హాకీ ఇండియాలో సంక్షోభం!

హాకీ ఇండియాలో సంక్షోభం! అధ్యక్షుడు దిలీప్‌ టిర్కీ, ప్రధాన కార్యదర్శి భోళానాథ్‌ సింగ్‌ మధ్య గొడవలు సంఘాన్ని రెండుగా చీల్చినట్లు సమాచారం. సంఘంలో ఇమడలేక నెల క్రితం మహిళల జట్టు ప్రధాన కోచ్‌ జానెక్‌ స్కోప్‌మ్యాన్‌ తప్పుకోగా.. సభ్యుల మధ్య సఖ్యత లేదంటూ తాజాగా సీఈవో ఎలెనా నార్మన్‌ రాజీనామా చేసింది.

Published : 29 Feb 2024 03:53 IST

అధ్యక్ష, కార్యదర్శుల మధ్య వర్గ పోరు

దిల్లీ: హాకీ ఇండియాలో సంక్షోభం! అధ్యక్షుడు దిలీప్‌ టిర్కీ, ప్రధాన కార్యదర్శి భోళానాథ్‌ సింగ్‌ మధ్య గొడవలు సంఘాన్ని రెండుగా చీల్చినట్లు సమాచారం. సంఘంలో ఇమడలేక నెల క్రితం మహిళల జట్టు ప్రధాన కోచ్‌ జానెక్‌ స్కోప్‌మ్యాన్‌ తప్పుకోగా.. సభ్యుల మధ్య సఖ్యత లేదంటూ తాజాగా సీఈవో ఎలెనా నార్మన్‌ రాజీనామా చేసింది. హాకీ ఇండియా వర్గాలుగా విడిపోయిందని 13 ఏళ్ల పాటు సేవలందించిన ఎలెనా రాజీనామా లేఖలో చెప్పింది. ‘‘హాకీ ఇండియాలో రెండు వర్గాలున్నాయి. ఒకటి అధ్యక్షుడు దిలీప్‌ టిర్కీది.. ఇంకోటి కార్యదర్శి భోళానాథ్‌ది. సంఘంలో అధికార దాహం ఉన్న వాళ్లూ ఉన్నారు.. హాకీ అభివృద్ధి కోసం పాటుపడే టిర్కీ లాంటి వాళ్లు కూడా ఉన్నారు. వర్గాలు ఉన్న చోటు హాకీ ఉన్నతి కోసం కృషి చేయలేను. కోచ్‌లకు బకాయిలు కూడా చెల్లించట్లేదు. అందుకే రాజీనామా చేస్తున్నా’’ అని ఎలెనా తెలిపింది. అయితే టిర్కీ, భోళానాథ్‌ మాత్రం ఎలెనా మాటలకు భిన్నంగా స్పందించారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని బుధవారం ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘హాకీ ఇండియా స్వయం ప్రతిపత్తి కలిగిన సంఘం. ఆట అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నాం. బయటకు వెళ్లిన కొందరు హాకీ ఇండియాలో గ్రూపు రాజకీయాలు ఉన్నాయని చెప్పారు. ఇందులో నిజం లేదు. మేమంతా కలిసే ఉన్నాం. ఉమ్మడిగా హాకీని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాం. జాతీయ జట్లకు అత్యుత్తమ సదుపాయాలు అందిస్తున్నాం. మహిళల జట్టు తిరిగి పుంజుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఒలింపిక్స్‌లో భారత పురుషుల జట్టు మరోసారి పతకం సాధించే దిశగా మద్దతు ఇస్తున్నాం’’ అని టిర్కీ, భోళానాథ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని