ఇషాన్‌, శ్రేయస్‌ఔట్‌

అనుకున్నదే అయింది. టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌లపై వేటుపడింది. రంజీ ట్రోఫీలో ఆడాలన్న బోర్డు ఆదేశాల్ని పట్టించుకోకపోవడంతో వీరిద్దరిపై బీసీసీఐ చర్యలు తీసుకుంది.

Updated : 29 Feb 2024 07:13 IST

పుజారా, ధావన్‌లకూ దక్కని బీసీసీఐ కాంట్రాక్టులు
ఎ+లో విరాట్‌, రోహిత్‌, బుమ్రా, జడేజా
దిల్లీ

అనుకున్నదే అయింది. టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌లపై వేటుపడింది. రంజీ ట్రోఫీలో ఆడాలన్న బోర్డు ఆదేశాల్ని పట్టించుకోకపోవడంతో వీరిద్దరిపై బీసీసీఐ చర్యలు తీసుకుంది. బుధవారం 2023-24 సీజన్‌ కోసం బీసీసీఐ ప్రకటించిన ఆటగాళ్ల సెంట్రల్‌ కాంట్రాక్టుల జాబితా నుంచి ఇషాన్‌, అయ్యర్‌లను తప్పించడం భారత క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

దేశవాళీ క్రికెట్‌ను నిర్లక్ష్యం చేసే ఆటగాళ్లకు బీసీసీఐ గట్టి హెచ్చరిక జారీ చేసింది. భారత జట్టుకు అందుబాటులో లేని సమయంలో రంజీ ట్రోఫీలో ఆడాలన్న సూచనను పట్టించుకోకపోవడంతో ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌లను బీసీసీఐ కాంట్రాక్టుల జాబితా నుంచి తప్పించారు. ‘‘ఈ ఏడాది సెంట్రల్‌ కాంట్రాక్టు కోసం చేసిన సిఫార్సులో శ్రేయస్‌, ఇషాన్‌లను పరిగణలోకి తీసుకోలేదు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించని సమయంలో దేశవాళీ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆటగాళ్లందరికీ బోర్డు సూచించింది’’ అని బీసీసీఐ పేర్కొంది. టెస్టు స్పెషలిస్టు చెతేశ్వర్‌ పుజారాకు సైతం సెంట్రల్‌ కాంట్రాక్టు దక్కలేదు. భారత టెస్టు జట్టులో తిరిగి చోటు సంపాదించాలన్న అతని ఆశలకు బోర్డు నిర్ణయంతో తెరపడినట్లే కనిపిస్తోంది. అతను దాదాపు తొమ్మిది నెలలుగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. చాన్నాళ్లుగా భారత జట్టులో లేని శిఖర్‌ ధావన్‌, ఉమేశ్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, చాహల్‌లను కూడా బోర్డు పక్కనబెట్టింది. అయితే భారత జట్టులోకి తిరిగొచ్చే ఆటగాళ్లకు వచ్చే ఏడాది కాంట్రాక్టు పునరుద్ధరించే అవకాశముంది.

ఇది గట్టి హెచ్చరికే..

టీమ్‌ఇండియాకు ఆడి కొంచెం పేరు సంపాదిస్తే చాలు.. ఇక దేశవాళీ టోర్నీల్లో ఆడాల్సిన అవసరం లేదన్న భావన యువ క్రికెటర్లలో పెరిగిపోతున్న నేపథ్యంలో.. బీసీసీఐ కొరడా ఝులిపించడానికి సిద్ధమైనట్లే కనిపిస్తోంది. స్టార్‌ ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో పాల్గొనడం దశాబ్దాల కిందటే ఆగిపోయింది. అంతర్జాతీయ మ్యాచ్‌లకు తోడు ఐపీఎల్‌ కారణంగా ఆటగాళ్లపై పనిభారం పెరిగిపోతున్న నేపథ్యంలో మూడు ఫార్మాట్లలో భారత్‌కు ఆడుతున్న స్టార్‌ ఆటగాళ్లు రంజీల్లో ఆడటం కష్టమే. కానీ ఇప్పుడిప్పుడే జట్టులో నిలదొక్కుకుంటున్న యువ ఆటగాళ్లు కూడా రంజీలను విస్మరిస్తుండడం, భారత జట్టుకు ఆడకుండా ఖాళీగా ఉన్న సమయంలోనూ   ఈ టోర్నీల వైపు చూడకపోవడం బీసీసీఐ ఆగ్రహం తెప్పించింది. బోర్డులో ఈ విషయమై కదలిక రావడానికి ప్రధాన కారణం.. ఇషాన్‌ కిషన్‌. అతను వ్యక్తిగత కారణాలతో అర్ధంతరంగా దక్షిణాఫ్రికా పర్యటన నుంచి వచ్చేశాడు. తుది జట్టులో చోటివ్వకుండా పక్కన పెట్టడంతో కినుక వహించి అతను స్వదేశానికి వచ్చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఇషాన్‌ తీరు నచ్చక ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు కూడా సెలక్టర్లు అతణ్ని పక్కన పెట్టారు. ఆ తర్వాత రంజీల్లో ఆడాలని ఇషాన్‌కు, ఇంగ్లాండ్‌ సిరీస్‌ మధ్యలో చోటు కోల్పోయిన శ్రేయస్‌కు బీసీసీఐ నుంచి ఆదేశాలు వచ్చినా వాళ్లు పెడచెవిన పెట్టారు! ఝార్ఖండ్‌ రంజీ జట్టుకు తన అవసరం ఉన్నప్పటికీ ఇషాన్‌ అది పట్టించుకోకుండా ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యతో కలిసి సాధన చేయడం బీసీసీఐ ఆగ్రహాన్ని మరింత పెంచింది. శ్రేయస్‌ రంజీ ఫైనల్లో ఆడేందుకు సిద్ధమైనప్పటికీ ఇషాన్‌తో పాటు అతడికీ  గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతో కాంట్రాక్టుల జాబితా నుంచి బీసీసీఐ తప్పించినట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్‌ పట్ల నిర్లక్ష్యం వహించే యువ ఆటగాళ్లందరికీ ఇది గట్టి హెచ్చరికగా పని చేస్తుందని బీసీసీఐ భావిస్తోంది.

ఎవరు ఎందులో?

స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, కెప్టెన్‌ రోహిత్‌శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా సెంట్రల్‌ కాంట్రాక్టులో ఎ+ గ్రేడ్‌లో తమ స్థానాల్ని నిలబెట్టుకున్నారు. ‘ఎ’ గ్రేడ్‌లో ఆర్‌.అశ్విన్‌, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌, కేఎల్‌ రాహుల్‌, శుబ్‌మన్‌ గిల్‌, హార్దిక్‌ పాండ్యకు చోటు దక్కింది. ‘బి’ గ్రేడ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, కుల్‌దీప్‌, అక్షర్‌ పటేల్‌, యశస్వి జైస్వాల్‌ ఉన్నారు. రింకూ సింగ్‌, తిలక్‌వర్మ, రుతురాజ్‌ గైక్వాడ్‌, శివమ్‌ దూబె, రవి బిష్ణోయ్‌, జితేశ్‌ శర్మ, ముకేశ్‌ కుమార్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, అవేష్‌ఖాన్‌, రజత్‌ పటీదార్‌లకు తొలిసారిగా బీసీసీఐ కాంట్రాక్టులు లభించాయి. వీరంతా ‘సి’ గ్రేడ్‌లో చోటు దక్కించుకున్నారు. శార్దూల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, సంజు శాంసన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, కేఎస్‌ భరత్‌ ‘సి’ గ్రేడ్‌లో కొనసాగుతున్నారు. గత ఏడాది ‘ఎ+’ఆటగాడికి ఏడాదికి రూ.7 కోట్లు బీసీసీఐ చెల్లించింది.  ‘ఎ’ గ్రేడ్‌కు రూ.5 కోట్లు, ‘బి’ గ్రేడ్‌కు రూ.3 కోట్లు, ‘సి’ గ్రేడ్‌కు రూ.1 కోటి అందజేసింది. ఈ ఏడాది నుంచి  ఆటగాళ్ల కాంట్రాక్టు మొత్తాన్ని బీసీసీఐ పెంచనున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని