ఎండల్లో హాయ్‌ హాయ్‌

ఈసారి కొంచెం కొత్తగా.. కొంచెం ఇష్టంగా.. కొంచెం కష్టంగా ఉండబోతోంది ఈ టోర్నమెంట్‌. నిరుటితో పోలిస్తే ఆరు ఫ్రాంఛైజీలకు కెప్టెన్లు మారిపోయారు. చెన్నై, ముంబయి అభిమానులు తమ ఇష్ట సారథుల నాయకత్వాన్ని ఇక చూడలేరు.

Updated : 22 Mar 2024 06:54 IST

నేటి నుంచే ఐపీఎల్‌-17
వేసవి స్పెషల్‌ క్రికెట్‌ వినోదం
నేటి నుంచే ఐపీఎల్‌ 17
చెన్నై ×  బెంగళూరు
రాత్రి 8 గం. నుంచి
చెన్నై

ఉర్రూతలూగించే బ్యాటింగ్‌ విన్యాసాలు.. అచ్చెరువొందించే బౌలింగ్‌ ప్రదర్శనలు.. అబ్బురపరిచే ఫీల్డింగ్‌ చిత్రాలు. ఆఖరి బంతి వరకూ ఫలితం తేలకుండా.. ఉత్కంఠతో ఉత్తేజపరిచే అద్వితీయ పోరాటాలు! క్రికెట్‌ అభిమానులకు కంటినిండా వినోదం పంచడానికి, మనసంతా తృప్తితో నింపడానికి సర్వం సిద్ధం! ధనాధన్‌ ఆటతో రెండు నెలల పాటు ప్రేక్షకులను ఊపేసే సమ్మర్‌ స్పెషల్‌ వార్షిక క్రికెట్‌ మేళా వచ్చేసింది!

సారి కొంచెం కొత్తగా.. కొంచెం ఇష్టంగా.. కొంచెం కష్టంగా ఉండబోతోంది ఈ టోర్నమెంట్‌. నిరుటితో పోలిస్తే ఆరు ఫ్రాంఛైజీలకు కెప్టెన్లు మారిపోయారు. చెన్నై, ముంబయి అభిమానులు తమ ఇష్ట సారథుల నాయకత్వాన్ని ఇక చూడలేరు. నాయకుడు అంటే ఇలా ఉండాలి అనిపించేలా చెరగని ముద్ర వేసిన ధోని, ఇక చాలంటూ కెప్టెన్సీని త్యజించాడు. బహుశా ఆటగాడిగానూ అతడికి ఇదే చివరి ఐపీఎల్‌. అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ధోని సరసన ఉన్న రోహిత్‌ శర్మ.. నాయకత్వాన్ని హార్దిక్‌కు కోల్పోయాడు. గుజరాత్‌ పగ్గాలు శుభ్‌మన్‌ గిల్‌ అందుకున్నాడు. ఇక కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కిందటి టోర్నీకి దూరమైన విధ్వంసక వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌.. దిల్లీ కెప్టెన్‌గా తిరిగి రావడం ఉత్సుకతను రేపుతోంది. హైదరాబాద్‌కు కొత్తగా కమిన్స్‌, కోల్‌కతాకు శ్రేయస్‌ అయ్యర్‌ నాయకులుగా వ్యవహరించనున్నారు.

అదిరే ఆటతో కేవలం అభిమానులకు అలరించడానికి ఈసారి టోర్నీ పరిమితం కాదు. టీ20 ప్రపంచకప్‌ జట్టు ఎంపికలో ఈ టోర్నీలో ప్రదర్శన కూడా ఆటగాళ్లకు అర్హత ప్రమాణం. భారత జట్టులో ఎనిమిది స్థానాల కోసం కనీసం 10-12 మంది ఆటగాళ్లు పోటీలో ఉన్న నేపథ్యంలో ఈ ఐపీఎల్‌కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. విదేశీ ఆటగాళ్లకు కూడా ప్రపంచకప్‌ కోసం ఈ టోర్నీ ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.

ఐపీఎల్‌ అంటేనే అనూహ్యం. అనిశ్చితే దాని అందం. కోట్లు పోసి కొనుక్కున్న ఆటగాడు తుస్సుమనిపించవచ్చు. అనామక ఆటగాడు అందలాన్ని ఎక్కవచ్చు. మరి ఈసారి హీరోలెవరో.. జీరోలెవరో! చూద్దాం!

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ మధ్య పోరుతో శుక్రవారం ఐపీఎల్‌ సంబరం మొదలవుతుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీసీసీఐ తొలి 21 మ్యాచ్‌లకు (ఏప్రిల్‌ 7 వరకు) మాత్రమే షెడ్యూలును విడుదల చేసింది. పూర్తి షెడ్యూలును తర్వాత ప్రకటిస్తారు. మే 26న ఫైనల్‌ ఉండొచ్చని భావిస్తున్నారు. మొత్తం 10 జట్లు పోటీపడే ఈ టోర్నీలో 70 లీగ్‌ మ్యాచ్‌లు ఉంటాయి. ఏ జట్టు కూడా మరీ బలహీనంగా ఏమీ కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో టోర్నీ రసవత్తరంగా సాగుతుందని అంచనా. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తన తొలి మ్యాచ్‌లో శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఢీకొంటుంది.  

చెన్నై, ఆర్సీబీ సై: టోర్నమెంట్‌ తొలి మ్యాచ్‌లో శుక్రవారం చెన్నై, బెంగళూరు ఢీకొంటాయి. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఈ జట్లు 31 సార్లు తలపడగా 20 విజయాలతో చెన్నై పైచేయిలో ఉంది. ఆర్సీబీ పది మాత్రమే గెలిచింది. చివరి మ్యాచ్‌ (2023)లో చెన్నై ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. కోహ్లి, మ్యాక్స్‌వెల్‌, డుప్లెసిస్‌ వంటి వారితో బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న ఆర్సీబీకి.. ఆ స్థాయి బౌలింగ్‌ లేదు. మరోవైపు చెన్నైకి కూడా మంచి బ్యాటింగ్‌ లైనప్‌ ఉంది. స్పిన్‌ బౌలింగ్‌ ఆ జట్టు బలం.

విశాఖపట్నం కేంద్రంగా ఐపీఎల్‌ జట్టు లేకపోయినా.. ఈ సీజన్లో కొన్ని మ్యాచ్‌లకు ఈ నగరం ఆతిథ్యమివ్వబోతోంది. మహిళల ప్రిమియర్‌ లీగ్‌ రెండో దశ మ్యాచ్‌లకు దిల్లీ వేదికగా నిలవడంతో.. మళ్లీ ఐపీఎల్‌ కోసం మైదానాన్ని సిద్ధం చేయడానికి కొంత సమయం పట్టనుంది. దీంతో దిల్లీ తొలి రెండు మ్యాచ్‌లను వైజాగ్‌లో ఆడబోతోంది. ఈ నెల 31న చెన్నైతో, ఏప్రిల్‌ 3న కోల్‌కతాతో ఆ జట్టు ఇక్కడ తలపడుతుంది. ఐపీఎల్‌ రెండో దశ మ్యాచ్‌లు ఖరారయ్యాక మరి కొన్ని మ్యాచ్‌లను విశాఖకు కేటాయిస్తారేమో చూడాలి.


రెండు బౌన్సర్లు

ఐపీఎల్‌లో ఓ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. బౌలర్లు ఇక ఓవర్‌కు రెండు బౌన్సర్లు వేయొచ్చు. నిరుడు ప్రవేశపెట్టిన ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన ఈసారి కూడా కొనసాగుతుంది. వేగవంతమైన, కచ్చితమైన సమీక్ష కోసం స్మార్ట్‌ రీప్లే విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీని వల్ల టీవీ అంపైర్‌కు హాక్‌ఐ ఆపరేటర్ల నుంచి దృశ్యాలు నేరుగా, ఎక్కువ సంఖ్యలో అందనున్నాయి. టీవీ అంపైర్‌ భిన్న కోణాల్లో పరిశీలించి వేగంగా నిర్ణయం తీసుకోవచ్చు.


వీళ్లు వస్తున్నారు.. వాళ్లు లేరు

త ఏడాది ఫిట్‌నెస్‌, ఇతర సమస్యలతో ఐపీఎల్‌కు దూరమైన స్టార్‌ ఆటగాళ్లు ఈ సీజన్లో ఆడబోతున్నారు. వారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రిషబ్‌ పంత్‌ గురించే. రోడ్డు ప్రమాదం వల్ల అతడి కెరీర్లో దాదాపు 15 నెలలు విరామం వచ్చింది. ఒక సీజన్‌ ఐపీఎల్‌కు దూరంగా ఉన్న పంత్‌.. ఈసారి తిరిగి దిల్లీ కెప్టెన్‌గా పునరాగమనం చేస్తున్నాడు. గాయంతో నిరుడు ఐపీఎల్‌కు దూరమైన ముంబయి ప్రధాన పేసర్‌ బుమ్రా కూడా మళ్లీ లీగ్‌లో కనిపించనున్నాడు. కోల్‌కతా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సైతం ఇలాగే తిరిగి లీగ్‌లో అడుగు పెడుతున్నాడు. నిరుడు ఐపీఎల్‌ మధ్యలో గాయంతో వైదొలిగిన లఖ్‌నపూ సారథి కేఎల్‌ రాహుల్‌ను సైతం మళ్లీ లీగ్‌లో చూడబోతున్నాం. ఇక గాయాలు, వ్యక్తిగత కారణాలతో కొందరు ఆటగాళ్లు లీగ్‌కు దూరమయ్యారు. గుజరాత్‌ పేసర్‌ మహ్మద్‌ షమి ఈ సీజన్లో ఆడడు. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు స్టోక్స్‌, జేసన్‌ రాయ్‌, మార్క్‌ వుడ్‌, ఆడమ్‌ జంపా, హ్యారీ బ్రూక్‌.. భారత పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ సైతం ఈ సీజన్‌కు అందుబాటులో లేరు.


విరాట్‌ సాధిస్తాడా?

పీఎల్‌లో చాలామంది స్టార్‌ ఆటగాళ్లు కప్పు కల నెరవేర్చుకున్నారు. కానీ లీగ్‌ ఆరంభం నుంచి బెంగళూరు జట్టుతో సాగుతున్న కోహ్లికి మాత్రం ఆశ తీరలేదు. ప్రతిసారీ బలమైన జట్టుతోనే బరిలోకి దిగినా.. టైటిల్‌ విజయం మాత్రం దక్కదు. ఈసారి మహిళల ప్రిమియర్‌ లీగ్‌లో బెంగళూరు కప్పు గెలవడంతో పురుషుల జట్టుకు ఈ కోరిక ఎప్పుడు నెరవేరుతుందనే చర్చ మరింత ఊపందుకుంది. ఈసారి కాగితంపై చూస్తే బెంగళూరు ఎంతో బలంగా కనిపిస్తోంది. విరాట్‌ సైతం మంచి ఊపులో ఉన్నాడు. అమ్మాయిల్లాగే తాము కప్పు గెలిస్తే బాగుంటుందని.. అందుకోసం చేయాల్సిందంతా చేస్తానని అంటున్నాడు కోహ్లి. మరి అతడి కోరిక నెరవేరుతుందా?


ఆ ఒక్కడు ఎవరు?

జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు వికెట్‌ కీపర్‌ ఎవరు అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ స్థానానికి ప్రధానంగా ముగ్గురి మధ్య పోటీ నెలకొంది. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుని ఐపీఎల్‌తో పునరాగమనం చేస్తున్న రిషబ్‌ పంత్‌ రేసులో ముందున్నాడు. కానీ లీగ్‌లో అతను ఫిట్‌నెస్‌, ఫామ్‌ను చాటుకోవాల్సి ఉంది. పంత్‌ లేని సమయంలో వికెట్‌ కీపర్లుగా అవకాశాలు దక్కించుకున్న జితేశ్‌ శర్మ, సంజు శాంసన్‌ కూడా తమకూ అవకాశం దక్కుతుందని ఆశతో ఉన్నారు. అందుకే ఐపీఎల్‌లో సత్తా చాటి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాలని చూస్తున్నారు. మరి ఈ ముగ్గురిలో ఎవరి ప్రదర్శన మెరుగ్గా ఉండి ప్రపంచకప్‌ టికెట్‌ సంపాదిస్తారో చూడాలి.


5

చెన్నై, ముంబయి ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జటు. చెరో అయిదు టైటిళ్లు గెలిచాయి. 2010, 2011, 2018, 2021, 2023లో చెన్నై.. 2013, 2015, 2017, 2019, 2020లో ముంబయి విజేతలు నిలిచాయి. కోల్‌కతా రెండు సార్లు (2012, 2014) కప్పును సొంతం చేసుకుంది. రాజస్థాన్‌ (2008), సన్‌రైజర్స్‌ (2016), గుజరాత్‌ (2022)   ఒక్కోసారి టైటిల్‌ నెగ్గాయి. 2009లో డెక్కన్‌ ఛార్జర్స్‌ విజేతగా నిలిచింది. ఐపీఎల్‌ తొలి సీజన్‌ నుంచి పోటీపడుతున్నా.. దిల్లీ, బెంగళూరు, పంజాబ్‌ల కప్పు కల మాత్రం నెరవేరలేదు. 2022లో ఐపీఎల్‌లోకి వచ్చిన లఖ్‌నవూ కూడా ఇంకా కప్పు అందుకోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని