తిప్పేశారు.. గెలుపు వైపు!

తొలి ఇన్నింగ్స్‌లో అసామాన్య పోరాటంతో ధ్రువ్‌.. భారత్‌ను ఆదుకున్నాడు. అయినా రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ చెలరేగితే ఏంటి పరిస్థితి అనుకుంటుంటే.. ఆ అవకాశం ఎందుకు ఇస్తామంటూ అశ్విన్‌, కుల్‌దీప్‌ స్పిన్‌తో మాయ చేశారు.

Updated : 26 Feb 2024 06:54 IST

విజృంభించిన అశ్విన్‌, కుల్‌దీప్‌
నాలుగో టెస్టులో విజయం దిశగా భారత్‌
లక్ష్యం 192.. ప్రస్తుతం 40/0
ఇంగ్లాండ్‌ 145కే ఆలౌట్‌
రాంచి

తొలి ఇన్నింగ్స్‌లో అసామాన్య పోరాటంతో ధ్రువ్‌.. భారత్‌ను ఆదుకున్నాడు. అయినా రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ చెలరేగితే ఏంటి పరిస్థితి అనుకుంటుంటే.. ఆ అవకాశం ఎందుకు ఇస్తామంటూ అశ్విన్‌, కుల్‌దీప్‌ స్పిన్‌తో మాయ చేశారు. ఒక్క రోజులో ఎన్నో నాటకీయ మలుపులు తిరిగిన నాలుగో  టెస్టు చివరకు భారత్‌ వైపే మళ్లింది!

46 పరుగుల ఆధిక్యం కోల్పోయినా.. బజ్‌బాల్‌ అంటూ ఎదురుదాడి చేసే ఇంగ్లాండ్‌పై   టీమ్‌ఇండియా పుంజుకున్న తీరు అమోఘం. పరాజయ భయాన్ని దాటి.. విజయానికి బాటలు వేసుకున్న తీరు అద్భుతం. ఇప్పుడు మ్యాచ్‌ మన గుప్పిట్లో! చేయాల్సింది మరో 152 పరుగులే. చేతిలో 10 వికెట్లున్నాయి. రెండు రోజుల ఆట మిగిలి ఉంది. అయినా జాగ్రత్త అవసరం. అస్థిర బౌన్స్‌కు, స్పిన్‌కు అనుకూలంగా.. అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌పై జాగ్రత్తగా ఆడి లక్ష్యాన్ని చేరుకోవడం కీలకం.

ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్‌ ఉండగానే 3-1తో దక్కించుకోవడానికి భారత్‌ రంగం సిద్ధం చేసుకుంది. అనూహ్యంగా కుప్పకూలితే తప్పా నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా విజయం ఖాయమే. మరో 152 పరుగులు చేస్తే చాలు. 192 పరుగుల ఛేదనలో 40/0తో జట్టు ఆదివారం ఆట ముగించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (24 బ్యాటింగ్‌), యశస్వి జైస్వాల్‌ (16 బ్యాటింగ్‌) రెండో ఇన్నింగ్స్‌లో జట్టుకు కావాల్సిన ఆరంభాన్నిచ్చారు. మిగిలిన 8 ఓవర్లలో వికెట్లు పడగొట్టి భారత్‌ను దెబ్బతీయాలనే ఇంగ్లిష్‌ జట్టు ప్రయత్నాలను వీళ్లు సమర్థంగా అడ్డుకున్నారు. అంతకుముందు 46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన స్టోక్స్‌ సేన 145 పరుగులకే కుప్పకూలింది. క్రాలీ (60) టాప్‌స్కోరర్‌. అశ్విన్‌ (5/51), కుల్‌దీప్‌ (4/22) ప్రత్యర్థిని చుట్టేశారు. మొదట ఓవర్‌నైట్‌ స్కోరు 219/7తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన టీమ్‌ఇండియా.. ధ్రువ్‌ జురెల్‌   (90; 149 బంతుల్లో 6×4, 4×6) అద్భుత పోరాటంతో 307 పరుగులకు ఆలౌటైంది. షోయబ్‌ బషీర్‌ (5/119) తొలిసారి ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు పడగొట్టాడు.

ఉక్కిరిబిక్కిరి: ఎప్పుడెలా ప్రవర్తిస్తోందో అంచనా వేయడం కష్టమైన ఈ పిచ్‌పై లక్ష్యం 200 దాటినా భారత్‌కు ఇబ్బంది తప్పదనే ఊహాగానాలు. ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌ను మన స్పిన్నర్లు అశ్విన్‌, కుల్‌దీప్‌ ఉక్కిరిబిక్కిరి చేశారు. పిచ్‌ నుంచి లభిస్తున్న సహకారాన్ని ఉపయోగించుకుని వికెట్ల పండగ చేసుకున్నారు. పిచ్‌పై పగుళ్లను వాడుకుని మాయ చేశారు. అస్థిర బౌన్స్‌ కూడా తోడవడంతో వీళ్లకు ఎదురు లేకుండా పోయింది. ఆఫ్‌స్టంప్‌ ఆవల బంతిని వేసి లోపలికి తిప్పడం, గాల్లో నుంచి వేస్తూ వికెట్లకు గురిపెట్టడం.. ఇలా ఈ స్పిన్నర్లిద్దరూ వికెట్ల వేటలో సాగారు. సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ ఆఫ్‌స్పిన్‌తో అదరగొడితే.. మణికట్టుతో కుల్‌దీప్‌ బెదరగొట్టాడు. క్రాలీ అర్ధసెంచరీ లేకపోయి ఉంటే ఇంగ్లాండ్‌ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. అశ్విన్‌ వరుస బంతుల్లో డకెట్‌ (15), పోప్‌ (0)ను ఔట్‌ చేసి ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. క్రాలీ మాత్రం స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. రూట్‌ (11), బెయిర్‌స్టో (30)తో కలిసి అతను పోరాడటంతో ఓ దశలో ఇంగ్లాండ్‌ 110/3తో మెరుగైన స్థితిలోనే నిలిచింది. కానీ అక్కడి నుంచి ముప్పేట దాడిన చేసిన మన స్పిన్‌ త్రయం 35 పరుగుల వ్యవధిలోనే చివరి 7 వికెట్లు పడగొట్టింది. ఆలస్యంగా బౌలింగ్‌కు వచ్చినా.. అద్భుతమైన బంతితో క్రాలీని కుల్‌దీప్‌ బౌల్డ్‌ చేశాడు. కవర్స్‌లో ఫీల్డర్‌ను పెట్టకుండా అటువైపే ఆడేలా క్రాలీని ఉసిగొల్పి, స్పిన్‌తో బోల్తాకొట్టించాడు. తక్కువ ఎత్తులో వచ్చిన కుల్‌దీప్‌ బంతి స్టోక్స్‌ (4) కాలికి తాకి వెళ్లి స్టంప్స్‌ను ముద్దాడింది. ఇక కుదురుకుంటున్న బెయిర్‌స్టోను జడేజా (1/56) బుట్టలో వేసుకున్నాడు. ఒకే ఓవర్లో మొదట హార్ట్‌లీ (7), రాబిన్సన్‌ (0)ను కుల్‌దీప్‌.. చివర్లో ఫోక్స్‌ (17), అండర్సన్‌ (0)ను అశ్విన్‌ ఔట్‌ చేయడంతో ఇంగ్లాండ్‌ కథ ముగిసింది. ధ్రువ్‌ ఒంటిచేత్తో పట్టిన అండర్సన్‌ క్యాచ్‌తో అశ్విన్‌కు అయిదో వికెట్‌ దక్కింది.

జురెల్‌ కాపాడాడు: అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ధ్రువ్‌ (ఓవర్న్‌ైట్‌ స్కోరు 30) అసాధారణ పోరాటంతో కఠిన పరిస్థితుల నుంచి భారత్‌ను గట్టెక్కించాడు. 177/7తో నిలిచిన జట్టు 300కు పైగా పరుగులు చేసిందంటే.. 150 కంటే ఎక్కువ ఆధిక్యం కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడిందంటే.. అందుకు అతనే కారణం. 134 పరుగుల లోటుతో మూడో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన జట్టును ధ్రువ్‌ నడిపించాడు. కుల్‌దీప్‌ (28; 131 బంతుల్లో 2×4; ఓవర్‌నైట్‌ స్కోరు 17))తో కలిసి పోరాటాన్ని కొనసాగించాడు. ఉదయం పూట పరిస్థితులు బ్యాటింగ్‌కు కాస్త అనుకూలంగానే ఉన్నప్పటికీ.. అస్థిర బౌన్స్‌తో కంగారెత్తిస్తున్న పిచ్‌పై ధ్రువ్‌ చూపించిన తెగువ గురించి ఎంత చెప్పినా తక్కువే. జట్టును రక్షించాలనే తపనతో అతను ఆడాడు. మరోవైపు కుల్‌దీప్‌ కూడా పట్టుదలగా నిలబడ్డాడు. ఎనిమిదో వికెట్‌కు ఎంతో కీలకమైన 76 పరుగులు జోడించిన తర్వాత కుల్‌దీప్‌ నిష్క్రమించాడు. ఆకాశ్‌ (9)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ధ్రువ్‌.. జట్టును రక్షించాడు. టెస్టుల్లో తొలి అర్ధశతకాన్ని అందుకున్న తర్వాత గేరు మార్చాడు. స్పిన్నర్లు బషీర్‌, హార్ట్‌లీ (3/68) బౌలింగ్‌లో ఫోర్లు, సిక్సర్లతో దూకుడు ప్రదర్శించాడు. హార్ట్‌లీ ఓవర్లో సిక్సర్‌, ఫోర్‌తో 90కి చేరుకున్న ధ్రువ్‌.. సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ తన తర్వాతి ఓవర్లో హార్ట్‌లీ వేసిన ఓ చక్కటి బంతికి బౌల్డవడంతో ఇన్నింగ్స్‌ ముగిసింది.

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 353;

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: యశస్వి (బి) బషీర్‌ 73; రోహిత్‌ (సి) ఫోక్స్‌ (బి) అండర్సన్‌ 2; శుభ్‌మన్‌ ఎల్బీ (బి) బషీర్‌ 38; రజత్‌ ఎల్బీ (బి) బషీర్‌ 17; జడేజా (సి) పోప్‌ (బి) బషీర్‌ 12; సర్ఫరాజ్‌ (సి) రూట్‌ (బి) హార్ట్‌లీ 14; ధ్రువ్‌ (బి) హార్ట్‌లీ 90; అశ్విన్‌ ఎల్బీ (బి) హార్ట్‌లీ 1; కుల్‌దీప్‌ (బి) అండర్సన్‌ 28;  ఆకాశ్‌దీప్‌ ఎల్బీ (బి) బషీర్‌ 9; సిరాజ్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం: (103.2 ఓవర్లలో ఆలౌట్‌) 307; వికెట్ల పతనం: 1-4, 2-86, 3-112, 4-130, 5-161, 6-171, 7-177, 8-253, 9-293; బౌలింగ్‌: అండర్సన్‌ 18-4-48-2; రాబిన్సన్‌ 13-0-54-0; షోయబ్‌ బషీర్‌ 44-8-119-5; హార్ట్‌లీ 27.2-6-68-3; రూట్‌ 1-0-1-0
ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: క్రాలీ (బి) కుల్‌దీప్‌ 60; డకెట్‌ (సి) సర్ఫరాజ్‌ (బి) అశ్విన్‌ 15; పోప్‌ ఎల్బీ (బి) అశ్విన్‌ 0; రూట్‌ ఎల్బీ (బి) అశ్విన్‌ 11; బెయిర్‌స్టో (సి) రజత్‌ (బి) జడేజా 30; స్టోక్స్‌ (బి) కుల్‌దీప్‌ 4; ఫోక్స్‌ (సి) అండ్‌ (బి) అశ్విన్‌ 17; హార్ట్‌లీ (సి) సర్ఫరాజ్‌ (బి) కుల్‌దీప్‌ 7; రాబిన్సన్‌ ఎల్బీ (బి) కుల్‌దీప్‌ 0; బషీర్‌ నాటౌట్‌ 1; అండర్సన్‌ (సి) ధ్రువ్‌ (బి) అశ్విన్‌ 0; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం: (53.5 ఓవర్లలో ఆలౌట్‌) 145; వికెట్ల పతనం: 1-19, 2-19, 3-65, 4-110, 5-120, 6-120, 7-133, 8-133, 9-145; బౌలింగ్‌: అశ్విన్‌ 15.5-0-51-5, జడేజా 20-5-56-1; సిరాజ్‌ 3-0-16-0; కుల్‌దీప్‌ 15-2-22-4
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ బ్యాటింగ్‌ 24; యశస్వి బ్యాటింగ్‌ 16; మొత్తం: (8 ఓవర్లలో వికెట్‌  కోల్పోకుండా) 40; బౌలింగ్‌: రూట్‌ 4-0-17-0; హార్ట్‌లీ   3-0-22-0; బషీర్‌ 1-0-1-0


354

భారత్‌లో టెస్టుల్లో అశ్విన్‌ తీసిన వికెట్లు. స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అనిల్‌ కుంబ్లే (63 మ్యాచ్‌ల్లో 350) రికార్డును అశ్విన్‌ (59 మ్యాచ్‌ల్లో) తిరగరాశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని