స్టిమాక్‌ను తప్పించాల్సిందే

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్‌ చేతిలో భారత్‌ అనూహ్య ఓటమితో కోచ్‌ స్టిమాక్‌ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్‌ చేస్తున్నారు.

Published : 28 Mar 2024 02:36 IST

కోల్‌కతా: ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్‌ చేతిలో భారత్‌ అనూహ్య ఓటమితో కోచ్‌ స్టిమాక్‌ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్‌ చేస్తున్నారు. మంగళవారం 158వ ర్యాంకులో ఉన్న అఫ్గాన్‌ చేతిలో 117వ ర్యాంకర్‌ భారత్‌ 1-2తో ఓడిన సంగతి తెలిసిందే. ‘‘ఈ ఆటగాళ్లే ఖతార్‌తో చారిత్రక డ్రా (2022 ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌) చేసుకున్నారు. గతేడాది అద్భుతంగా రాణించారు. శాఫ్‌ ఛాంపియన్‌గా నిలిచారు. అదే జట్టు, ఆటగాళ్లు.. కానీ ఇప్పుడు ఏమైంది? ఎక్కడో ఏదో లోటు ఉంది. స్టిమాక్‌తో ఆటగాళ్ల బంధంపై స్పష్టత లేదు. జట్టు వాతావరణం సరిగ్గా లేదేమో అనిపిస్తోంది. అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌)లో ఇటీవల పరిణామాలు కూడా జట్టుపై ప్రభావం చూపిస్తున్నాయనే చెప్పాలి’’ అని గోమంజి సింగ్‌ తెలిపాడు. ‘‘భారత్‌లోని వివిధ టోర్నీల్లో ఉత్తమంగా ఆడిన ఆటగాళ్లకు గుర్తింపు దక్కడం లేదు. మరో సునీల్‌ ఛెత్రి ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నాం. కానీ ప్రతిభావంతులకు అవకాశాలు ఇవ్వకపోతే ఏం చేస్తాం? గతంలో సంతోష్‌ ట్రోఫీ, కోల్‌కతా లీగ్‌ లాంటి టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన చేసిన వాళ్లనూ జాతీయ జట్టులోకి తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడది లేదు. స్టిమాక్‌ జట్టు ఎంపిక అలా ఉంటుంది. ఇలాంటి ప్రదర్శన తర్వాత కోచ్‌ను తప్పించాల్సిందే’’ అని దీపేందు బిస్వాస్‌ అన్నాడు. భారత జట్టుకు ఏ విదేశీ కోచ్‌ కూడా ఖ్యాతి తేలేదని, ఒక్క ఛెత్రి కారణంగా మ్యాచ్‌లు గెలవలేమని సుబ్రతా భట్టాచార్య పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని