కూల్‌గా వదిలేశాడు..

అయిదు టైటిళ్లు సాధించి పెట్టాడు..! పదిసార్లు జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు! ఎన్నో జ్ఞాపకాలను అందించాడు. మరెన్నో అనుభూతులను మిగిల్చాడు.చూడాలనిపించే కెప్టెన్సీ అతడిది. అతడు ఐపీఎల్‌ చరిత్రలోనే మేటి కెప్టెన్‌.

Updated : 22 Mar 2024 07:51 IST

చెన్నై సారథిగా వైదొలగిన ధోని
రుతురాజ్‌కు బాధ్యతలు
చెన్నై

అతడిది చెరగని ముద్ర..! అయిదు టైటిళ్లు సాధించి పెట్టాడు..! పదిసార్లు జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు! ఎన్నో జ్ఞాపకాలను అందించాడు. మరెన్నో అనుభూతులను మిగిల్చాడు.చూడాలనిపించే కెప్టెన్సీ అతడిది. అతడు ఐపీఎల్‌ చరిత్రలోనే మేటి కెప్టెన్‌. కానీ అతడి ఆకర్షణీయ కెప్టెన్సీని ఇక చూడలేం. సారథిగా ఆ యోధుడి ఇన్నింగ్స్‌ ముగిసింది. కెప్టెన్‌గా ఎన్నో అపురూప విజయాలను సాధించి, చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఛాంపియన్‌ జట్టుగా తీర్చిదిద్దిన మహేంద్ర సింగ్‌ ధోని.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. యువ బ్యాటర్‌ రుతురాజ్‌కు సారథ్యాన్ని అప్పగించాడు. 2023 ఐపీఎల్‌ ఫైనలే సారథిగా మహేంద్రుడికి ఆఖరి మ్యాచ్‌.

‘కొత్త సీజన్‌లో కొత్త పాత్ర పోషించబోతున్నా’.. అంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో ధోని ఓ పోస్ట్‌ పెట్టడంతో ఆ పాత్ర ఏంటా అని అభిమానులంతా తెగ ఆలోచించారు. కానీ కెప్టెన్‌ కూల్‌ ఇలా షాకిస్తాడని మాత్రం ఊహించలేదు. చెన్నై సారథ్య బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ఐపీఎల్‌-17 ఆరంభానికి ఒక రోజు ముందు ధోని ప్రకటించాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ కొత్త కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ‘‘ధోని కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్‌ గైక్వాడ్‌కు అప్పగించాడు. రుతురాజ్‌ 2019 నుంచి చెన్నై జట్టులో అంతర్భాగం. ఈ కాలంలో అతడు 52 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడాడు. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌పై జట్టు ఆసక్తిగా ఉంది’’ అని సీఎస్కే గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆటగాడిగా ధోనీకి ఇదే ఆఖరి సీజన్‌ కావొచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. ‘‘ధోని ఏం చేసినా జట్టు ప్రయోజనాల కోసమే చేస్తాడు. కెప్టెన్ల సమావేశానికి కొద్ది సేపటి ముందే నాకు ఈ విషయం తెలిసింది. అతడి నిర్ణయాన్ని గౌరవించాలి’’ అని సీఎస్కే ముఖ్య కార్యనిర్వహణ అధికారి కాశీ విశ్వనాథన్‌ చెప్పాడు. రుతురాజ్‌ నిరుటి ఐపీఎల్‌లో 16 మ్యాచ్‌ల్లో 147.50 స్ట్రైక్‌రేట్‌తో 590 పరుగులు చేశాడు. అతడు కెప్టెన్సీకి కొత్తేమీ కాదు. నిరుడు ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత జట్టుకు రుతురాజ్‌ నాయకత్వం వహించాడు. తన రాష్ట్ర జట్టు మహారాష్ట్రను కూడా నడిపించాడు.

చెన్నైతో ధోనీది విడదీయరాని బంధం. ఆటగాడిగా నిష్క్రమించినా కూడా అతడు ఏదో ఒక పాత్రలో సీఎస్కేతో కొనసాగుతాడని భావిస్తున్నారు. చెన్నై 2022లో కూడా నాయకత్వ మార్పిడికి ప్రయత్నించింది. కెప్టెన్‌గా జడేజా పేలవ ప్రదర్శన చేయడంతో ఎనిమిది మ్యాచ్‌ల తర్వాత తిరిగి ధోనీ చేతికే పగ్గాలు వచ్చాయి. ‘‘అప్పుడు మేం సఫలం కాలేకపోయాం. ఈసారి పరిస్థితులు వేరు’’ అని కాశీ విశ్వనాథన్‌ అన్నాడు. చెన్నై కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కెప్టెన్‌ మార్పిడికి మేం 2022లో సిద్ధంగా లేం. ధోనీకి ఆటపై అవగాహన చాలా ఎక్కువ. నాయకత్వం కోసం కుర్రాళ్లను సిద్ధం చేయాలనుకున్నాం. ఈసారి మాత్రం కెప్టెన్సీ మార్పిడికి సిద్ధంగా ఉన్నాం’’ అని చెప్పాడు. 42 ఏళ్ల ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. 252 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన ధోని  135.91 స్ట్రైక్‌రేట్‌తో 5082 పరుగులు చేశాడు.


‘‘చెన్నైకి కెప్టెన్‌ కావడం గొప్ప గౌరవం. అంతకుమించిన పెద్ద బాధ్యత. ప్రతిభావంతులతో కూడిన జట్టును నడిపించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. జట్టులో ఎక్కువమంది అనుభవజ్ఞులే. ముఖ్యంగా నన్ను నడిపించేందుకు మహి భాయ్‌ ఉన్నాడు. జడ్డూ, రహానె కూడా ఉన్నారు. అందుకే దేని గురించి ఆందోళన చెందట్లేదు. కెప్టెన్సీని ఆస్వాదిస్తా’’

రుతురాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని