ముందుంది అసలు సవాల్‌

ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌లను సెంట్రల్‌ కాంట్రాక్టుల నుంచి తప్పించడం ద్వారా దేశవాళీ క్రికెట్‌ను నిర్లక్ష్యం చేసే ఆటగాళ్లను ఉపేక్షించేది లేదని బీసీసీఐ గట్టి హెచ్చరికే జారీ చేసింది. అయితే ఉన్నట్లుండి బీసీసీఐ ఇంత కఠినంగా వ్యవహరించడంపై భారత క్రికెట్‌ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది.

Updated : 01 Mar 2024 06:53 IST

ఈనాడు క్రీడావిభాగం

ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌లను సెంట్రల్‌ కాంట్రాక్టుల నుంచి తప్పించడం ద్వారా దేశవాళీ క్రికెట్‌ను నిర్లక్ష్యం చేసే ఆటగాళ్లను ఉపేక్షించేది లేదని బీసీసీఐ గట్టి హెచ్చరికే జారీ చేసింది. అయితే ఉన్నట్లుండి బీసీసీఐ ఇంత కఠినంగా వ్యవహరించడంపై భారత క్రికెట్‌ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. టీమ్‌ఇండియా ఆటగాళ్లను రంజీల వైపు నడిపించడం అంత తేలిక కాదని.. బీసీసీఐకి అసలు సవాల్‌ ముందు ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధంతరంగా వచ్చేసిన ఇషాన్‌ కిషన్‌, ఇంగ్లాండ్‌తో సిరీస్‌ మధ్యలో చోటు కోల్పోయిన శ్రేయస్‌ అయ్యర్‌లను రంజీ ట్రోఫీలో ఆడమన్నా పెడచెవిన పెట్టారన్న కారణంతో వారికి బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్టులు నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీసీసీఐ వారి పట్ల మరీ కఠినంగా వ్యవహరించిందని కొందరంటుంటే.. దేశవాళీ క్రికెట్‌ పట్ల నిర్లక్ష్యం వహించే యువ ఆటగాళ్లకు ఇది హెచ్చరిక అవుతుందంటూ బీసీసీఐ నిర్ణయాన్ని మరికొందరు సమర్థిస్తున్నారు. ఓవైపు ఇబ్బడిముబ్బడిగా అంతర్జాతీయ సిరీస్‌లను పెంచేసి, మరోవైపు ఐపీఎల్‌కు ఎక్కడ లేని విలువనిస్తూ టీమ్‌ఇండియా ఆటగాళ్లు రంజీ లాంటి దేశవాళీ టోర్నీలను తేలిగ్గా తీసుకునేలా చేసింది బీసీసీఐయే. రంజీలకు తనే ప్రాధాన్యం తగ్గించి ఇప్పుడు యువ ఆటగాళ్లపై కొరడా ఝుళిపించడం ఎంతవరకు సబబు అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. టీమ్‌ఇండియా ఎంపికకు ఎప్పట్నుంచో ఐపీఎల్‌ ప్రదర్శన ప్రామాణికంగా మారిన నేపథ్యంలో రంజీలను యువ ఆటగాళ్లు ఎందుకు పట్టించుకుంటారనేది ప్రధానంగా వినిపిస్తున్న వాదన. ఇప్పుడిప్పుడే భారత జట్టులో కుదురుకుంటున్న యువ ఆటగాళ్లు కూడా రంజీలను పూర్తిగా విస్మరిస్తుండటం వల్ల ఆ టోర్నీ నిర్వీర్యం అయిపోతోందని భావించిన బీసీసీఐ ఆలస్యంగా అయినా మేల్కొని ఇలా హెచ్చరిక జారీ చేయడం మంచిదే. కానీ ఈ నిర్ణయాన్ని మున్ముందు పకడ్బందీగా అమలు చేసి దేశవాళీ క్రికెట్‌ను బీసీసీఐ బలోపేతం చేయడం అంత తేలిగ్గా ఏమీ కనిపించడం లేదు.

పనిభారం మాటేంటి?

టీమ్‌ఇండియా ఆటగాళ్లు రంజీ సహా దేశవాళీ టోర్నీలకు దూరంగా ఉండడానికి ప్రధాన కారణం.. పనిభారం. ఒకప్పటితో పోలిస్తే అంతర్జాతీయ మ్యాచ్‌ల సంఖ్య బాగా పెరిగిపోయింది. టెస్టులు, వన్డేలకు తోడు టీ20లు వచ్చాక మూడు ఫార్మాట్లలో మ్యాచ్‌లు ఆడటం సవాలుగా మారింది. దీనికి తోడు ఐపీఎల్‌ కోసం రెండు నెలలు కేటాయించాలి. దీంతో అంతర్జాతీయ క్రికెట్లోనే వరుసగా అన్ని మ్యాచ్‌లూ ఆడటం కష్టమవుతోంది. కొన్ని మ్యాచ్‌లు ఆడాక విరామం తీసుకోక తప్పట్లేదు. తీవ్ర ఒత్తిడితో కూడిన అంతర్జాతీయ, ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడడం వల్ల ఆటగాళ్లు ఇప్పటికే తరచుగా గాయాల పాలవుతున్నారు. గత రెండేళ్లలో రెండంకెల సంఖ్యలో టీమ్‌ఇండియా ఆటగాళ్లు గాయపడి నెలల తరబడి ఆటకు దూరమయ్యారు. భారత ఆటగాళ్లు గాయాలతో శస్త్రచికిత్సలు చేయించుకోవడం సాధారణం అయిపోయింది. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ, ఐపీఎల్‌ మ్యాచ్‌ల మధ్య కొంత విరామం దొరికితే.. విశ్రాంతి తీసుకోకుండా రంజీ ట్రోఫీలో ఆడడం అంతర్జాతీయ క్రికెటర్లకు భారం కాదా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

అందరికీ వర్తిసుందా?

ఏ కారణంతో కొంత కాలం భారత జట్టుకు దూరమైనా.. తిరిగి దేశవాళీల్లో ఆడి ఫామ్‌, ఫిట్‌నెస్‌ చాటుకుంటేనే టీమ్‌ఇండియా ఎంపికకు పరిగణనలోకి తీసుకుంటామని బీసీసీఐ చెబుతోంది. అయితే ఈ నిబంధనను స్టార్‌ ఆటగాళ్లకు కూడా వర్తింపజేస్తారా అన్నది ప్రశ్న. అసలు రంజీలు ఆడాలని స్టార్‌ క్రికెటర్లను బీసీసీఐ ఆదేశించగలదా అంటే.. సమాధానం ఉండదు. బీసీసీఐ తాజా నిర్ణయాన్ని స్వాగతిస్తూ మాజీ ఆటగాడు కీర్తి ఆజాద్‌.. కోహ్లి, రోహిత్‌ సైతం రంజీల్లో ఆడేలా చూడాలని బీసీసీఐకి సూచించాడు. టెస్టు కెరీర్‌ ఆరంభమయ్యాక.. కోహ్లి ఇప్పటివరకు ఒక్క రంజీ మ్యాచ్‌ మాత్రమే ఆడగా.. రోహిత్‌ 2015 తర్వాత ఆ ట్రోఫీలో పాల్గొనలేదు. అయితే మూడు ఫార్మాట్లలో ఆడుతూ, ఐపీఎల్‌లో పాల్గొంటున్న స్టార్‌ ఆటగాళ్లపై ఇప్పటికే పనిభారం పెరిగిపోతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తీరిక లేని షెడ్యూల్‌పై ఇప్పటికే ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాంటపుడు రంజీలకు స్టార్లు ఎలా అందుబాటులోకి వస్తారు? వారిని బీసీసీఐ ఎలా ఆదేశించగలదు? టీమ్‌ఇండియాకు దూరంగా ఉన్నపుడు దేశవాళీల్లో ఆడాల్సిందే అన్న నిబంధనను అందరికీ వర్తింపజేయని పక్షంలో కేవలం ఇషాన్‌, శ్రేయస్‌లను శిక్షించడానికే ఈ హడావుడి అనే అభిప్రాయం కలుగుతుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ మలి అడుగులు ఎలా ఉంటాయో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని