దూసుకొచ్చింది కుర్రకారు..

‘‘అయిదుగురు ప్రపంచ స్థాయి ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. టాస్‌ చేజారింది. తొలి ఇన్నింగ్స్‌లో వెనుకబడ్డారు. అయినా గెలిచిన భారత జట్టుకు అభినందనలు. ఇదొక అద్భుత విజయం. చాన్నాళ్ల తర్వాత ఎంతోమంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు’’

Updated : 28 Feb 2024 09:31 IST

ఈనాడు క్రీడావిభాగం

‘‘అయిదుగురు ప్రపంచ స్థాయి ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. టాస్‌ చేజారింది. తొలి ఇన్నింగ్స్‌లో వెనుకబడ్డారు. అయినా గెలిచిన భారత జట్టుకు అభినందనలు. ఇదొక అద్భుత విజయం. చాన్నాళ్ల తర్వాత ఎంతోమంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు’’

ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ చేసిన వ్యాఖ్య ఇది. టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సైతం ఇంగ్లాండ్‌పై సిరీస్‌ విజయం అనంతరం యువ ఆటగాళ్ల ప్రదర్శన గురించే మాట్లాడాడు. సవాళ్లకు ఎదురు నిలిచిన వారి ఆత్మస్థైర్యాన్ని కొనియాడాడు. ఈ కుర్రాళ్లు చాలా ఏళ్లు  భారత జట్టుకు ఆడతాడని వ్యాఖ్యానించాడు.

సందేహమే లేదు.. ఇది కుర్రాళ్ల విజయం. వాళ్లు సమయోచితంగా రాణించకుంటే సుదీర్ఘ విరామం తర్వాత సొంతగడ్డపై సిరీస్‌ ఓడేదే టీమ్‌ఇండియా. అంచనాలను మించిన ప్రదర్శనతో జట్టుకే కాదు.. అభిమానులకు కూడా కొండంత భరోసానిచ్చారు యువ ఆటగాళ్లు.

భారత్‌కు చివరగా సొంతగడ్డపై టెస్టుల్లో సిరీస్‌ ఓటమి రుచి చూపించిన జట్టు ఇంగ్లాండ్‌. 2012-13 సీజన్లో ఆ జట్టు 2-1తో సిరీస్‌ గెలిచాక మరే జట్టూ భారత్‌ను భారత్‌లో ఓడించలేకపోయింది. ఈసారి అదే జట్టుతో సిరీస్‌ ఆరంభం కాబోతుండగా.. 12 ఏళ్లుగా కొనసాగుతున్న జైత్రయాత్రకు తెరపడబోతోందా అన్న సందేహాలు కలిగాయి. అందుకు ముఖ్య కారణం.. రెండేళ్లుగా ఇంటా బయటా అని తేడా లేకుండా బజ్‌బాల్‌ శైలితో ప్రత్యర్థి జట్లన్నింటినీ ఇంగ్లాండ్‌ బెంబేలెత్తించేస్తుండడమే. భారత పిచ్‌లకు తగ్గట్లు బలమైన స్పిన్‌ దళంతో అడుగు పెట్టిన స్టోక్స్‌ సేనకు చాలా అంశాలు కలిసొచ్చేలా కనిపించాయి. ముఖ్యంగా భారత బ్యాటింగ్‌ వెన్నెముక విరాట్‌ కోహ్లి వ్యక్తిగత కారణాలతో సిరీస్‌కు దూరం కావడంతో భారత బ్యాటింగ్‌ బలహీనంగా కనిపించింది. సిరీస్‌లో పర్యాటక జట్టు కోరుకున్న ఆరంభమే లభించింది. హైదరాబాద్‌లో స్పిన్‌ పిచ్‌ను చక్కగా ఉపయోగించుకుని భారత్‌కు అనూహ్య ఓటమి మిగిల్చారు ఆ జట్టు బౌలర్లు. అంతలోనే రాహుల్‌, జడేజా, శ్రేయస్‌ అయ్యర్‌ ఒకరి తర్వాత ఒకరు గాయపడ్డారు. ఓటమితో సిరీస్‌ను ఆరంభించి, కీలక ఆటగాళ్లను దూరం చేసుకుని బలహీన పడ్డ భారత్‌.. ఇక పుంజుకోవడం అసాధ్యమే అనుకున్నారు. కానీ అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో యువ ఆటగాళ్లే జట్టును ముందుండి నడిపించి అసాధ్యమనిపించిన సిరీస్‌ విజయాన్ని సాధ్యం చేశారు.

అతను మొదలుపెడితే..

సిరీస్‌ను భారత్‌ వైపు తిప్పిన ఘనత కచ్చితంగా యశస్వి జైస్వాల్‌దే. కోహ్లి, రాహుల్‌, జడేజా అందుబాటులో లేక బ్యాటింగ్‌ పూర్తిగా బలహీనపడిందనుకున్న స్థితిలో విశాఖపట్నంలో అతను ఆడిన ఇన్నింగ్స్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. హైదరాబాద్‌ విజయం తర్వాత కొండంత ఆత్మవిశ్వాసంతో సాగర తీరంలో అడుగుపెట్టిన ఇంగ్లిష్‌ బౌలర్లకు అతను చుక్కలు చూపించేశాడు. పూర్తి సాధికారతతో బ్యాటింగ్‌ చేస్తూ ఏకంగా డబుల్‌ సెంచరీ (209) బాదేసి మ్యాచ్‌లో భారత్‌ పైచేయి సాధించేలా చేశాడు. అతను వేసిన పునాది మీదే బుమ్రా అద్భుత బౌలింగ్‌తో చెలరేగి భారత్‌కు విజయాన్నందించాడు. ఇక రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టులో యశస్వి ఇంకా గొప్ప ఇన్నింగ్స్‌ (214 నాటౌట్‌) ఆడాడు. అందులో అతను వెన్ను నొప్పిని తట్టుకుని మరీ సాధించిన డబుల్‌ సెంచరీ భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే ఒకానొక ఉత్తమ ఇన్నింగ్స్‌గా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. రాంచిలోనూ అతను కీలక ఇన్నింగ్స్‌లు (73, 37) ఆడాడు. ఎక్కడ ఆడుతున్నాం.. ఎవరితో ఆడుతున్నాం.. జట్టు పరిస్థితేంటి.. సిరీస్‌ గమనమేంటి.. ఇవేవీ పట్టించుకోకుండా ఎంతో కసిగా ఆడుతూ.. తనలోని ఉత్తమ ప్రదర్శనను బయటికి తీయడమే లక్ష్యంగా ఆడాడు యశస్వి. అతడి బ్యాటింగ్‌ వర్ధమాన ఆటగాళ్లకే కాదు.. సీనియర్లకూ ఒక పాఠమే. కోహ్లి తర్వాత ఆ స్థాయిని అందుకోగల నైపుణ్యం, కసి ఉన్న ఆటగాడిగా అతను కితాబులందుకుంటున్నాడు. యశస్వి కసి చూస్తుంటే భారత్‌కు మరో మేటి బ్యాటర్‌ దొరికినట్లే అనిపిస్తోంది.


రెండు ఆణిముత్యాలు

సిరీస్‌తో యశస్వి కాబోయే సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంటే.. ఇంకో ఇద్దరు కొత్త ఆటగాళ్లు తమ సత్తాను ప్రపంచానికి పరిచయం చేశారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ధ్రువ్‌ జురెల్‌ గురించే. ఐపీఎల్‌లో మెరుపులతో వెలుగులోకి వచ్చిన ఈ కుర్రాడిని ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేస్తే.. టెస్టుల్లో ఏమాత్రం నిలుస్తాడులే అనుకున్నారు. అయితే తొలి రెండు టెస్టుల్లో కేఎస్‌ భరత్‌ వైఫల్యంతో అతడికి అనుకోకుండా అవకాశం వచ్చింది. దాన్ని అతను రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లోనే 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక రెండో టెస్టులో ప్రతికూల పరిస్థితుల్లో అతను ఆడిన 90 పరుగుల ఇన్నింగ్స్‌ను అభిమానులు చాలా కాలం గుర్తుంచుకుంటారు. ఇంగ్లాండ్‌ 353 స్కోరుకు బదులుగా భారత్‌ 177/7 నిలిచిన స్థితిలో ఓటమి ఖాయమనే అభిప్రాయానికి వచ్చేశారందరూ. కానీ జురెల్‌ మొక్కవోని పట్టుదలను ప్రదర్శిస్తూ.. కుల్‌దీప్‌తో కలిసి గొప్పగా పోరాడి ఇంగ్లాండ్‌ ఆధిక్యాన్ని 46 పరుగులకు పరిమితం చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో అనుభవజ్ఞులు కూడా నిలవలేరు. అలాంటిది రెండో టెస్టు ఆడుతూ జురెల్‌ చూపించిన పట్టుదల అసాధారణం. అతడి పోరాటం ఒకప్పుడు టెయిలెండర్లతో కలిసి వీవీఎస్‌ లక్ష్మణ్‌ చేసిన పోరాటాలను గుర్తు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ కఠిన పరిస్థితుల్లో గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు జురెల్‌. రేప్పొద్దున పంత్‌ తిరిగొచ్చినా.. తననే ఆడించాల్సిన పరిస్థితిని కల్పించాడు ధ్రువ్‌. టీమ్‌ఇండియాకు చాన్నాళ్లు ఆడదగ్గ ఆటగాడిలా కనిపిస్తున్నాడతను.

ఇక దేశవాళీల్లో పరుగుల వరద పారించి, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమ్‌ఇండియాలో అవకాశం దక్కించుకున్న సర్ఫరాజ్‌.. ఇంత కాలం తననెందుకు పక్కన పెట్టారనే ప్రశ్నలు రేకెత్తే ఇన్నింగ్స్‌లు ఆడాడు మూడో టెస్టులో. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఎంతో కసిగా ఆడి అర్ధశతకాలు సాధించాడు సర్ఫరాజ్‌. అతడి స్ట్రోక్‌ ప్లే అభిమానులను ఎంతగానో అలరించింది. మిడిలార్డర్లో మరో మంచి ప్రత్యామ్నాయంలా కనిపిస్తున్నాడీ ముంబయి కుర్రాడు. ఇంకోవైపు కెరీర్‌ ఆరంభంలో ఎన్నో ఆశలు రేకెత్తించి, ఆ తర్వాత గాడి తప్పిన మరో యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ కూడా ఈ సిరీస్‌లో తన క్లాస్‌ చూపించాడు. తొలి టెస్టులో నిరాశపరిచిన అతను.. తర్వాత కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. విశాఖలో సెంచరీ (104) సాధించిన శుభ్‌మన్‌.. రాజ్‌కోట్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులు చేశాడు. నాలుగో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ (38, 52 నాటౌట్‌)లూ జట్టు విజయంలో ఎంతో కీలకం. ఇలా ఈ సిరీస్‌లో బ్యాటింగ్‌ భారాన్ని ప్రధానంగా మోసింది యువ ఆటగాళ్లే. సీనియర్లు అందుబాటులో లేని సమయంలో ఏ సవాలుకైనా మేం సిద్ధం అని ఈ కుర్రాళ్లు చాటి చెప్పారు. భారత క్రికెట్‌ భవిష్యత్‌ భద్రంగా ఉందనే భరోసానిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని