BCCI Central Contracts: కోహ్లి, రోహిత్‌ కూడా దేశవాళీలో ఆడాలి: కీర్తి ఆజాద్‌

అంతర్జాతీయ మ్యాచ్‌లు లేని సమయంలో స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌శర్మ కూడా దేశవాళీ క్రికెట్లో ఆడాలని భారత మాజీ క్రికెటర్‌ కీర్తి ఆజాద్‌ అన్నాడు.

Updated : 01 Mar 2024 03:48 IST

దిల్లీ: అంతర్జాతీయ మ్యాచ్‌లు లేని సమయంలో స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌శర్మ కూడా దేశవాళీ క్రికెట్లో ఆడాలని భారత మాజీ క్రికెటర్‌ కీర్తి ఆజాద్‌ అన్నాడు. అవకాశం ఉన్నా రంజీ బరిలో దిగకపోవడంతో సెంట్రల్‌ కాంట్రాక్టుల నుంచి ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌లను బీసీసీఐ తప్పించిన నేపథ్యంలో అతడిలా పేర్కొన్నాడు. ‘‘కిషన్‌, శ్రేయస్‌ విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైందే. ప్రతి ఒక్కరూ రంజీ క్రికెట్‌ ఆడాలి. కానీ ప్రస్తుతం ఐపీఎల్‌పైనే దృష్టి పెడుతున్నారు. ఐపీఎల్‌ వినోదాన్ని ఇస్తుందనేది వాస్తవం. కానీ సుదీర్ఘ ఫార్మాటే అసలైన క్రికెట్‌.  ఒక ఆటగాడికి దేశానికి ఆడే అవకాశాన్ని అందించేది ఇదే. రోహిత్‌శర్మ, విరాట్‌ కోహ్లిలు సైతం ఖాళీ దొరికితే దేశవాళీ మ్యాచ్‌లు ఆడాలి. కిషన్‌, శ్రేయస్‌లపై మాత్రమే కొరడా ఝుళిపించడం తప్పు. నిబంధనలు మీరితే ఎవరిపైనైనా ఇలాంటి చర్యలే తీసుకోవాలి’’ అని ఆజాద్‌ అన్నాడు. ఇప్పుడు అందరి ప్రాధాన్యం టీ20లపైనే ఉందని.. ఒకప్పుడు స్టార్‌ ఆటగాళ్లంతా తమ రాష్ట్ర జట్ల తరఫున రంజీల్లో ఆడేవాళ్లని ఆజాద్‌ చెప్పాడు. ‘‘ఒకప్పుడు మొహిందర్‌ అమర్‌నాథ్‌, బిషన్‌సింగ్‌ బేడీ, సునీల్‌ గావస్కర్‌, సందీప్‌ పాటిల్‌ లాంటి వాళ్లు తరుచుగా దేశవాళీ మ్యాచ్‌లు ఆడేవాళ్లు. ప్రస్తుత తరం క్రికెటర్లు టీ20లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతర్జాతీయ మ్యాచ్‌లు లేనప్పుడు ఇంగ్లాండ్‌ క్రికెటర్లు కౌంటీ బరిలో దిగుతారు. మరి భారత ఆటగాళ్లకు ఏమైంది?’’ అని ఆజాద్‌ ప్రశ్నించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని