తండ్రి ఆటోలో..తనయ ఆటలో

సజీవన్‌ సజన.. మహిళల ప్రిమియర్‌ లీగ్‌ సీజన్‌-2 మొదలయ్యే వరకు ఈ పేరు ఎవరికీ తెలియదు. కానీ ఒకే ఒక్క సిక్సర్‌తో ఈ అమ్మాయి అందరికి పరిచయమైపోయింది.

Updated : 25 Feb 2024 07:10 IST

ఈనాడు క్రీడావిభాగం: సజీవన్‌ సజన.. మహిళల ప్రిమియర్‌ లీగ్‌ సీజన్‌-2 మొదలయ్యే వరకు ఈ పేరు ఎవరికీ తెలియదు. కానీ ఒకే ఒక్క సిక్సర్‌తో ఈ అమ్మాయి అందరికి పరిచయమైపోయింది. ఆడింది ఒకే బంతి అయినా.. ఒక్క షాట్‌తో ఆమె పేరు మార్మోగింది. ముంబయి ఇండియన్స్‌-దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య డబ్ల్యూపీఎల్‌ తొలి మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్సర్‌ బాదిన సజన.. దిల్లీని కంగుతినిపించింది. అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.

నాన్న ఆటోవాలా: కేరళకు చెందిన 29 ఏళ్ల సజన పేద కుటుంబం నుంచి వచ్చింది. నాన్న సజీవన్‌ ఆటో నడిపితేనే గడిచేది. క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్‌, ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లోనూ సజనకు ప్రవేశం ఉంది. వాయనాడ్‌ జిల్లా ఫుట్‌బాల్‌ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించింది. అయితే క్రికెట్‌నే ఎక్కువగా ఇష్టపడిన సజన.. ఇంటి దగ్గర పొలంలో కొబ్బరి మట్టనే బ్యాట్‌గా చేసుకుని ఆడేది. ఆమె ఆసక్తిని గుర్తించిన నాన్న ఆ ఆటలో ప్రోత్సహించాడు. పాఠశాల పీఈటీ ఎల్సమ్మ కూడా ఆమె ఈ ఆటలో కొనసాగేందుకు సాయం చేసింది. కృష్ణగిరి స్టేడియంలో ఒకరోజు భారత మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ను కలిసే అవకాశం రావడం సజన జీవితాన్ని మలుపు తిప్పింది. అతడిచ్చిన స్ఫూర్తితో పట్టుదలగా ఆడడం మొదలుపెట్టిన సజన.. వాయనాడ్‌ జిల్లాకు అండర్‌-19లో ప్రాతినిథ్యం వహించింది. స్థిరంగా రాణించి అందరి దృష్టిలో పడింది. ఆరంభంలో రోజుకు రూ.150 భత్యం వస్తేనే గొప్పగా భావించేది. ఆ తర్వాత క్రికెట్లో ఎదగడంతో కేరళ అండర్‌-19 కెప్టెన్‌ అయింది. బలంగా పొడవుగా ఉండే సజన.. హిట్టర్‌గా పేరు పొందింది. ఆఫ్‌ స్పిన్నర్‌గానూ రాణించింది.

వేలంలో రూ.15 లక్షలకు: 2018లో వరదల కారణంగా ఆమె కుటుంబం ఎంతో ఇబ్బందిపడింది. క్రికెట్‌కు చాలాకాలం దూరమైంది. ఆ తర్వాత కొవిడ్‌ సమయంలోనూ మైదానంలోకి రాలేదు. ఆపై బరిలో దిగి దేశవాళీ పోటీల్లో సత్తా చాటింది. 2022 నవంబర్‌లో భారత్‌-ఏకు ఎంపికైంది. 2023 డబ్ల్యూపీఎల్‌ తొలి సీజన్లో ఛాన్స్‌ వస్తుందని భావించినా.. ఏ జట్టూ సజనపై ఆసక్తి చూపించలేదు. కానీ దేశవాళీలో ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ సత్తా చాటింది. దీంతో డబ్ల్యూపీఎల్‌ సీజన్‌-2 వేలంలో ముంబయి ఇండియన్స్‌ సజనను కనీస ధర రూ.5 లక్షలు అయితే రూ.15 లక్షలు పెట్టి మరీ దక్కించుకుంది. తొలి మ్యాచ్‌లోనే ముంబయి నమ్మకాన్ని ఆమె నిలబెట్టింది. భారత జట్టుకు ఆడాలనేది ఈ ఆల్‌రౌండర్‌ కల.  మిగిలిన అమ్మాయిలతో పోలిస్తే భారీగా ఉండే సజనకు ‘ఉమెన్‌ కీరన్‌ పొలార్డ్‌’ అనే పేరు పెట్టారు ముంబయి అమ్మాయిలు. పొలార్డ్‌ మాదిరే బంతిని బలంగా బాదే సజన.. తొలి మ్యాచ్‌లోనే తానేంటో నిరూపించుకుంది. పొలిటికల్‌ సైన్స్‌లో డిగ్రీ చేసిన సజన.. ఓ తమిళ చిత్రంలోనూ నటించడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని