స్మృతి, మేఘన మెరుపులు

మహిళల ప్రిమియర్‌ లీగ్‌ సీజన్‌-2లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు దూకుడు మీదుంది. ఆ జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. మొదట బంతితో సోఫీ మోలనూ (3/25), రేణుక సింగ్‌ (2/15) విజృంభించగా..

Updated : 28 Feb 2024 03:24 IST

రాణించిన మోలనూ, రేణుక
ఆర్సీబీకి రెండో విజయం
బెంగళూరు

బెంగళూరు: మహిళల ప్రిమియర్‌ లీగ్‌ సీజన్‌-2లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు దూకుడు మీదుంది. ఆ జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. మొదట బంతితో సోఫీ మోలనూ (3/25), రేణుక సింగ్‌ (2/15) విజృంభించగా.. ఆపై కెప్టెన్‌ స్మృతి మంధాన (43; 27 బంతుల్లో 8×4, 1×6), తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (36 నాటౌట్‌; 28 బంతుల్లో 5×4, 1×6) మెరుపులు మెరిపించడంతో మంగళవారం ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌ను చిత్తు చేసింది. తొలుత గుజరాత్‌ 20 ఓవర్లలో 107/7కే పరిమితమైంది. మోలనూ, రేణుక ప్రత్యర్థిని కట్టడి చేశారు. హేమలత (31 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌. ఛేదనలో దూకుడుగా ఆడిన స్మృతి.. బెంగళూరు విజయానికి బాటలు వేసింది. తొలి వికెట్‌కు సోఫీ డివైన్‌ (6)తో కలిసి 3.2 ఓవర్లలోనే 32 పరుగులు జత చేసిన ఈ స్టార్‌ ఓపెనర్‌.. ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేసింది. ఆ తర్వాత మేఘనతో కలిసి స్కోరును ముందుకు తీసుకెళ్లింది. మంధాన-మేఘన రెండో వికెట్‌కు 40 పరుగులు జత చేశారు. స్మృతి వెనుదిరిగినా.. ఎలీస్‌ పెర్రీ (23 నాటౌట్‌)తో కలిసి మేఘన పని పూర్తి చేసింది. ఆర్సీబీ   12.3 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. గుజరాత్‌కు ఇది వరుసగా రెండో ఓటమి.

గుజరాత్‌కు కళ్లెం: అంతకుముందు గుజరాత్‌కు ఆర్సీబీ బౌలర్లు కళ్లెం వేశారు. ఆరంభంలో రేణుక.. మధ్యలో మోలనూ విజృంభించడంతో ఆ జట్టు బ్యాటర్లు స్వేచ్ఛగా పరుగులు చేయలేకపోయారు. ఒక దశలో ఆ జట్టు 10.1 ఓవర్లకు 45/2తో పర్వాలేదనిపించినా.. ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఓపెనర్‌ హర్లీన్‌ డియోల్‌ (22), హేమలత ప్రత్యర్థి బౌలర్లను అడ్డుకున్నారు. హర్లీన్‌ వెనుదిరిగినా.. ఆఖరిదాకా నిలిచిన హేమలత గుజరాత్‌ స్కోరును 100 దాటించింది.

గుజరాత్‌: 107/7 (హేమలత 31 నాటౌట్‌, సోఫీ మోలనూ 3/25, రేణుక సింగ్‌ 2/14)

బెంగళూరు: 12.3 ఓవర్లలో 110/2 (స్మృతి మంధాన 43, మేఘన 36 నాటౌట్‌, ఎలీస్‌ పెర్రీ 23 నాటౌట్‌)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు