హకీ ఇండియాకు ఎలెనా రాజీనామా

సుదీర్ఘ కాలం హాకీ ఇండియాకు సేవలందించిన సీఈవో ఎలెనా నార్మన్‌ రాజీనామా చేసింది. హాకీ ఇండియా చాలాకాలంగా బకాయిలు చెల్లించకుండా ఇబ్బంది పెట్టిందని.. గ్రూపు రాజకీయాలు ఉన్న చోటు తాను కొనసాగలేనని ఈ సందర్భంగా ఆమె పేర్కొంది.

Published : 28 Feb 2024 01:48 IST

దిల్లీ: సుదీర్ఘ కాలం హాకీ ఇండియాకు సేవలందించిన సీఈవో ఎలెనా నార్మన్‌ రాజీనామా చేసింది. హాకీ ఇండియా చాలాకాలంగా బకాయిలు చెల్లించకుండా ఇబ్బంది పెట్టిందని.. గ్రూపు రాజకీయాలు ఉన్న చోటు తాను కొనసాగలేనని ఈ సందర్భంగా ఆమె పేర్కొంది. ఆస్ట్రేలియాకు చెందిన 49 ఏళ్ల ఎలెనా 2011లో సీఈవోగా నియమితురాలైంది. 13 ఏళ్లు ఈ పదవిలో కొనసాగింది. ‘‘డబ్బులు చెల్లించే విషయంలో హాకీ ఇండియాతో ఇబ్బంది పడ్డా. అడగ్గా అడగ్గా గత వారం బకాయిలు విడుదల చేశారు. సంఘం రెండు వర్గాలుగా విడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సానుకూల ఫలితాలు రాబట్టలేం’’ అని ఎలెనా తెలిపింది. ఆమె రాజీనామాను హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్‌ టిర్కీ ఆమోదించాడు. ఎలెనా సీఈవోగా ఉన్న కాలంలో భారత పురుషులు, మహిళల జట్లు ఉత్తమ ర్యాంకులు సాధించాయి. టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల జట్టు చరిత్రాత్మక కాంస్యం గెలవగా.. అమ్మాయిలు నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు. ఆమె హయాంలోనే 2018, 2023 ప్రపంచకప్‌లకు భారత్‌ ఆతిథ్యం ఇచ్చింది. 36 ఏళ్ల విరామం తర్వాత భారత మహిళల జట్టు 2016లో రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో ఎలెనాది కీలకపాత్ర.


వాగ్నర్‌ వీడ్కోలు

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ నీల్‌ వాగ్నర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 37 ఏళ్ల ఈ లెఫ్ట్‌ఆర్మ్‌ పేసర్‌ కివీస్‌ తరఫున 64 టెస్టులు ఆడాడు. 37 సగటుతో 260 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికాలో పుట్టి కివీస్‌కు ప్రాతినిథ్యం వహించిన వాగ్నర్‌.. 2012లో వెస్టిండీస్‌పై టెస్టు అరంగేట్రం చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాపై ఆఖరి మ్యాచ్‌ ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్లో కివీస్‌ విజయాల్లో వాగ్నర్‌ది కీలకపాత్ర. 2022 టెస్టు ఛాంపియన్‌షిప్‌ అందులో ముఖ్యమైంది. వాగ్నర్‌ ఆడిన 64 టెస్టుల్లో కివీస్‌ 34 గెలిచింది. గతేడాది ఇంగ్లాండ్‌పై కేవలం ఒకే పరుగు తేడాతో న్యూజిలాండ్‌ గెలవడం వెనుక వాగ్నర్‌ (4/62) కీలకమయ్యాడు. అండర్సన్‌ రూపంలో చివరి వికెట్‌ పడగొట్టి సంచలన విజయాన్ని అందించాడు. దశాబ్దానికి పైగా అంతర్జాతీయ క్రికెట్లో ఉన్నా.. అతడు సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రమే ఆడడం విశేషం.


బెయిర్‌స్టో రాణిస్తాడు: మెక్‌కలమ్‌

దిల్లీ: భారత్‌తో టెస్టు సిరీస్‌లో ఇప్పటిదాకా అంచనాలకు తగ్గట్టు ఆడలేకపోయినా.. వందో టెస్టులో జానీ బెయిర్‌స్టో సత్తా చాటుతాడని ఆశిస్తున్నట్లు ఇంగ్లాండ్‌ కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ చెప్పాడు. ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో బెయిర్‌స్టో అత్యధిక స్కోరు 38 మాత్రమే. సిరీస్‌లో ఆఖరిదైన అయిదో టెస్టు (ధర్మశాల)లో అతడికి పరీక్ష ఎదురు కానుంది. జానీ కెరీర్‌లో ఇది వందో మ్యాచ్‌. ‘‘జానీ బెయిర్‌స్టోది సహజంగా ఉద్వేగంగా ఉండే వ్యక్తిత్వం. ధర్మశాల టెస్టు అతడి కెరీర్‌లో పెద్ద మైలురాయి. ఈ వందో మ్యాచ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. అతడు సత్తా చాటుతాడని ఆశిస్తున్నా’’ అని మెక్‌కలమ్‌ తెలిపాడు. రాంచి టెస్టులో విఫలం కావడం పేసర్‌ ఒలీ రాబిన్సన్‌ను బాగా బాధించిందని.. కానీ ఏ ఆటగాడికైనా వైఫల్యం మామూలేనని బ్రెండన్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని