ఉప్పల్‌ ఊగిపోయింది

ఐపీఎల్‌ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ అద్వితీయమైన బ్యాటింగ్‌తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్‌ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్‌లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్‌లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది.

Updated : 28 Mar 2024 03:45 IST

ఐపీఎల్‌ చరిత్రలో సన్‌రైజర్స్‌ అత్యధిక స్కోరు
బ్యాటర్ల రికార్డుల మోత
ముంబయిపై హైదరాబాద్‌ విజయం
ఈనాడు - హైదరాబాద్‌

గుర్తుందా 2013 ఏప్రిల్‌ 23  నాటి గేల్‌ తుపాను!
టీ20ల్లో ఒక జట్టు సాధించేంత స్కోరు (175 నాటౌట్‌)ను అతనొక్కడే కొట్టేస్తే.. వన్డే మ్యాచ్‌లో ఓ జట్టు సగటు స్కోరు (263/5)ను టీ20లోనే సాధించేసింది బెంగళూరు ఆ రోజు!
ఐపీఎల్‌లో అత్యధిక స్కోరుతో ఆ రోజు నమోదైన రికార్డు పదకొండేళ్ల పాటు చెక్కు చెదరలేదు!
నాటి తుపానును మించే సునామీ ఇప్పుడొచ్చింది. ఈసారి వేదిక మన భాగ్యనగరమే. 20 ఓవర్లలో 277/3 స్కోరుతో ఐపీఎల్‌లో అత్యంత విధ్వంసక జట్టుగా కొత్త రికార్డు మన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌దే. నాడు గేల్‌ ఒక్కడు ప్రత్యర్థి బౌలింగ్‌ను ఊచకోత కోస్తే.. ఈసారి ముగ్గురు సన్‌రైజర్స్‌ యోధులు కలిసి వీర విధ్వంసం సృష్టించారు.
ఒకడు మెరుపైతే.. ఇంకొకడు ఉరుమయ్యాడు.. మరొకడు పిడుగులా పడ్డాడు. ట్రావిస్‌ హెడ్‌ (62; 24 బంతుల్లో 9×4, 3×6), అభిషేక్‌ శర్మ (63; 23 బంతుల్లో 3×4, 7×6), హెన్రిచ్‌ క్లాసెన్‌ (80 నాటౌట్‌; 34 బంతుల్లో 4×4, 7×6).. ఈ ముగ్గురూ కలిసి ఉప్పల్‌ స్టేడియంలోకి పరుగుల సునామీనే తీసుకొచ్చారు.
ముంబయి బ్యాటర్లేమైనా తక్కువ తిన్నారా? ఛేదన అసాధ్యమనిపించినా.. ప్రయత్నం మానలేదు. తిలక్‌ వర్మ (64; 34 బంతుల్లో 2×4, 6×6), టిమ్‌ డేవిడ్‌ (42 నాటౌట్‌; 22 బంతుల్లో 2×4, 3×6), ఇషాన్‌ కిషన్‌ (34; 13 బంతుల్లో 2×4, 4×6) శక్తి వంచన లేకుండా ధ్వంస రచన చేశారు. కానీ చివరికి 246/5తో ఓటమి వైపే నిలిచింది ముంబయి. ఐపీఎల్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్క మ్యాచ్‌లో 500కు పైగా పరుగులు నమోదయ్యాయి. అందులో 31 ఫోర్లు, 38 సిక్సర్లుండడం విశేషం.
బౌలర్లు నిస్సహాయులై.. ఫీల్డర్లు ప్రేక్షకులైన మ్యాచ్‌లో.. పదే పదే ఫోర్‌, సిక్స్‌ సంకేతాలు ఇస్తూ అంపైర్లకు మాత్రం బోలెండంత పనే! నభూతో అనిపించే విధ్వంసక విన్యాసాలను ఓవైపు ఆస్వాదిస్తూనే.. మరోవైపు బంతి ఎటు నుంచి దూసుకొచ్చి తమపై పడుతుందో అని ఉత్కంఠను అనుభవించిన హైదరాబాదీ అభిమానులకు ఈ మ్యాచ్‌ ఓ చిరస్మరణీయ జ్ఞాపకమే!

పీఎల్‌ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ అద్వితీయమైన బ్యాటింగ్‌తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్‌ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్‌లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్‌లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. బుధవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 31 పరుగుల తేడాతో ముంబయిని ఓడించింది. ట్రావిస్‌ హెడ్‌ (62; 24 బంతుల్లో 9×4, 3×6), అభిషేక్‌శర్మ (63; 23 బంతుల్లో 3×4, 7×6), మార్‌క్రమ్‌ (42 నాటౌట్‌; 28 బంతుల్లో 2×4, 1×6), హెన్రిచ్‌ క్లాసెన్‌ (80 నాటౌట్‌; 34 బంతుల్లో 4×4, 7×6) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 277 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బాటలు వేసిన ముంబయి చివర్లో తడబడింది. 20 ఓవర్లలో 5 వికెట్లకు 246 పరుగులు చేయగలిగింది. హైదరాబాదీ తిలక్‌వర్మ (64; 34 బంతుల్లో 2×4, 6×6), టిమ్‌ డేవిడ్‌ (42 నాటౌట్‌; 22 బంతుల్లో 2×4, 3×6); ఇషాన్‌ కిషన్‌ (34; 13 బంతుల్లో 2×4, 3×6) పోరాడినా ఫలితం లేకపోయింది.

పోరాడిన ముంబయి: ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక లక్ష్యం ముందున్నా.. ముంబయి వెనక్కి తగ్గలేదు. మొదట్నుంచే బ్యాటుకు పని చెప్పిన ఓపెనర్లు రోహిత్‌ శర్మ (26; 12 బంతుల్లో 1×4, 3×6), ఇషాన్‌ కిషన్‌ ముంబయి ఉద్దేశాన్ని స్పష్టంచేశారు. పోరాడితే పోయేదేమీ లేదన్నట్లుగా పరుగుల వేట మొదలుపెట్టారు. ఉనద్కత్‌ను రోహిత్‌.. భువనేశ్వర్‌ను ఇషాన్‌ ఆటాడుకున్నారు. రోహిత్‌ రెండు సిక్సర్లు బాదగా.. ఇషాన్‌ మూడు సార్లు బంతిని స్టాండ్స్‌కు పంపించాడు. షాబాజ్‌ అహ్మద్‌కు సిక్సర్‌తో స్వాగతం చెప్పిన ఇషాన్‌ మరో భారీ షాట్‌కు ప్రయత్నించి నిష్క్రమించాడు. రోహిత్‌ సైతం కమిన్స్‌ ఓవర్లో సిక్సర్‌ బాది.. తర్వాతి బంతికే వెనుదిరిగాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 56 పరుగులు (20 బంతుల్లో) జతచేశారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు మాత్రం బ్యాట్లు ఝళిపించడం మానలేదు. పవర్‌ ప్లేలో 76 పరుగులు రాబట్టిన ముంబయిని నమన్‌ ధీర్‌ (30; 14 బంతుల్లో 2×4, 2×6), తిలక్‌వర్మ లక్ష్యం దిశగా తీసుకెళ్లారు. 8 ఓవర్లలోనే ముంబయి స్కోరు 100 పరుగులు దాటింది. షాబాజ్‌ వేసిన పదో ఓవర్లో తిలక్‌ మూడు సిక్సర్లతో 22 పరుగులు పిండుకున్నాడు. ఫలితంగా 10 ఓవర్లలో ముంబయి 141 పరుగులు సాధించింది. ఐపీఎల్‌ చరిత్రలో తొలి 10 ఓవర్లలో అత్యధిక స్కోరు (గతంలో 131) రికార్డును ఈ మ్యాచ్‌లో రెండు జట్లూ దాటాయి. ఇక తిలక్‌ 24 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించగా.. నమన్‌ నిష్క్రమణ తర్వాత క్రీజులోకొచ్చిన హార్దిక్‌ ఒక సిక్సర్‌, బౌండరీతో జోరు మీద కనిపించాడు. 36 బంతుల్లో 96 పరుగులు కావాల్సిన సమయంలో కమిన్స్‌ స్లో బంతిని భారీషాట్‌ ఆడిన తిలక్‌.. డీప్‌ మిడ్‌ వికెట్‌లో మయాంక్‌ అగర్వాల్‌ చేతికి చిక్కాడు. చివర్లో టిమ్‌ డేవిడ్‌ ప్రయత్నించినా.. కొండంత లక్ష్యాన్ని కరిగించలేకపోయాడు. ఆఖరి ఓవర్లో 47 పరుగులు అవసరమవడంతో ముంబయి ఓటమి ఖరారరైపోయింది.

అంచనాలు తలకిందులు: నిజానికి ఈ మ్యాచ్‌ ముంబయి బ్యాటర్లు × సన్‌రైజర్స్‌ బౌలర్లు మధ్య అనుకున్నారంతా! కానీ ఈ విశ్లేషణ తలకిందులవడానికి ఎంతోసేపు పట్టలేదు. తుపాను ముందు ప్రశాంతతలా.. తొలి ఓవర్లో ఏడు పరుగులతో నెమ్మదిగా మొదలైన సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో హార్దిక్‌ వేసిన రెండో ఓవర్‌ తొలి బంతే మ్యాచ్‌కు మలుపు. ట్రావిస్‌ హెడ్‌ షాట్‌ బాదగా.. మిడాఫ్‌లో టిమ్‌ డేవిడ్‌ చేతుల్లో నుంచి బంతి బౌండరీకి దూసుకెళ్లింది. అప్పుడు హెడ్‌ స్కోరు 5. ఆ క్యాచ్‌ పట్టుంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ.. అక్కడ్నుంచి ఉప్పల్‌ స్టేడియం మోతమోగింది. దక్షిణాఫ్రికా అండర్‌-19 పేసర్‌ క్వెనా మఫాకా బౌలింగ్‌లో హెడ్‌ గేరు మార్చాడు. వరుసగా 6, 6, 4, 4తో 22 పరుగులు పిండుకున్నాడు. ఆపై హెడ్‌ హార్దిక్‌ బౌలింగ్‌లో బౌండరీలతో విరుచుకుపడ్డాడు. మయాంక్‌ (11) తర్వాత క్రీజులో అడుగుపెట్టిన అభిషేక్‌శర్మ విశ్వరూపమే చూపించాడు. ఇటు హెడ్‌.. అటు అభిషేక్‌ బౌండరీలు, సిక్సర్లతో పరుగుల వరద పారించారు. కొయెట్జీ బౌలింగ్‌లో ఫ్రీహిట్‌ను సిక్సర్‌గా మలిచిన అభిషేక్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

10.2 ఓవర్లకే 150..: హెడ్‌, అభిషేక్‌ వీరవిహారంతో పవర్‌ప్లేలో సన్‌రైజర్స్‌ 81 పరుగులు సాధించింది. ఆ తర్వాత లెగ్‌ స్పిన్నర్‌ పియూష్‌ చావ్లాకు చుక్కలే కనిపించాయి. అభిషేక్‌ మూడు సిక్సర్లతో 21 పరుగులు రాబట్టాడు. ఫలితంగా ఏడో ఓవర్లోనే సన్‌రైజర్స్‌ 100 పరుగులు మైలురాయిని అధిగించింది. హెడ్‌ను కొయెట్జీ పెవిలియన్‌కు పంపినా.. అభిషేక్‌ ఏమాత్రం తగ్గలేదు. మఫాకా బౌలింగ్‌లో వరుసగా 4, 6, 6తో చెలరేగి కేవలం 16 బంతుల్లోనే అర్ధసెంచరీ రాబట్టాడు. సన్‌రైజర్స్‌ 10.2 ఓవర్లలోనే 150 పరుగులకు చేరుకుంది. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకన్న తొలి జట్టుగా సన్‌రైజర్స్‌ నిలిచింది. అభిషేక్‌కు చావ్లా పగ్గాలు వేసినా సన్‌రైజర్స్‌ జోరు మాత్రం తగ్గలేదు. హెడ్‌, అభిషేక్‌ తుఫాన్‌ తర్వాత మార్‌క్రమ్‌, క్లాసెన్‌ సునామీ మొదలైంది. దీంతో సన్‌రైజర్స్‌ 14.4 ఓవర్లలోనే 200 పరుగులు సాధించింది. క్లాసెన్‌, మార్‌క్రమ్‌ పోటీపడి బాదేయడంతో సన్‌రైజర్స్‌ టాప్‌ గేర్‌లో దూసుకెళ్లి రికార్డు స్కోరును అందుకుంది.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: మయాంక్‌ (సి) డేవిడ్‌ (బి) పాండ్య 11; హెడ్‌ (సి) నమన్‌ (బి) కొయెట్జీ 62; అభిషేక్‌ (సి) నమన్‌ (బి) చావ్లా 63; మార్‌క్రమ్‌ నాటౌట్‌ 42; క్లాసెన్‌ నాటౌట్‌ 80; ఎక్స్‌ట్రాలు 19;
మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 277;
వికెట్ల పతనం: 1-45, 2-113, 3-161;
బౌలింగ్‌: మఫాకా 4-0-66-0; హార్దిక్‌ పాండ్య 4-0-46-1; బుమ్రా 4-0-36-0; కొయెట్జీ 4-0-57-1; చావ్లా 2-0-34-1; షామ్స్‌ ములాని 2-0-33-0

ముంబయి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) అభిషేక్‌ శర్మ (బి) కమిన్స్‌ 26; ఇషాన్‌ కిషన్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) షాబాజ్‌ 34; నమన్‌ ధీర్‌ (సి) కమిన్స్‌ (బి) ఉనద్కత్‌ 30; తిలక్‌ వర్మ (సి) మయాంక్‌ (బి) కమిన్స్‌ 64; హార్దిక్‌ పాండ్య (సి) క్లాసెన్‌ (బి) ఉనద్కత్‌ 24; టిమ్‌ డేవిడ్‌ నాటౌట్‌ 42; రొమారియో షెపర్డ్‌ నాటౌట్‌ 15; ఎక్స్‌ట్రాలు 11;
మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 246;
వికెట్ల పతనం: 1-56, 2-66, 3-150, 4-182, 5-224;
బౌలింగ్‌: భువనేశ్వర్‌ కుమార్‌ 4-0-53-0; ఉనద్కత్‌ 4-0-47-2; షాబాజ్‌ అహ్మద్‌ 3-0-39-1; కమిన్స్‌ 4-0-35-2; ఉమ్రాన్‌ మాలిక్‌ 1-0-15-0; మయాంక్‌ మార్కండె 4-0-52-0

148

తొలి 10 ఓవర్లలో సన్‌రైజర్స్‌ స్కోరు. గత రికార్డు (2014లో పంజాబ్‌, 2021లో ముంబయి 131 పరుగులు) కనుమరుగైంది.


523

ఈ మ్యాచ్‌లో నమోదైన పరుగులు. ఐపీఎల్‌లో ఓ మ్యాచ్‌లో అత్యధిక పరుగుల రికార్డు ఇదే.


277/3

ముంబయిపై సన్‌రైజర్స్‌ స్కోరు. ఐపీఎల్‌ చరిత్రలోనే ఓ జట్టు అత్యధిక స్కోరు ఇదే. ఆర్సీబీ (2013లో పుణె వారియర్స్‌పై 263/5) రికార్డు బద్దలైంది. ఓవరాల్‌గా పురుషుల టీ20ల్లో నేపాల్‌ (314/3), అఫ్గానిస్థాన్‌ (278/3) మాత్రమే   సన్‌రైజర్స్‌ కంటే ముందున్నాయి.


16

అర్ధశతకం సాధించేందుకు అభిషేక్‌ శర్మ ఆడిన బంతులు. సన్‌రైజర్స్‌ తరపున ఐపీఎల్‌లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాటర్‌ అతనే.


1

ఓ ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఒకే జట్టు నుంచి 20 బంతుల్లోపే అర్ధశతకాలు పూర్తి చేసుకున్న తొలి ద్వయంగా హెడ్‌- అభిషేక్‌ నిలిచారు.


38

ఈ మ్యాచ్‌లో సిక్సర్ల సంఖ్య. ఓ ఐపీఎల్‌ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు రికార్డు (ఆర్సీబీ- 33) బద్దలైంది.


66

ముంబయి పేసర్‌ మపాక సమర్పించుకున్న పరుగులు. ఐపీఎల్‌ అరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్నది అతనే.


200

ముంబయి తరపున ఐపీఎల్‌లో రోహిత్‌ ఆడిన మ్యాచ్‌లు. ఆ జట్టు తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడింది అతనే. ఈ సందర్భంగా మ్యాచ్‌కు ముందు రోహిత్‌కు సచిన్‌ 200 నంబరుతో కూడిన ప్రత్యేక జెర్సీ, టోపీ బహుకరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని