ఆశ మాయ

16  ఓవర్లలో  యూపీ వారియర్స్‌ స్కోరు 126/3. క్రీజులో బాగా కుదురుకున్న గ్రేస్‌ హారిస్‌ (38; 22 బంతుల్లో 4×4, 2×6), శ్వేత సెహ్రావత్‌ (31) ఉన్నారు. చివరి 4 ఓవర్లలో 32 పరుగులే చేయాల్సి ఉండడంతో యూపీ సునాయాసంగా గెలిచేస్తుందనుకున్నారంతా.

Published : 25 Feb 2024 04:27 IST

ఒకే ఓవర్లో 3 వికెట్లు
యూపీకి బెంగళూరు చెక్‌

బెంగళూరు: 16  ఓవర్లలో  యూపీ వారియర్స్‌ స్కోరు 126/3. క్రీజులో బాగా కుదురుకున్న గ్రేస్‌ హారిస్‌ (38; 22 బంతుల్లో 4×4, 2×6), శ్వేత సెహ్రావత్‌ (31) ఉన్నారు. చివరి 4 ఓవర్లలో 32 పరుగులే చేయాల్సి ఉండడంతో యూపీ సునాయాసంగా గెలిచేస్తుందనుకున్నారంతా. కానీ అప్పుడే శోభన ఆశ అద్భుతం చేసింది. ఒకే ఓవర్లో శ్వేత, గ్రేస్‌, కిరణ్‌ నవ్‌గిరె (1)ల వికెట్లు పడగొట్టింది. దీంతో ఒక్కసారిగా యూపీ ఓటమి బాటలోకి వెళ్లిపోయింది. తర్వాత మిగతా బ్యాటర్లు పోరాడినా ఫలితం లేకపోయింది. శనివారం ఉత్కంఠభరితంగా ముగిసిన డబ్ల్యూపీఎల్‌ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. డబ్ల్యూపీఎల్‌లో 5 వికెట్ల ప్రదర్శన చేసిన తొలి భారత బౌలర్‌గా రికార్డు సృష్టించిన శోభన ఆశ (5/22) జట్టుకు అనూహ్య విజయాన్నందించింది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ.. నిర్ణీత ఓవర్లలో 155/7కు పరిమితమైంది. అంతకుముందు ఆశ.. వృంద (18), తాలియా (22)లను ఒకే ఓవర్లో ఔట్‌ చేసింది. మొదట బెంగళూరు 6 వికెట్లకు 157 పరుగులు చేసింది. 8 ఓవర్లకు 54/3తో నిలిచిన ఆ జట్టుకు తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (53; 44 బంతుల్లో 7×4), రిచా ఘోష్‌ (62; 37 బంతుల్లో 12×4) మెరుగైన స్కోరునందించారు. యూపీ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్‌ (2/24) ఆకట్టుకుంది.
సంక్షిప్త స్కోర్లు... బెంగళూరు: 157/6 (సబ్బినేని మేఘన 53, రిచా ఘోష్‌ 62; రాజేశ్వరి గైక్వాడ్‌ 2/24, గ్రేస్‌ హారిస్‌ 1/22, దీప్తి శర్మ 1/23, సోఫీ ఎకిల్‌స్టోన్‌ 1/26)
యూపీ: 155/7 (గ్రేస్‌ హారిస్‌ 38, శ్వేత సెహ్రావత్‌ 31; శోభన ఆశ 5/22, జార్జియా వేర్‌హామ్‌ 1/23)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు