పుణెరికే పట్టం

ప్రత్యర్థి ఆటగాళ్లు వస్తే.. మడమ పట్టేయడం.. కాళ్లు చుట్టేయడం.. వెనకాల నుంచి ఒక్కసారిగా ఎత్తి పడేయడం! తాము రైడింగ్‌కు వెళ్తే.. ముందుకు సాగి పాయింట్‌ తేవడం.. ఒక్కసారిగా ఎగిరి బయటకు రావడం.. చుట్టుముట్టినా తప్పించుకోవడం! ఇలా.. ట్యాక్లింగ్‌లో, రైడింగ్‌లో అదరగొట్టిన పుణెరి పల్టాన్‌ తొలిసారి ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) ఛాంపియన్‌గా నిలిచింది.

Published : 02 Mar 2024 03:13 IST

పీకేఎల్‌ పదో సీజన్‌ ఛాంపియన్‌గా పల్టాన్‌
తొలిసారి కప్పు సొంతం
ఫైనల్లో హరియాణాపై గెలుపు
ఈనాడు - హైదరాబాద్‌

ప్రత్యర్థి ఆటగాళ్లు వస్తే.. మడమ పట్టేయడం.. కాళ్లు చుట్టేయడం.. వెనకాల నుంచి ఒక్కసారిగా ఎత్తి పడేయడం! తాము రైడింగ్‌కు వెళ్తే.. ముందుకు సాగి పాయింట్‌ తేవడం.. ఒక్కసారిగా ఎగిరి బయటకు రావడం.. చుట్టుముట్టినా తప్పించుకోవడం! ఇలా.. ట్యాక్లింగ్‌లో, రైడింగ్‌లో అదరగొట్టిన పుణెరి పల్టాన్‌ తొలిసారి ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) ఛాంపియన్‌గా నిలిచింది. పదో సీజన్‌ ఫైనల్లో హరియాణా స్టీలర్స్‌ను ఓడించింది. నిరుడు రన్నరప్‌గా నిలిచిన ఆ జట్టు.. ఈ సారి వదల్లేదు. లీగ్‌ దశను అగ్రస్థానంతో ముగించిన ఆ జట్టు.. కప్పునూ పట్టేసింది.

డిఫెండర్ల ఆధిపత్యంతో మొదలై.. రైడర్ల హవాతో ముగిసిన పీకేఎల్‌ పదో సీజన్‌ తుదిపోరులో పుణెరి పల్టాన్‌దే విజయం. ఛాంపియన్‌ లాగే ఆడిన ఆ జట్టు.. టైటిల్‌ పట్టేసింది. శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఫైనల్లో పుణెరి 28-23 తేడాతో హరియాణా స్టీలర్స్‌ను ఓడించింది. రైడింగ్‌లో పంకజ్‌ మోహితె (9), మోహిత్‌ గోయత్‌ (5).. ట్యాక్లింగ్‌లో గౌరవ్‌ ఖత్రి (4).. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో కెప్టెన్‌ అస్లాం ముస్తాఫా (4) రాణించి జట్టును గెలిపించారు. హరియాణా జట్టులో శివమ్‌ (6) మాత్రమే ఫర్వాలేదనిపించాడు. స్టార్‌ డిఫెండర్‌, కెప్టెన్‌ జైదీప్‌ విఫలమవడం హరియాణాకు చేటు చేసింది. మ్యాచ్‌ ఆరంభంలో 3-0తో పుణెరి ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ మోహిత్‌ను పట్టేసి పాయింట్ల ఖాతా తెరిచిన హరియాణా క్రమంగా పుంజుకుంది. మొదట్లో డిఫెండర్లదే ఆధిపత్యం. తొలి 12 నిమిషాల్లో రెండు జట్లు కలిపి 11 పాయింట్లు సాధించగా ఇందులో 8 ట్యాక్లింగ్‌లో వచ్చినవే. ప్రమాదకర డిఫెండర్‌ మహమ్మద్రెజాను రైడర్‌ శివమ్‌ ఔట్‌ చేయడంతో హరియాణా 6-6 తో స్కోరు సమం చేసింది. అక్కడి నుంచి పోరు మరో స్థాయికి చేరింది. ఒక్కో పాయింట్‌ కోసం.. పాయింట్‌ సాధించే అవకాశం కోసం.. రెండు జట్లూ నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. ఆధిక్యం కోసం పట్టుబట్టిన ఇరు జట్లు.. డూ ఆర్‌ డై రైడ్‌లో మాత్రమే పాయింట్లు సాధించేందుకు ప్రయత్నించాయి. ఇలాంటి రైడ్‌లోనే పంకజ్‌ ఏకంగా నాలుగు పాయింట్లు సాధించాడు. జైదీప్‌ ట్యాక్లింగ్‌ను దాటి గీత వైపు దూసుకొచ్చే క్రమంలో మరో ముగ్గురు ఆటగాళ్లు వచ్చి పట్టుకున్నారు. దీంతో 13-7తో పుణెరి ఆధిక్యంలోకి వెళ్లింది. ప్రత్యర్థి కోర్టులో ఒక్క ఆటగాడే మిగిలాడు. దీంతో తొలి అర్ధభాగంలోనే హరియాణాను ఆలౌట్‌ చేసే అవకాశాన్ని పుణెరి సృష్టించుకుంది. కానీ సబ్‌స్టిట్యూట్‌ రైడర్‌గా వచ్చిన విశాల్‌.. బోనస్‌తో పాటు ఓ టచ్‌ పాయింట్‌ తెచ్చి హరియాణా ఆశలు నిలిపాడు. పుణెరి 13-10తో విరామానికి వెళ్లింది. ద్వితీయార్థంలో హరియాణాను ఆలౌట్‌ చేసి 18-11తో ఆధిక్యాన్ని పెంచేసుకుంది. మరోవైపు హరియాణా కూడా ఒక్కో పాయింట్‌ సాధిస్తూ సాగిపోయింది. కానీ ప్రత్యర్థిని అందుకోలేకపోయింది. పంకజ్‌ నిలకడగా పాయింట్లు తేవడంతో పుణెరి మరో 10 నిమిషాల ఆట ఉందనగా 22-16తో నిలిచింది. ఆఖరి అయిదు నిమిషాల ఆట ఉందనగా పుణెరి 24-19తో విజయం ఖాయం చేసుకుంది. శివమ్‌ను వెనుక నుంచి వచ్చి గౌరవ్‌ అమాంతం ఎత్తేసి బయటకు పంపించిన తీరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన హరియాణా రైడర్‌ సిద్ధార్థ్‌ దేశాయ్‌.. ఒకే రైడ్‌లో రెండు పాయింట్లు తేవడంతో హరియాణా 23-28తో నిలిచింది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ఎలాంటి నాటకీయత లేకుండా పుణెరి మ్యాచ్‌ ముగిసింది. పుణెరి ఆటగాళ్లందరూ కోర్టులో ఆనందంతో నృత్యం చేశారు.


7

పీకేఎల్‌లో ఛాంపియన్‌గా నిలిచిన ఏడో జట్టు పుణెరి పల్టాన్‌. పట్నా పైరేట్స్‌ (2016లో 3వ, 4వ సీజన్‌, 2017లో) మూడు సార్లు, జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌ (2014, 2022) రెండు సార్లు, యు ముంబా (2015), బెంగళూరు బుల్స్‌ (2018), బెంగాల్‌ వారియర్స్‌ (2019), దబంగ్‌ దిల్లీ (2021) ఒక్కో సారి కప్పు దక్కించుకున్నాయి.


రూ.3 కోట్లు: విజేతగా నిలిచిన పుణెరి పల్టాన్‌ అందుకున్న నగదు బహుమతి. రన్నరప్‌ హరియాణా రూ.1.8 కోట్లు సొంతం చేసుకుంది.


పారా హీరోలు

పీకేఎల్‌ పదో సీజన్‌ ఫైనల్లో పారా అథ్లెట్లు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. పారాలింపిక్స్‌ రజత విజేత యోగేష్‌ కథూనియా (డిస్కస్‌ త్రో), ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ కాంస్య విజేతలు పలక్‌ కోహ్లి, మన్‌దీప్‌ కౌర్‌, ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన ప్రణవ్‌ సూర్మ (క్లబ్‌ త్రో) ఈ మ్యాచ్‌కు హాజరయ్యారు. విజేత జట్టుకు జాతీయ బ్యాడ్మింటన్‌ ప్రధాన కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ట్రోఫీ అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని