ఇది సన్‌రైజర్సేనా?

సన్‌రైజర్స్‌ అంటే.. నత్తనడక బ్యాటింగ్‌కు మారు పేరు! సన్‌రైజర్స్‌ బ్యాటర్లది.. స్ట్రైక్‌రేట్‌లో ఎప్పుడూ వెనుకంజే! సన్‌రైజర్స్‌ మెరుపులన్నీ బౌలింగ్‌ వరకే! కానీ ఇదంతా పాత కథ!

Updated : 28 Mar 2024 03:38 IST

న్‌రైజర్స్‌ అంటే.. నత్తనడక బ్యాటింగ్‌కు మారు పేరు! సన్‌రైజర్స్‌ బ్యాటర్లది.. స్ట్రైక్‌రేట్‌లో ఎప్పుడూ వెనుకంజే! సన్‌రైజర్స్‌ మెరుపులన్నీ బౌలింగ్‌ వరకే! కానీ ఇదంతా పాత కథ! ఆరంభంలో కొన్ని సీజన్ల వరకు 130, 140 స్కోర్ల జట్టుగా ముద్రపడ్డ అదే సన్‌రైజర్స్‌ ఇప్పుడు ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డును తన పేరిట లిఖించుకుంది. పదకొండేళ్ల కిందట క్రిస్‌ గేల్‌ (175 నాటౌట్‌) వీర విధ్వంసంతో 5 వికెట్లకు ఏకంగా 263 పరుగులు చేసిన బెంగళూరు రికార్డును బుధవారం సన్‌రైజర్స్‌ తిరగరాసింది. ఏ రికార్డయినా ఏదో ఒక రోజు బద్దలవ్వాల్సిందే. కానీ పరుగుల వరద పారే ఐపీఎల్‌లో ఆర్సీబీ రికార్డు పదకొండేళ్ల పాటు పదిలంగా ఉండడం ఆశ్చర్యం! దాన్ని మళ్లీ బెంగళూరో లేదంటే ముంబయి లాంటి జట్టో బద్దలు కొడుతుందనే అంచనాలుండేవి. ఎందుకంటే ఆ జట్లే లీగ్‌లో భీకర బ్యాటింగ్‌కు ప్రసిద్ధి. కానీ ఆశ్చర్యకరంగా హైదరాబాద్‌ రికార్డును సొంతం చేసుకుంది. నెమ్మదైన బ్యాటింగ్‌కు పేరుపడ్డ సన్‌రైజర్స్‌లో వార్నర్‌ కెప్టెన్‌ అయ్యాకే దూకుడు పెరిగింది. కానీ ఇప్పుడున్న దూకుడు మాత్రం అసాధారణం.

దక్షిణాఫ్రికా మెరుపు వీరుడు హెన్రిచ్‌ క్లాసెన్‌ రాకతో జట్టు బ్యాటింగ్‌ స్వరూపం మారింది. ఈ సీజన్‌కు ట్రావిస్‌ హెడ్‌ కూడా తోడయ్యాడు. తొలి మ్యాచ్‌లో అతణ్ని ఆడించకపోవడం ఎంత పెద్ద తప్పో ఇప్పుడు జట్టు యాజమాన్యానికి బాగానే అర్థమై ఉంటుంది. తానాడిన తొలి మ్యాచ్‌లోనే హెడ్‌ తనలోని విధ్వంసక కోణాన్ని బయటికి తీశాడు. క్రీజులోకి వచ్చీ రాగానే ముంబయి బౌలర్లపై విరుచుకుపడిపోయాడు. ట్రావిస్‌ దూకుడుకే తట్టుకోలేకపోతుంటే.. తర్వాత అభిషేక్‌ శర్మ వచ్చాడు. హెడ్‌ను మించి విధ్వంసం సృష్టించాడు. హెడ్‌ 18 బంతుల్లో అర్ధశతకం సాధించి సన్‌రైజర్స్‌ తరఫున అత్యంత వేగంగా ఈ ఘనత అందుకున్న బ్యాటర్‌గా నిలిస్తే.. కొన్ని నిమిషాల్లోనే ఆ రికార్డును అభిషేక్‌ (16 బంతుల్లో) బద్దలు కొట్టడం విశేషం. వీళ్లిద్దరూ ఔటైనా ముంబయికి ఉపశమనం లేకపోయింది. క్లాసెన్‌ రానే వచ్చాడు. ఈ సీజన్లో 11 సిక్సర్లు బాదాక కానీ క్లాసెన్‌ తొలి ఫోర్‌ కొట్టలేదంటే అతడికి సిక్స్‌ హిట్టింగ్‌ ఎంత సరదానో అర్థం చేసుకోవచ్చు. అతను ఊచకోతను మరో స్థాయికి తీసుకెళ్లి ఐపీఎల్‌ అత్యధిక స్కోరు రికార్డును సన్‌రైజర్స్‌ పేరుకు మార్చాడు. హైదరాబాద్‌ బ్యాటర్లు ఇదే దూకుడు కొనసాగిస్తే.. ఈ సీజన్లో ఆ జట్టు రాత మారబోతున్నట్లే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని