మధ్యప్రదేశ్‌కు ఆధిక్యం

మధ్యప్రదేశ్‌తో రంజీ క్వార్టర్‌ఫైనల్లో ఆంధ్ర తడబడింది. బంతితో గొప్పగా రాణించినా.. బ్యాటింగ్‌ వైఫల్యంతో మ్యాచ్‌లో పైచేయి సాధించే అవకాశాన్ని ఉపయోగించుకోలేపోయింది.

Published : 25 Feb 2024 04:20 IST

ఆంధ్రతో రంజీ

ఇందౌర్‌: మధ్యప్రదేశ్‌తో రంజీ క్వార్టర్‌ఫైనల్లో ఆంధ్ర తడబడింది. బంతితో గొప్పగా రాణించినా.. బ్యాటింగ్‌ వైఫల్యంతో మ్యాచ్‌లో పైచేయి సాధించే అవకాశాన్ని ఉపయోగించుకోలేపోయింది. బలంగా పుంజుకున్న మధ్యప్రదేశ్‌ 62 పరుగుల విలువైన తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సంపాదించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 234/9తో శనివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన మధ్యప్రదేశ్‌, అదే స్కోరు వద్ద ఆలౌటైంది. అనంతరం కార్తికేయ (3/41), అనుభవ్‌ అగర్వాల్‌ (3/33), అవేష్‌ ఖాన్‌ (2/33), ఖెజ్రోలియా (2/47) ధాటికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌటైంది. కరణ్‌ షిండే (38) టాప్‌ స్కోరర్‌. రికీ భుయ్‌ 32 పరుగులు చేశాడు. ఆట ముగిసే సమయానికి మధ్యప్రదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. మొత్తం 83 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ముషీర్‌ ఖాన్‌ డబుల్‌ సెంచరీ: ముషీర్‌ ఖాన్‌ డబుల్‌ సెంచరీ (203 నాటౌట్‌) బాదడంతో బరోడాతో క్వార్టర్స్‌లో ముంబయి మంచి స్కోరు సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 248/5తో రెండో రోజు, శనివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ముంబయి.. 384 పరుగులకు ఆలౌటైంది. ముషీర్‌ (ఓవర్‌నైట్‌ 128) చక్కని బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. హార్దిక్‌ తామోర్‌ (57)తో ఆరో వికెట్‌కు అతడు 181 పరుగులు జోడించాడు. ఆట ముగిసే సమయానికి బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 127 పరుగులు చేసింది. మరోవైపు కర్ణాటకతో క్వార్టర్స్‌లో ఓవర్‌నైట్‌ స్కోరు 261/3తో శనివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన విదర్భ 460 పరుగులకు ఆలౌటైంది. కరుణ్‌ నాయర్‌ (90) రాణించాడు. ఆట ఆఖరుకు కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 98/2తో నిలిచింది. సౌరాష్ట్రతో క్వార్టర్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి తమిళనాడు 6 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది.  సౌరాష్ట్ర మొదటి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే ఆలౌటైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని