సంక్షిప్త వార్తలు

పారా ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు సుహాస్‌ యతిరాజ్‌, ప్రమోద్‌ భగత్‌, కృష్ణ సాగర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఎల్‌ఎల్‌-4 సింగిల్స్‌ సెమీస్‌లో యతిరాజ్‌ 21-16, 21-19తో లూకస్‌ మజుర్‌ (ఫ్రాన్స్‌)ను ఓడించాడు.

Published : 25 Feb 2024 04:19 IST

ఫైనల్లో యతిరాజ్‌, ప్రమోద్‌

పటాయా (థాయ్‌లాండ్‌): పారా ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు సుహాస్‌ యతిరాజ్‌, ప్రమోద్‌ భగత్‌, కృష్ణ సాగర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఎల్‌ఎల్‌-4 సింగిల్స్‌ సెమీస్‌లో యతిరాజ్‌ 21-16, 21-19తో లూకస్‌ మజుర్‌ (ఫ్రాన్స్‌)ను ఓడించాడు. ఈ టోర్నీలో తుదిపోరు చేరడం అతడికిదే తొలిసారి. ఎస్‌ఎల్‌-3 సింగిల్స్‌ సెమీస్‌లో ప్రమోద్‌ భగత్‌ 23-21, 20-22, 21-18తో డానియల్‌ బేతెల్‌ (ఇంగ్లాండ్‌)పై కష్టపడి నెగ్గాడు. ఎస్‌హెచ్‌-6 సింగిల్స్‌ సెమీస్‌లో కృష్ణ సాగర్‌ 21-16, 21-17తో విక్టర్‌ టవారెస్‌ (బ్రెజిల్‌)ను ఓడించాడు. మహిళల ఎస్‌యూ-5 కేటగిరిలో మనీషా రాందాస్‌ ఫైనల్‌ చేరింది. సెమీస్‌లో 19-21, 21-19, 21-14తో మాద్‌ లెఫోర్ట్‌ (ఫ్రాన్స్‌)పై నెగ్గింది. ఎస్‌హెచ్‌-6 మహిళల డబుల్స్‌లో రచన-నిత్యశ్రీ కూడా తుదిపోరు చేరారు. నిత్యశ్రీ (ఎస్‌హెచ్‌-6), పలక్‌ కోహ్లి (ఎస్‌ఎల్‌-4), మనీషా రాందాస్‌ (ఎల్‌ఎల్‌-3) సింగిల్స్‌ సెమీస్‌లో ఓడి కాంస్యాలతో సంతృప్తిపడ్డారు.


హర్షితకు రజతం

దిల్లీ: ఆసియా ట్రాక్‌ సైక్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ అమ్మాయి హర్షిత జక్కర్‌ రజతం గెలుచుకుంది. శనివారం జూనియర్‌ మహిళల వ్యక్తిగత పర్స్యూట్‌ కేటగిరిలో హర్షిత 2 నిమిషాల 32.08 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు పారా విభాగంలో భారత సైక్లిస్ట్‌లు సత్తా చాటారు. మహిళల కేటగిరిలో జ్యోతి గడెరియా (5 నిమిషాల 19.88 సె) స్వర్ణం గెలుచుకోగా.. పురుషుల వ్యక్తిగత పర్స్యూట్‌లో అర్షద్‌ షేక్‌ స్వర్ణం, ఆర్యవర్దన్‌ రజతం సొంతం చేసుకున్నారు.


భారత్‌కు నాలుగు పతకాలు

బాగ్దాద్‌: ఆసియా కప్‌ ఆర్చరీ లెగ్‌ 1లో భారత ఆర్చర్లు సత్తా చాటుతున్నారు. కాంపౌండ్‌ విభాగంలో మూడు స్వర్ణాలు సహా భారత్‌కు నాలుగు పతకాలు లభించాయి. ఆర్చర్లు మరో పది పతకాలు ఖాయం చేశారు. కాంపౌండ్‌లో పురుషులు (ప్రథమేశ్‌, ప్రియాంశ్‌, కుశాల్‌), మహిళలు (అదితి, ప్రియ, ప్రణీత్‌ కౌర్‌), మిక్స్‌డ్‌ కాంపౌండ్‌ (ప్రథమేశ్‌-అదితి) జట్లు స్వర్ణాలు గెలిచాయి. మూడు జట్లూ ఫైనల్లో ఇరాన్‌ జట్లను ఓడించాయి. కాంపౌండ్‌ మహిళల వ్యక్తిగత విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌ అదితి స్వామి కాంస్యం గెలుచుకుంది. మహిళల వ్యక్తిగత రికర్వ్‌ ఫైనల్లో దీపిక కుమారితో సిమ్రన్‌జీత్‌, పురుషుల వ్యక్తిగత రికర్వ్‌ ఫైనల్లో తరుణ్‌దీప్‌ రాయ్‌తో ధీరజ్‌ బొమ్మదేవర తలపడతారు. పురుషుల వ్యక్తిగత కాంపౌండ్‌లో కుశాల్‌ దలాల్‌, ప్రథమేశ్‌ స్వర్ణం కోసం పోటీపడతారు.


షూటౌట్లో భారత్‌ ఓటమి

రవూర్కెలా: ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో శనివారం భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో పెనాల్టీ షూటౌట్లో 0-3తో ఓటమి పాలైంది. నిర్ణీత సమయంలో 2-2తో స్కోరు సమమైంది. 20వ నిమిషంలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌, 29వ నిమిషంలో అమిత్‌ రోహిదాస్‌ గోల్స్‌ కొట్టారు. ఆసీస్‌కు గోవర్స్‌ బ్లేక్‌ 25వ నిమిషంలో తొలి గోల్‌ కొట్టాడు. 53వ నిమిషంలో టామ్‌ గోల్‌ కొట్టి స్కోరు సమం చేశాడు. మ్యాచ్‌ షూటౌట్‌కు మళ్లింది. అందులో బ్రాండ్‌, ఒగిల్వీ, టామ్‌ వరుసగా గోల్స్‌ కొట్టగా.. భారత్‌ తరఫున ఆకాశ్‌దీప్‌, సుఖ్‌జీత్‌, లలిత్‌ కుమార్‌ విఫలమవడంతో మ్యాచ్‌ ఆసీస్‌ సొంతమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని