదనలో రెండో బంతికే మాథ్యూస్‌ హీలీ (0) వికెట్‌ పడినా... యాస్తిక నిలిచింది. మొదట నాట్‌ సీవర్‌ (19).. తర్వాత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తోడుగా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. అర్ధసెంచరీతో తర్వాత యాస్తిక ఔటైనా.. హర్మన్‌ప్రీత్‌, అమేలియా (24)తో కలిసి ఎదురుదాడి చేసి ముంబయిలో ఆశలు రేపింది. కానీ అమేలియా పెవిలియన్‌ చేరడంతో ముంబయికి ఎదురుదెబ్బ తగిలింది. ఆఖరి ఓవర్లో 12 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికే పూజ (1) వికెట్‌ను కూల్చిన క్యాప్సీ.. అయిదో బంతికి హర్మన్‌ప్రీత్‌ను కూడా ఔట్‌ చేయడంతో దిల్లీ విజయం ఖాయంగా కనిపించింది. కానీ ముంబయి గెలవాలంటే చివరి బంతికి 5 పరుగులు కావాల్సి ఉండగా.. సజన (6 నాటౌట్‌) సిక్స్‌ బాదేసి దిల్లీకి షాక్‌ ఇచ్చింది. మొదట దిల్లీ 3 పరుగులకే షెషాలీవర్మ (1) వికెట్‌ కోల్పోయినా.. జెమీమా(42), లానింగ్‌ (31)తో కలిసి అలీస్‌ క్యాప్సీ జట్టుకు భారీ స్కోరు సాధించి పెట్టింది. మ్యాచ్‌కు ముందు లీగ్‌ ఆరంభోత్సవ కార్యక్రమంలో బాలీవుడ్‌ స్టార్లు షారుక్‌ ఖాన్‌, షాహిద్‌ కపూర్‌, టైగర్‌ ష్రాఫ్‌ ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకున్నాయి.

దిల్లీ క్యాపిటల్స్‌: 171/5 (అలీస్‌ క్యాప్సీ 75, జెమీమా రోడ్రిగ్స్‌ 42, మెగ్‌ లానింగ్‌ 31; నాట్‌ సీవర్‌ 2/33, అమేలియా కెర్‌ 2/43)

ముంబయి ఇండియన్స్‌: 173/6 (యాస్తిక 57, హర్మన్‌ప్రీత్‌ 55, అమేలియా కెర్‌ 24; అరుంధతి రెడ్డి 2/27, అలీస్‌ క్యాప్సీ 2/23)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని