ఐపీఎల్‌ అంటే క్రికెట్టేనా!

ఐపీఎల్‌ ఊహించని స్థాయిలో   వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్‌ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్‌ రాయల్స్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు.

Published : 29 Mar 2024 02:44 IST

దిల్లీ: ఐపీఎల్‌ ఊహించని స్థాయిలో   వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్‌ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్‌ రాయల్స్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు. సాధన, వాణిజ్య ప్రకటనల షూటింగ్‌ కోసం ఆటగాళ్లు సమయం వెచ్చించడం కష్టంగా మారుతుండటంతో క్రికెట్‌ వెనకడుగు వేస్తుందనే ఉద్దేశంతో అశ్విన్‌ ఇలా వ్యాఖ్యానించాడు. ‘‘కుర్రాడిగా ఐపీఎల్‌లో అడుగుపెట్టినప్పుడు అగ్రశ్రేణి ఆటగాళ్ల నుంచి నేర్చుకోవడంపైనే దృష్టి పెట్టా. పదేళ్ల తర్వాత ఐపీఎల్‌ ఎలా ఉంటుందనే ఆలోచన అప్పుడు లేదు. చాలా సీజన్లుగా లీగ్‌లో ఉన్నాను కాబట్టి ఐపీఎల్‌ ఎంతో భారీగా మారిందని చెబుతున్నా. కొన్నిసార్లు ఐపీఎల్‌ అంటే క్రికెట్టేనా అనే ఆశ్చర్యమూ కలుగుతోంది. ఎందుకంటే లీగ్‌ సమయంలో ఆట వెనకడుగు వేస్తుంది. వ్యాపార ప్రకటనల షూటింగ్‌ కోసం ప్రాక్టీస్‌ చేయడం, సెట్స్‌లో గడపటం.. ఇలా ఐపీఎల్‌ ఎంతో మారిపోయింది. ఐపీఎల్‌ ఇంతలా వృద్ధి చెందుతుందని ఎవరూ ఊహించలేదు. నేను సీఎస్కే జట్టులో ఉన్నప్పుడు స్కాట్‌ స్టైరిస్‌తో మాట్లాడా. అతను ఆరంభ సీజన్లలో డెక్కన్‌ ఛార్జర్స్‌కు ఆడినప్పుడు.. ఐపీఎల్‌ రెండు మూడేళ్ల కంటే ఎక్కువ కాలం ఉండదని అనుకున్నట్లు చెప్పాడు. మొదటి నుంచి డబ్బు ప్రవాహం ఎక్కువే. వేలంలో ఆటగాళ్లకు భారీ ధర పలుకుతుంది. లీగ్‌కు వేలం అనేది ఎంతో ముఖ్యమైంది. కానీ సరైన జట్టును ఫ్రాంఛైజీలు ఎంచుకోవడమే అసలైన అందం. ఏ ఆటగాడు కూడా జట్టుకంటే ఎక్కువ కాదు. అందుకే జట్లు తెలివిగా పెట్టుబడి పెట్టాలి’’ అని అశ్విన్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని