మళ్లీ బాబర్‌కే పగ్గాలు!

పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్‌ అజామ్‌ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్‌గా నియమించేందుకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

Published : 28 Mar 2024 02:37 IST

లాహోర్‌: పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్‌ అజామ్‌ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్‌గా నియమించేందుకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీ20 కెప్టెన్‌గా ఉన్న షహీన్‌ షా అఫ్రిది, టెస్టు సారథి షాన్‌ మసూద్‌పై పీసీబీ నమ్మకం కోల్పోయినట్లు సమాచారం. దీంతో మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో బాబర్‌ వైపే చూస్తున్నట్లు తెలిసింది. నిరుడు భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పాక్‌ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించడంతో బాబర్‌ను పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఆ తర్వాత టెస్టు సారథ్యాన్ని కూడా అతను వదులుకున్నాడు. దీంతో అప్పటి పీసీబీ ఛైర్మన్‌ జాకా అష్రఫ్‌.. టీ20లకు షహీన్‌ను, టెస్టులకు మసూద్‌ను కెప్టెన్లుగా ప్రకటించాడు. కానీ ఇప్పుడు పీసీబీ ఛైర్మన్‌గా ఉన్న మోసిన్‌ నఖ్వీ తిరిగి బాబర్‌కే మూడు ఫార్మాట్ల సారథ్య బాధ్యతలు అప్పజెప్పాలని చూస్తున్నట్లు తెలిసింది. ‘‘టీ20, టెస్టు కెప్టెన్లుగా జట్లను నడిపించే సామర్థ్యం విషయంలో షహీన్‌, మసూద్‌పై పీసీబీ నూతన నాయకత్వం నమ్మకం కోల్పోయినట్లు కనిపిస్తోంది. అందుకే తిరిగి కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టేందుకు బాబర్‌ సిద్ధంగా ఉన్నాడో లేదోనని కనుక్కుంటున్నారు. కానీ అతను కొన్ని విషయాల్లో బెట్టు చేస్తున్నట్లు తెలిసింది. ఛైర్మన్‌ నుంచి భరోసా కోరుతున్నాడు’’ అని పీసీబీ వర్గాలు తెలిపాయి. 2020లో బాబర్‌ మూడు ఫార్మాట్లలోనూ పాక్‌ కెప్టెన్‌ అయ్యాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని