అమ్మో నైట్‌రైడర్స్‌ కోచ్‌

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కోచ్‌ చంద్రకాంత్‌ పండిత్‌ కోచింగ్‌ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్‌రౌండర్‌ డేవిడ్‌ వీజ్‌ అసహనం వ్యక్తం చేశాడు.

Published : 29 Mar 2024 02:43 IST

దిల్లీ: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కోచ్‌ చంద్రకాంత్‌ పండిత్‌ కోచింగ్‌ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్‌రౌండర్‌ డేవిడ్‌ వీజ్‌ అసహనం వ్యక్తం చేశాడు. మిలిటరీ తరహాలో సాగే చంద్రకాంత్‌ శిక్షణతో కోల్‌కతాకు ఆడే విదేశీ ఆటగాళ్లు విసుగెత్తిపోయినట్లు వీజ్‌ తెలిపాడు. ‘‘అతను మిలిటరీ తరహా కోచ్‌. చాలా కఠినంగా ఉంటాడు. క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తాడు. ఫ్రాంఛైజీ క్రికెట్లో విదేశీ ఆటగాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఆడి వస్తారు. వాళ్లకు ఎలా ప్రవర్తించాలో, ఏం ధరించాలో, ఏం చేయాలో ఎప్పుడూ చెబుతూ ఉండకూడదు. అది చాలా కష్టమైన విషయం. అతను ప్రతిదీ ఒక పద్ధతిలో చేయాలనుకుంటాడు. అది డ్రెస్సింగ్‌ రూంలో ఒక రకమైన ఒత్తిడితో కూడిన వాతావరణానికి దారి తీసింది. రెండేళ్లలో (మెక్‌కలమ్‌ కోచ్‌ పదవి నుంచి తప్పుకొన్నాక) చాలా మారిపోయింది. కొత్త కోచ్‌ తెచ్చిన కొత్త పద్ధతులు మాకు విజయాలు తెచ్చిపెడతాయని భావించాడు. ‘ఇది సర్కస్‌. నేను షో నడుపుతాను’ అని చెబుతున్నట్లు అనిపించేది. ఇక్కడికొచ్చింది ఆడడానికి. ఇలా చెయ్యి, అలా చెయ్యి అంటే అన్నింటికీ తల ఊపే రకం కాదు నేను. కొందరు నాకంటే మొండిగా ఉంటారు’’ అని వీజ్‌ అన్నాడు. గత సీజన్లో వీజ్‌ మూడు మ్యాచ్‌లే ఆడాడు. తనకు ఎక్కువ అవకాశాలు లభించకపోవడం పట్ల కూడా అతను అసహనం వ్యక్తం చేశాడు. ఈసారి కోల్‌కతాకే కాదు, ఐపీఎల్‌కూ వీజ్‌ దూరమయ్యాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని