రూట్‌ అడ్డుపడ్డాడు..

అరంగేట్ర పేసర్‌ ఆకాశ్‌ దెబ్బకు 57కే 3 వికెట్లు.. 112కే సగం మంది బ్యాటర్లు పెవిలియన్‌లో.. తొలి సెషన్‌లోనే అయిదు వికెట్లు! ఇంకేముంది ఇంగ్లాండ్‌ను చుట్టేయడం.. నాలుగో టెస్టు తొలి రోజే భారత్‌ పట్టు బిగించడం ఖాయమనిపించింది!

Updated : 24 Feb 2024 08:06 IST

రాంచి టెస్టులో అద్భుత శతకం
ఇంగ్లాండ్‌ 302/7
ఆకాశ్‌ అరంగేట్రం అదుర్స్‌
రాంచి

అరంగేట్ర పేసర్‌ ఆకాశ్‌ దెబ్బకు 57కే 3 వికెట్లు.. 112కే సగం మంది బ్యాటర్లు పెవిలియన్‌లో.. తొలి సెషన్‌లోనే అయిదు వికెట్లు! ఇంకేముంది ఇంగ్లాండ్‌ను చుట్టేయడం.. నాలుగో టెస్టు తొలి రోజే భారత్‌ పట్టు బిగించడం ఖాయమనిపించింది! కానీ జట్టు స్వల్ప స్కోరుకే కుప్పకూలకుండా.. భారత్‌కు ఆలౌట్‌ చేసే అవకాశం లేకుండా జో రూట్‌ అడ్డుగా నిలిచాడు. బజ్‌బాల్‌ శైలిలో ఇమడలేక వరుస వైఫల్యాలు చవిచూస్తున్న ఈ మేటి బ్యాటర్‌.. దాన్ని విడిచి పెట్టి తన శైలిలో ఆడి శతకంతో అజేయంగా నిలిచాడు. రూట్‌ అడ్డుపడకపోయి ఉంటే రోహిత్‌ సేన తొలి రోజే మ్యాచ్‌ను శాసించే స్థాయికి చేరుకునేదే.

నాలుగో టెస్టు తొలి రోజే ఇంగ్లాండ్‌ను ఆలౌట్‌ చేసి.. మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించే అవకాశం టీమ్‌ఇండియా చేజారింది. పేలవ ఫామ్‌ నుంచి బయటపడ్డ రూట్‌ (106 బ్యాటింగ్‌; 226 బంతుల్లో 9×4).. భారత్‌కు అడ్డు పడ్డాడు. క్లిష్ట పరిస్థితుల్లో రూట్‌ పోరాటంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లిష్‌ జట్టు 7 వికెట్లకు 302 పరుగులతో నిలిచింది. ఫోక్స్‌ (47), క్రాలీ (42) కూడా రాణించారు. అరంగేట్ర పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ (3/70) కొత్త బంతితో వణికించాడు. సిరాజ్‌ (2/60) పాత బంతితో మెరిశాడు. రూట్‌తో కలిసి రాబిన్సన్‌ (31 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. ఈ జోడీ అభేద్యమైన ఎనిమిదో వికెట్‌కు 57 పరుగులు జతచేసింది. అస్థిర బౌన్స్‌, అధిక స్పిన్‌తో బ్యాటింగ్‌ కష్టంగా కనిపిస్తున్న పిచ్‌పై ఇంగ్లాండ్‌ను వీలైనంత త్వరగా ఆలౌట్‌ చేయకపోతే.. భారత్‌కు ప్రతికూల పరిస్థితులు తప్పవు.

ఏమా బౌలింగ్‌!: తొలి మూడు టెస్టుల్లో గొప్పగా రాణించిన ప్రధాన పేసర్‌ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. మరి ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ బ్యాటర్లకు కళ్లెం ఎవరు వేస్తారు? అనే ప్రశ్నకు సమాధానంగా ఆకాశ్‌ దూసుకొచ్చాడు. అరంగేట్రంలో ఈ 27 ఏళ్ల పేసర్‌ అదరగొట్టాడు. అప్పుడే పగుళ్లు వచ్చిన నిర్జీవమైన పిచ్‌పై నిప్పుల్లాంటి బంతులతో చెలరేగిపోయాడు. అధిక బౌన్స్‌తో హడలెత్తించాడు. కచ్చితమైన లెంగ్త్‌లో బంతులేస్తూ, స్వింగ్‌ రాబడుతూ.. బంతిబంతికీ బ్యాటర్లను పరీక్షించాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ టాప్‌ఆర్డర్‌ను కకావికలం చేశాడు. 7-0-24-3.. టెస్టు క్రికెట్లో ఆకాశ్‌ తొలి స్పెల్‌ ఇది. అరంగేట్ర పేసర్‌కు కల లాంటి ఆరంభమిది. స్టంప్స్‌ నుంచి 7-8 మీటర్ల మధ్య ప్రదేశంలో నిలకడగా బంతులేసి వికెట్లు సాధించాడు. తన రెండో ఓవర్లోనే ఆకాశ్‌.. క్రాలీని బౌల్డ్‌ చేశాడు. కానీ అది నోబాల్‌. ఆ తర్వాత వికెట్‌ కోసం అతను కాస్త ఎదురు చూడాల్సి వచ్చింది. సిరాజ్‌ను లక్ష్యంగా చేసుకున్న క్రాలీ.. ఒకే ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌ కొట్టాడు. కానీ 10 బంతుల వ్యవధిలో మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని ఆకాశ్‌ దెబ్బకొట్టాడు. ఫ్రంట్‌ఫుట్‌పై ఆడేలా డకెట్‌ (11)ను ఉసిగొల్పి బలితీసుకున్నాడు. అదే ఓవర్లో క్రీజు ముందుకు వచ్చిన పోప్‌ (0) వికెట్ల ముందు దొరికిపోయాడు. తన తర్వాతి ఓవర్లో మరోసారి ఆఫ్‌స్టంప్‌ ఆవల బంతి వేసి లోపలికి స్వింగ్‌ చేసిన ఆకాశ్‌.. క్రాలీ స్టంప్స్‌ను లేపేశాడు. బ్యాట్‌, శరీరం మధ్యలో నుంచి వెళ్లిన ఆ బంతి ఈ సారి మాత్రం నోబాల్‌ కాదు. క్రాలీ వెళ్లక తప్పలేదు. ఆ దశలో రూట్‌కు జతకలిసిన బెయిర్‌స్టో (38) ఎదురు దాడికి దిగాడు. కానీ అశ్విన్‌ (1/83) ముందు అతని ఆటలు సాగలేదు. స్వీప్‌ కోసం ప్రయత్నించి ఎల్బీగా నిష్క్రమించాడు. ఇక స్టోక్స్‌ (3)ను జడేజా (1/55) ఔట్‌ చేసిన బంతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా తక్కువ ఎత్తులో వచ్చిన బంతి.. బ్యాట్‌ అంచు కింద నుంచి వెళ్లి కాలి మడమ ఎత్తులో తాకింది. దీంతో సమీక్ష కూడా కోరకుండా, ఏం చేసేది లేదన్నట్లు స్టోక్స్‌ వెళ్లిపోయాడు. కానీ ఆ తర్వాత రూట్‌ పోరాటంతో ఇంగ్లాండ్‌ కోలుకుంది.

అతణ్ని ఆపలేక..: సిరీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు రూట్‌ ఆపద్బాంధవుడిలా మారాడు. తొలి ఇన్నింగ్స్‌లో 200 అయినా చేస్తుందా అనిపించిన జట్టును ఒంటరి పోరాటంతో ఆదుకున్నాడు. టీమ్‌ఇండియా అతణ్ని ఆపలేకపోయింది. బజ్‌బాల్‌ దూకుడుకు పోయి అనవసరంగా వికెట్లు పారేసుకుంటున్నాడనే విమర్శల నేపథ్యంలో.. రూట్‌ సహజ శైలి బ్యాటింగ్‌తో మునుపటి జోరును ప్రదర్శించాడు. పరిస్థితులకు తగ్గట్లుగా ఒత్తిడిని ఎదుర్కొంటూ గొప్పగా బ్యాటింగ్‌ చేశాడు. ఓపికతో నిలబడ్డాడు. ఇన్నింగ్స్‌కు ఇరుసులా మారి ఇప్పటికే పోరాడే స్కోరు అందించాడు. మంచి బంతులను గౌరవిస్తూ, చెత్త బంతుల కోసం ఎదురు చూస్తూ సాగిపోయాడు. 48 పరుగుల వద్ద కుల్‌దీప్‌ బౌలింగ్‌లో రూట్‌ బ్యాట్‌ను తాకి లెగ్‌సైడ్‌ వెళ్లిన బంతిని వికెట్‌కీపర్‌ ధ్రువ్‌ పట్టలేకపోయాడు. అస్థిర బౌన్స్‌ కారణంగా 114 బంతుల వరకూ అతను స్వీప్‌ షాటే ఆడలేదు. బౌలర్ల సవాలును కాచుకున్నాడు. సింగిల్స్‌, డబుల్స్‌ మీదే దృష్టి పెట్టి క్రీజులో పాతుకుపోయాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికే మూడు సార్లు తనను ఔట్‌ చేసిన బుమ్రా కూడా లేకపోవడం రూట్‌కు మరింతగా కలిసొచ్చింది. బ్యాక్‌ఫుట్‌పై స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్న రూట్‌కు.. ఫోక్స్‌ కూడా చక్కగా సహకరించాడు. ఆరో వికెట్‌కు 113 పరుగులు జోడించిన వీళ్లు రెండో సెషన్‌లో వికెట్‌ ఇవ్వలేదు. దీంతో ఈ సిరీస్‌లో తొలిసారి ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా ఆ జట్టు ఓ సెషన్‌ను ముగించింది. తమ బజ్‌బాల్‌కు విరుద్ధంగా ఆ సెషన్‌లో ఆ జట్టు కేవలం 2.33 రన్‌రేట్‌తో పరుగులు చేయడం గమనార్హం. పేస్‌ దళపతి సిరాజ్‌.. స్వల్ప వ్యవధిలో ఫోక్స్‌, హార్ట్‌లీ (13)ని ఔట్‌ చేశాడు. హార్ట్‌లీ అడ్డుకుందామని ప్రయత్నించగా.. ఆలస్యంగా బయటకు తిరిగిన బంతి స్టంప్స్‌ను లేపేసింది. దీంతో ఇంగ్లాండ్‌ ఆలౌటవుతుందేమో అనిపించింది. కానీ రాబిన్సన్‌తో కలిసి రూట్‌ ఆ అవకాశం ఇవ్వలేదు. 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్‌లో రాబిన్సన్‌ ఎల్బీగా ఔటవాల్సింది. అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చినా మూడు సమీక్ష అవకాశాలు అయిపోవడంతో భారత్‌ ఏం చేయలేకపోయింది. ఆకాశ్‌ బౌలింగ్‌లో కవర్‌డ్రైవ్‌తో రూట్‌ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 15 ఇన్నింగ్స్‌ల్లో అతనికిదే తొలి శతకం. తొలి రోజు చివరి ఓవర్లో యశస్వి జైస్వాల్‌ లెగ్‌స్పిన్‌ వేయడం విశేషం.

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: క్రాలీ (బి) ఆకాశ్‌ దీప్‌ 42; డకెట్‌ (సి) ధ్రువ్‌ (బి) ఆకాశ్‌ దీప్‌ 11; పోప్‌ ఎల్బీ (బి) ఆకాశ్‌ దీప్‌ 0; రూట్‌ బ్యాటింగ్‌ 106; బెయిర్‌స్టో ఎల్బీ (బి) అశ్విన్‌ 38; స్టోక్స్‌ ఎల్బీ (బి) జడేజా 3; ఫోక్స్‌ (సి) జడేజా (బి) సిరాజ్‌ 47; హార్ట్‌లీ (బి) సిరాజ్‌ 13; రాబిన్సన్‌ బ్యాటింగ్‌ 31; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం: (90 ఓవర్లలో 7 వికెట్లకు) 302 వికెట్ల పతనం: 1-47, 2-47, 3-57, 4-109, 5-112, 6-225, 7-245 బౌలింగ్‌: సిరాజ్‌ 13-3-60-2; ఆకాశ్‌ దీప్‌ 17-0-70-3; జడేజా 27-7-55-1; అశ్విన్‌ 22-1-83-1; కుల్‌దీప్‌ 10-3-21-0; యశస్వి జైస్వాల్‌ 1-0-6-0


100

ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో అశ్విన్‌ తీసిన వికెట్లు. ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌ అతనే. అంతే కాకుండా ఆ జట్టుపై 1000 పరుగులు చేయడంతో పాటు 100 వికెట్లు తీసిన నాలుగో అంతర్జాతీయ బౌలర్‌.


10

భారత్‌పై టెస్టుల్లో రూట్‌ శతకాలు. స్మిత్‌ (9)ను అధిగమించి భారత్‌పై అత్యధిక శతకాలు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు.


బాధను దాటి.. లక్ష్యాన్ని చేరి

తండ్రి ప్రభుత్వ పాఠశాలలో పీఈటీగా పనిచేసేవారు. తన తనయుడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తే చూడాలన్నది ఆయన ఆశ. కానీ ఆ కుమారుడికేమో క్రికెట్‌ అంటే పిచ్చి. అతణ్ని తల్లి ప్రోత్సహించేది. పేస్‌ బౌలర్‌గా అతను ఎదుగుతున్న సమయంలో ఆరు నెలల వ్యవధిలో తండ్రి, పెద్దన్నయ్య మరణించారు. దీంతో జీవితం ఒక్కసారిగా అతలాకుతలమైంది. ఆరుగురు తోబుట్టువుల్లో చివరివాడైన అతనిపై కుటుంబ భారం పడింది. ఓ వైపు పనిచేస్తూనే.. మరోవైపు ఆట కొనసాగించాడు. ఆ తల్లి కూడా మద్దతుగా నిలిచింది. శుక్రవారం రాంచి స్టేడియంలో రాహుల్‌ ద్రవిడ్‌ నుంచి ఆ పేసర్‌ టెస్టు టోపీ అందుకుంటే.. ఆ అమ్మ కళ్లు వర్షించాయి. ఆ పేసర్‌ పేరు.. ఆకాశ్‌ దీప్‌. ఆ తల్లి.. లద్దుమా దేవి. బిహార్‌లో పుట్టి, క్రికెట్‌ కోసం బెంగాల్‌కు మారిన ఆకాశ్‌ జీవితంలో ఎన్నో ఒడుదొడుకులున్నాయి. కొండంత బాధను దిగమింగిన అతను.. ఇప్పుడు లక్ష్యాన్ని సాధించాడు. క్రికెట్‌ కెరీర్‌ కోసం కోల్‌కతా వెళ్లిన ఆకాశ్‌ అక్కడ యునైటెడ్‌ సీసీ తరపున రాణించాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీ తీసుకోవడంతో అతని దశ తిరిగింది. బెంగాల్‌ తరపున రంజీల్లో, భారత్‌- ఎ జట్టులో నిలకడగా సత్తాచాటాడు. దీంతో భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఇప్పుడు అరంగేట్రంలోనే ఇంగ్లాండ్‌ టాప్‌-3 బ్యాటర్లను పెవిలియన్‌ చేర్చి అదరగొట్టాడు. తనయుడి అరంగేట్రం చూసేందుకు బిహార్‌లోని బడ్డీ గ్రామం నుంచి 300 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం చేసి ఆకాశ్‌ తల్లి, కుటుంబ సభ్యుడు రాంచి స్టేడియానికి వచ్చారు. ‘‘ఆకాశ్‌ ప్రభుత్వ ఉద్యోగం చేయాలని తన తండ్రి ఆశపడ్డారు. కానీ క్రికెట్‌ అంటేనే అతనికి ఇష్టం. నేను రహస్యంగా ఆకాశ్‌ను క్రికెట్‌ ఆడేందుకు పంపించేదాన్ని. నా భర్త, పెద్ద కొడుకు చనిపోయినా ఆకాశ్‌ను ఆగిపోనివ్వలేదు. ఈ రోజు వాళ్లిద్దరూ జీవించి ఉంటే ఎంతో సంతోషపడేవాళ్లు. ఈ అదృష్టం చాలా తక్కువ మందికే వస్తుంది. ఇప్పుడు అత్యంత గర్వపడే తల్లిని నేనే’’ అని లద్దుమా దేవి గద్గద స్వరంతో చెప్పింది.


బజ్‌బాల్‌ను పక్కన పెట్టి..

29, 2, 5, 16, 18, 7.. ఇవీ గత మూడు టెస్టుల్లోని ఆరు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా రూట్‌ చేసిన పరుగులు. భారత్‌ అంటే చాలు చెలరేగిపోయి, పరుగుల పండగ చేసుకునే రూట్‌ నుంచి ఇంగ్లాండ్‌ అభిమానులు ఇలాంటి ప్రదర్శన ఊహించలేదు. ముఖ్యంగా మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 18 పరుగులకు బుమ్రా బౌలింగ్‌లో రివర్స్‌ ర్యాంప్‌ ఆడి రూట్‌ ఔటయ్యాక.. ఇంగ్లాండ్‌ 224/2 నుంచి అనూహ్యంగా 319 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. దీంతో రూట్‌పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. దీంతో బజ్‌బాల్‌ను పక్కనపెట్టిన అతను.. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తనదైన శైలి బ్యాటింగ్‌తో సాగుతున్నాడు. 226 బంతుల్లో 46.90 స్ట్రైక్‌రేట్‌తో 106 పరుగులు చేశాడు. 9 ఫోర్లే కొట్టాడు. బజ్‌బాల్‌ శకంలో అత్యంత నెమ్మదైన సెంచరీ సాధించాడు. కానీ ఈ శతకం ఎంతో విలువైంది. ఇంగ్లాండ్‌లో ఉన్న పిచ్‌లు వేరు. అక్కడి బౌన్స్‌ వేరు. అందుకే ఎడ్జ్‌బాస్టన్‌లో కమిన్స్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్కూప్‌తో రూట్‌ సిక్సర్‌ కొట్టినా చెల్లింది. కానీ భారత్‌లో పరిస్థితులు, పిచ్‌లు వేరు. ఇక్కడ అలాంటి షాట్లు ఆడితే ఇబ్బందులు తప్పవని రూట్‌కు బాగా తెలిసొచ్చింది. అందుకే పాత రకం ఆటతీరుతో మెరిశాడు. ఈ ఇన్నింగ్స్‌లో బౌలర్ల నుంచి కఠిన పరీక్ష ఎదురైంది. బంతులు ప్యాడ్లకు తాకాయి. ఈ పరిస్థితుల్లో 33 ఏళ్ల రూట్‌ మేటి ఇన్నింగ్స్‌ ఆడాడనే చెప్పాలి. టెస్టుల్లో 31వ శతకాన్ని, భారత్‌పై పదో సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. బజ్‌బాల్‌ అంటూ ఇంగ్లాండ్‌కు దూకుడు నేర్పిన కోచ్‌ మెక్‌కలమ్‌, కెప్టెన్‌ స్టోక్స్‌లనూ రూట్‌ ఇన్నింగ్స్‌ ఆకట్టుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు