స్పిన్‌ వలలో చిక్కి..

ఆడుతోంది స్వదేశంలో. టీమ్‌ఇండియాకు బాగా అలవాటైన పరిస్థితులు. కానీ ఇంగ్లాండ్‌ స్పిన్నర్లకు భారత బ్యాటర్లు మరోసారి దాసోహమన్నారు. అస్థిర బౌన్స్‌తో, పిచ్‌పై పగుళ్లతో, స్పిన్‌తో బ్యాటింగ్‌కు కఠినంగా మారిన పిచ్‌పై మనవాళ్లు నిలబడలేకపోయారు.

Updated : 25 Feb 2024 08:12 IST

కష్టాల్లో భారత్‌
తొలి ఇన్నింగ్స్‌లో 219/7
ఇంగ్లాండ్‌ 353 ఆలౌట్‌

ఆడుతోంది స్వదేశంలో. టీమ్‌ఇండియాకు బాగా అలవాటైన పరిస్థితులు. కానీ ఇంగ్లాండ్‌ స్పిన్నర్లకు భారత బ్యాటర్లు మరోసారి దాసోహమన్నారు. అస్థిర బౌన్స్‌తో, పిచ్‌పై పగుళ్లతో, స్పిన్‌తో బ్యాటింగ్‌కు కఠినంగా మారిన పిచ్‌పై మనవాళ్లు నిలబడలేకపోయారు. రెండో టెస్టు మాత్రమే ఆడుతున్న యువ ఆఫ్‌ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌కు చిక్కి విలవిల్లాడారు. ఫలితం.. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కష్టాల్లో భారత్‌. ఇప్పటికే 7 వికెట్లు పడ్డాయి. పరుగులేమో 219. ప్రత్యర్థి స్కోరును అందుకోవాలంటే ఇంకా 134 పరుగులు చేయాలి. క్రీజులో ఉన్న ధ్రువ్‌, కుల్‌దీప్‌ పోరాడుతున్నారు. వీళ్ల ప్రయత్నం జట్టును రక్షిస్తుందా అన్నదే ప్రశ్న. ఇప్పటికే స్పిన్‌కు అనుకూలంగా మారిన పిచ్‌పై నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ మరింత కష్టమవుతుంది. అందుకే వీలైనంత వరకూ ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించడం ముఖ్యం. ఆదివారం ఆటతో మ్యాచ్‌లో భారత గమనమేంటో తేలిపోతుంది.

రాంచి ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టులో భారత్‌ కష్టాల్లో పడింది. ప్రత్యర్థి స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోలేక చిక్కుల్లో చిక్కింది. షోయబ్‌ బషీర్‌ (4/84) దెబ్బకు శనివారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 7 వికెట్లకు 219 పరుగులతో నిలిచింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్‌ (73; 117 బంతుల్లో 8×4, 1×6) మాత్రమే రాణించాడు. కుల్‌దీప్‌ (17 బ్యాటింగ్‌; 72 బంతుల్లో 1×4)తో కలిసి ధ్రువ్‌ జురెల్‌ (30 బ్యాటింగ్‌; 58 బంతుల్లో 2×4, 1×6) పోరాడుతున్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 302/7తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌ 353 పరుగులకు ఆలౌటైంది. రూట్‌ (122 నాటౌట్‌; 274 బంతుల్లో 10×4) అజేయంగా మిగిలాడు. రాబిన్సన్‌ (58; 96 బంతుల్లో 9×4, 1×6) టెస్టుల్లో తొలి అర్ధసెంచరీ చేశాడు. జడేజా (4/67) ఇంగ్లాండ్‌ తోక తెంచాడు.
మళ్లీ అతనే: ఓ వైపు సహచర ఆటగాళ్లు పెవిలియన్‌ చేరుతున్నారు.. మరోవైపు ప్రత్యర్థి స్పిన్నర్లు బషీర్‌, హార్ట్‌లీ (2/47) చెలరేగుతున్నారు. పిచ్‌ ఏమో బ్యాటింగ్‌కు ప్రమాదకరంగా మారుతోంది. ఏ బంతి బౌన్స్‌ అవుతుందో, ఏ బంతి కాలి మడమ ఎత్తులో వస్తుందో తెలియడం లేదు. బంతి ఎటు తిరుగుతుందో అంచనా వేయడమూ సవాలుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో జైస్వాల్‌ మరోసారి నిలబడ్డాడు. గొప్ప పట్టుదల ప్రదర్శించాడు. మూడో ఓవర్లోనే రోహిత్‌ (2) ఔటైనా.. శుభ్‌మన్‌ (38)తో కలిసి జైస్వాల్‌ రెండో వికెట్‌కు 82 పరుగులు జోడించాడు. పరిస్థితులకు అలవాటు పడేందుకు సమయం తీసుకున్న ఈ జంట.. లంచ్‌ తర్వాత జోరు పెంచింది. బంతికి తగ్గట్లుగా బ్యాక్‌ఫుట్‌, ఫ్రంట్‌ఫుట్‌పై ఆడుతూ స్పిన్నర్లను జైస్వాల్‌ సమర్థంగా ఎదుర్కొన్నాడు. కానీ ఇన్నింగ్స్‌ సాఫీగా సాగుతున్న సమయంలో గిల్‌ను ఔట్‌ చేసి బషీర్‌ దెబ్బకొట్టాడు. ఆఫ్‌స్టంప్‌ ఆవల పడి లోపలికి తిరిగిన బంతి గిల్‌ ప్యాడ్లకు తాకింది. అంతే వికెట్ల పతనానికి గేట్లెత్తినట్లయింది. వరుసగా అవకాశాలు వృథా చేసుకుంటున్న రజత్‌్ (17) మళ్లీ నిరాశపరిచాడు. హార్ట్‌లీ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లతో ఎదురుదాడి చేసేలా కనిపించిన జడేజా (12).. బషీర్‌ బౌలింగ్‌లో అధిక బౌన్స్‌కు బోల్తా పడ్డాడు. అర్ధశతకం పూర్తిచేసిన జైస్వాల్‌ మరోసారి భారీ ఇన్నింగ్స్‌ ఆడతాడనిపించింది. కానీ బషీర్‌ వేసిన లెంగ్త్‌ బంతి చాలా తక్కువ ఎత్తులో వచ్చి అతని ఇన్నింగ్స్‌కు ముగింపు పలికింది. ఆ బంతిని అడ్డుకునేందుకు జైస్వాల్‌ ప్రయత్నించాడు. కానీ అది బ్యాట్‌కు తాకి అక్కడే నేలపై పడి బౌన్స్‌ అయి స్టంప్స్‌ను లేపేసింది. హార్ట్‌లీ స్వల్ప వ్యవధిలో సర్ఫరాజ్‌ (14), అశ్విన్‌ (1)ను బుట్టలో వేసుకోవడంతో జట్టు 177/7తో పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆ ఇద్దరు నిలబడి: ధ్రువ్‌, కుల్‌దీప్‌ పోరాటం లేకుంటే భారత తొలి ఇన్నింగ్స్‌ ఇప్పటికే ముగిసేది. వీళ్లిద్దరు క్రీజులో నిలబడకపోయి ఉంటే భారత్‌ 200 పరుగులు కూడా దాటేది కాదేమో! బంతిని ఆలస్యంగా ఆడుతూ.. తొందరపాటు లేకుండా ఈ జోడీ అభేద్యమైన ఎనిమిదో వికెట్‌కు 106 బంతుల్లో 42 పరుగులు జతచేసింది. చకచకా వికెట్లు పడటంతో చాలా జాగ్రత్తగా ఈ జంట బ్యాటింగ్‌ చేసింది. ప్రత్యర్థి స్పిన్‌ సవాలుకు ఎదురు నిలిచింది. రెండో టెస్టు మాత్రమే ఆడుతున్న యువ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ గొప్ప సంకల్పంతో క్రీజులో నిలబడ్డాడు. పిచ్‌ పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్‌ కొనసాగించాడు. అవకాశం దొరికితే షాట్లు ఆడటానికి వెనకాడలేదు. మరోవైపు స్పిన్నర్‌ కుల్‌దీప్‌ వికెట్‌ ఇవ్వకూడదనే లక్ష్యంగా ఓవర్లకు ఓవర్లు కరిగించాడు. కుల్‌దీప్‌ లాంటి పట్టుదల ఎవరైనా భారత ప్రధాన బ్యాటర్‌ చూపించి ఉంటే జట్టు పరిస్థితి వేరేలా ఉండేది. మూడో రోజు ధ్రువ్‌, కుల్‌దీప్‌ వీలైనంత ఎక్కువసేపు బ్యాటింగ్‌ చేస్తేనే భారత్‌కు ప్రమాదం తప్పుతుంది. ఇంగ్లాండ్‌ ఆధిక్యాన్ని 100లోపే పరిమితం చేయడం టీమ్‌ఇండియాకు అవసరం. ఇక 20 ఏళ్ల బషీర్‌.. రెండు సెషన్లలో కలిపి వరుసగా 31 ఓవర్ల మారథాన్‌ స్పెల్‌ వేయడం విశేషం.
కీలక పరుగులు: అంతకుముందు రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌ ఓవర్‌నైట్‌ స్కోరుకు మరో   53 పరుగులు జోడించింది. భారత బ్యాటింగ్‌ చూసిన తర్వాత ఈ పరుగులు ఎంత కీలకమైనవో అర్థం చేసుకోవచ్చు. ఓవర్‌నైట్‌ బ్యాటర్లు రూట్‌ (ఓవర్‌నైట్‌ స్కోరు 106), రాబిన్సన్‌ (ఓవర్‌నైట్‌ స్కోరు 31) ఎనిమిదో వికెట్‌కు 102 పరుగులు జతచేశారు. మన బౌలర్లు ఈ జోడీని త్వరగా విడగొట్టలేకపోయారు. పేసర్లు సిరాజ్‌, ఆకాశ్‌ బౌలింగ్‌లో బౌండరీలతో దూకుడు ప్రదర్శించిన రాబిన్సన్‌ టెస్టుల్లో   తన అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. అయితే జడేజా బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌కు ప్రయత్నించి వికెట్‌కీపర్‌ చేతికి రాబిన్సన్‌ చిక్కాడు. ఆ తర్వాత చివరి రెండు వికెట్లనూ ఖాతాలో వేసుకున్న జడేజా.. మరో ఆరు పరుగులకే ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ ముగించాడు.


ఆ ముగ్గురూ అలా..

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు అంపైర్‌ కాల్‌తో పెవిలియన్‌ చేరడం నష్టం చేసిందనే చెప్పాలి. క్రీజులో కుదురుకున్న గిల్‌ ఇలా మొదట ఔటవడం జట్టును గట్టి దెబ్బతీసింది. బషీర్‌ బౌలింగ్‌లో ఎల్బీ అప్పీల్‌ చేయగా అంపైర్‌ ఔటిచ్చాడు. కానీ బంతిని ఆఫ్‌స్టంప్‌ ఆవల ఆడాననే ఉద్దేశంతో గిల్‌ సమీక్ష కోరాడు. కానీ ఇందులో ఇంపాక్ట్‌ ఏమో అంపైర్‌ కాల్‌ అని వచ్చింది. అనంతరం బషీర్‌ మరో ఓవర్లో రజత్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. కానీ బంతి లెగ్‌సైడ్‌ వెళ్లేలా కనిపించడంతో రజత్‌ సమీక్ష కోరాడు. అప్పుడు వికెట్స్‌.. అంపైర్‌ కాల్‌గా వచ్చింది. ఆ తర్వాత హార్ట్‌లీ బౌలింగ్‌లో అశ్విన్‌కు కూడా ఇలాగే వికెట్స్‌.. అంపైర్‌ కాల్‌గా తేలింది. అంటే లెగ్‌స్టంప్స్‌ను బంతి కాస్త తాకింది. ఒకవేళ ఈ ముగ్గురిని మైదానంలోని అంపైర్‌ నాటౌట్‌గా ఇస్తే.. ఇంగ్లాండ్‌ సమీక్ష కోరినా ప్రయోజనం ఉండేది కాదు.


5

ఓ టెస్టు సిరీస్‌లో 600 కంటే ఎక్కువ పరుగులు చేసిన భారత బ్యాటర్లలో యశస్వి స్థానం. అతని కంటే ముందు గావస్కర్‌, కోహ్లి, ద్రవిడ్‌, దిలీప్‌ సర్దేశాయ్‌ ఉన్నారు. గావస్కర్‌, కోహ్లి, ద్రవిడ్‌ రెండేసి సార్లు ఈ ఘనత సాధించారు. అలాగే ఓ టెస్టు సిరీస్‌లో 700 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక భారత బ్యాటర్‌గా గావస్కర్‌ కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో 7 ఇన్నింగ్స్‌ల్లో 103 సగటుతో 618 పరుగులు చేసిన జైస్వాల్‌.. గావస్కర్‌ సరసన చేరే అవకాశముంది.


75

ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ నమోదైన సిక్సర్లు.   ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్ల (నిరుడు ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మధ్య యాషెస్‌లో 74) రికార్డు బద్దలైంది.


ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: క్రాలీ (బి) ఆకాశ్‌ దీప్‌ 42; డకెట్‌ (సి) ధ్రువ్‌ (బి) ఆకాశ్‌ దీప్‌ 11; పోప్‌ ఎల్బీ (బి) ఆకాశ్‌ దీప్‌ 0; రూట్‌ నాటౌట్‌ 122; బెయిర్‌స్టో ఎల్బీ (బి) అశ్విన్‌ 38; స్టోక్స్‌ ఎల్బీ (బి) జడేజా 3; ఫోక్స్‌ (సి) జడేజా (బి) సిరాజ్‌ 47; హార్ట్‌లీ (బి) సిరాజ్‌ 13; రాబిన్సన్‌ (సి) ధ్రువ్‌ (బి) జడేజా 58; బషీర్‌ (సి) రజత్‌ (బి) జడేజా 0; అండర్సన్‌ ఎల్బీ (బి) జడేజా 0, ఎక్స్‌ట్రాలు 19; మొత్తం: (104.5 ఓవర్లలో ఆలౌట్‌) 353; వికెట్ల పతనం: 1-47, 2-47, 3-57, 4-109, 5-112, 6-225, 7-245, 8-347, 9-349; బౌలింగ్‌: సిరాజ్‌ 18-3-78-2; ఆకాశ్‌ దీప్‌ 19-0-83-3; జడేజా 32.5-7-67-4; అశ్విన్‌ 22-1-83-1; కుల్‌దీప్‌ 12-4-22-0; యశస్వి జైస్వాల్‌ 1-0-6-0
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: యశస్వి (బి) బషీర్‌ 73; రోహిత్‌ (సి) ఫోక్స్‌ (బి) అండర్సన్‌ 2; శుభ్‌మన్‌ ఎల్బీ (బి) బషీర్‌ 38; రజత్‌ ఎల్బీ (బి) బషీర్‌ 17; జడేజా (సి) పోప్‌ (బి) బషీర్‌ 12; సర్ఫరాజ్‌ (సి) రూట్‌ (బి) హార్ట్‌లీ 14; ధ్రువ్‌ బ్యాటింగ్‌ 30; అశ్విన్‌ ఎల్బీ (బి) హార్ట్‌లీ 1; కుల్‌దీప్‌ బ్యాటింగ్‌ 17; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం: (73 ఓవర్లలో 7 వికెట్లకు) 219; వికెట్ల పతనం: 1-4, 2-86, 3-112, 4-130, 5-161, 6-171, 7-177; బౌలింగ్‌: అండర్సన్‌ 12-4-36-1; రాబిన్సన్‌ 9-0-39-0; షోయబ్‌ బషీర్‌ 32-4-84-4; హార్ట్‌లీ 19-5-47-2; రూట్‌ 1-0-1-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు