రంజీకి పటీదార్‌!

మిడిల్‌ఆర్డర్‌ బ్యాటర్‌ రజత్‌ పటీదార్‌ను భారత టెస్టు జట్టు నుంచి బీసీసీఐ విడుదల చేసే అవకాశాలున్నాయి. మార్చి 7న భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య ధర్మశాలలో ఆరంభమయ్యే సిరీస్‌లో ఆఖరిదైన అయిదో టెస్టుకు కేఎల్‌ రాహుల్‌ ఫిట్‌నెస్‌ను నిరూపించుకునే పక్షంలో పటీదార్‌ జట్టులో ఉండడం అనవసరమని మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Published : 29 Feb 2024 01:54 IST

ముంబయి: మిడిల్‌ఆర్డర్‌ బ్యాటర్‌ రజత్‌ పటీదార్‌ను భారత టెస్టు జట్టు నుంచి బీసీసీఐ విడుదల చేసే అవకాశాలున్నాయి. మార్చి 7న భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య ధర్మశాలలో ఆరంభమయ్యే సిరీస్‌లో ఆఖరిదైన అయిదో టెస్టుకు కేఎల్‌ రాహుల్‌ ఫిట్‌నెస్‌ను నిరూపించుకునే పక్షంలో పటీదార్‌ జట్టులో ఉండడం అనవసరమని మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అతడిని విడుదల చేసి రంజీ సెమీఫైనల్స్‌ ఆడాల్సిందిగా కోరే అవకాశాలున్నట్లు బోర్డు వర్గాల సమాచారం. కానీ అయిదో టెస్టు ఆరంభం నాటికి రాహుల్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తాడా అనేదే అనుమానంగా మారింది. మార్చి 2 నాటికి రాహుల్‌ విషయంలో మేనేజ్‌మెంట్‌ తుది నిర్ణయం తీసుకోనుంది. తొడ కండర గాయంతో ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో మూడు టెస్టులకు దూరమైన రాహుల్‌కు ఇంకా అసౌకర్యంగానే ఉందని.. దీనిపై వైద్యుల సలహా కోసం అతడు లండన్‌ వెళ్లినట్లు తెలిసింది. టీమ్‌ఇండియా నుంచి బయటకు వస్తే మార్చి 2న విదర్భతో మొదలయ్యే రంజీ సెమీఫైనల్లో పటీదార్‌ మధ్యప్రదేశ్‌కు ఆడతాడు.


రంజీ సెమీస్‌కు నాగ్‌పుర్‌, ముంబయి ఆతిథ్యం

దిల్లీ: దేశవాళీ అత్యున్నత టోర్నీ రంజీ ట్రోఫీ సెమీఫైనల్స్‌కు వేదికలు ఖరారయ్యాయి. మార్చి 2 నుంచి 6  వరకు జరిగే సెమీస్‌ మ్యాచ్‌లకు నాగ్‌పుర్‌, ముంబయి ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ మ్యాచ్‌ల్లో తమిళనాడుతో ముంబయి, మధ్యప్రదేశ్‌తో విదర్భ తలపడనున్నాయి. కీలకమైన మ్యాచ్‌ల్లో తమ సొంతగడ్డపై ఆడనుండడం ముంబయి, విదర్భలకు కలిసొచ్చేదే. రంజీ ట్రోఫీలో 41 సార్లు విజేతగా నిలిచిన ముంబయి.. బరోడాతో క్వార్టర్‌ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ఆధారంగా సెమీస్‌ బెర్తు దక్కించుకుంది. విదర్భ 127 పరుగుల తేడాతో కర్ణాటకపై, మధ్యప్రదేశ్‌ 4 పరుగుల తేడాతో ఆంధ్రపై, తమిళనాడు ఇన్నింగ్స్‌, 33 పరుగుల ఆధిక్యంతో సౌరాష్ట్రపై నెగ్గి సెమీస్‌కు అర్హత సాధించాయి.


కివీస్‌-ఆసీస్‌ తొలి టెస్టు నేటి నుంచే

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌తో చేసి జోరుమీదున్న ఆస్ట్రేలియా.. టెస్టులపై గురిపెట్టింది. గురువారం ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోనూ జోరు కొనసాగించాలని ఆ జట్టు భావిస్తోంది. టీ20 సిరీస్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆతిథ్య కివీస్‌ పట్టుదలగా ఉంది. అయితే తొలి టెస్టు ఆరంభానికి ముందే కివీస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బొటన వేలి గాయం కారణంగా ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో విల్‌ యంగ్‌ జట్టులోకి వచ్చాడు. మోకాలి గాయంతో రెండు, మూడు టీ20లకు దూరమైన రచిన్‌ రవీంద్ర టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి రావడం కివీస్‌కు సానుకూలాంశం. రచిన్‌ మ్యాచ్‌ ఫిట్‌నెస్‌తో ఉన్నట్లు కివీస్‌ ప్రకటించింది. గాయంతో దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరమైన డరైల్‌ మిచెల్‌ కూడా జట్టులోకి వచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని