టైటిల్‌ పోరుకు పుణెరి, హరియాణా

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-10లో ఫైనల్‌ జట్లేవో తేలిపోయాయి. టైటిల్‌ కోసం పుణెరి పల్టాన్‌తో హరియాణా స్టీలర్స్‌ ఢీకొట్టనుంది. పట్నా పైరేట్స్‌ను పుణెరి.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జైపుర్‌ పింక్‌  పాంథర్స్‌ను హరియాణా ఓడించి ఆఖరి సమరానికి చేరాయి. బుధవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సెమీఫైనల్లో పుణెరి 37-21తో పట్నాపై నెగ్గింది.

Published : 29 Feb 2024 03:53 IST

ఈనాడు - హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-10లో ఫైనల్‌ జట్లేవో తేలిపోయాయి. టైటిల్‌ కోసం పుణెరి పల్టాన్‌తో హరియాణా స్టీలర్స్‌ ఢీకొట్టనుంది. పట్నా పైరేట్స్‌ను పుణెరి.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జైపుర్‌ పింక్‌  పాంథర్స్‌ను హరియాణా ఓడించి ఆఖరి సమరానికి చేరాయి. బుధవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సెమీఫైనల్లో పుణెరి 37-21తో పట్నాపై నెగ్గింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన పుణెరి ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. వరుస పాయింట్లతో విరామ సమయానికి 20-11తో ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్థంలోనూ పుణెరిదే జోరు. పట్నా కాస్త పుంజుకున్నా పట్టువదలని పుణెరి విజయాన్ని సొంతం చేసుకుని ఫైనల్లో అడుగుపెట్టింది. అస్లామ్‌ (7), పంకజ్‌ (7), మహ్మద్‌రెజా (5) విజయంలో కీలకపాత్ర పోషించారు. పట్నా తరఫున సచిన్‌ (5), మంజీత్‌ (4), సుధాకర్‌ (4) రాణించినా జట్టును గెలిపించలేకపోయారు.  మరో మ్యాచ్‌లో హరియాణా 31-27తో జైపుర్‌ను ఓడించింది. ఈ పోరులో రెండు జట్లు పోటాపోటీగా ఆడాయి. కానీ జోరు చూపించిన హరియాణా విరామానికి 19-13తో ఆధిక్యంలో నిలిచింది.. ద్వితీయార్థంలో జైపుర్‌ పుంజుకుంది. బలమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థిని అడ్డుకోవడమే కాక.. అటాకింగ్‌ గేమ్‌తో పాయింట్లు సాధించింది. కానీ ఆఖర్లో తడబడి ఓటమి చవిచూసింది. వినయ్‌ (11) హరియాణా విజయంలో కీలకమయ్యాడు. శివమ్‌ (7) నుంచి అతడికి సహకారం అందింది. జైపుర్‌ జట్టులో అర్జున్‌ (14) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. శుక్రవారం గచ్చిబౌలిలోనే జరిగే తుది పోరులో పుణెరితో హరియాణా తలపడనుంది. సినీ నటుడు గోపీచంద్‌ సెమీస్‌ మ్యాచ్‌లకు హాజరై సందడి చేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని