విహారికి షోకాజ్‌ నోటీసు

టీమ్‌ఇండియా టెస్టు క్రికెటర్‌ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) షోకాజ్‌ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

Published : 29 Mar 2024 02:45 IST

ఎన్‌వోసీ కావాలంటున్న క్రికెటర్‌

బెంగళూరు: టీమ్‌ఇండియా టెస్టు క్రికెటర్‌ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) షోకాజ్‌ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఏసీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం తర్వాత ఈ నెల 25న విహారికి ఈ మెయిల్‌ ద్వారా నోటీసు పంపించారు. దీనిపై ఇంకా విహారి స్పందించలేదని ఏసీఏ వర్గాలు చెప్పాయి. ‘‘అవును.. విహారికి షోకాజ్‌ నోటీసు పంపించాం. అతని సమాధానం కోసం ఎదురు చూస్తున్నాం. గత నెలలో అతను ఎందుకు అలా స్పందించాడో తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఫిర్యాదుల గురించి చెప్పేందుకు అతనికి ఇదో అవకాశం. దేశవాళీ క్రికెట్లో ఆంధ్ర జట్టు వృద్ధిలో ప్రధాన పాత్ర పోషించిన విహారి విలువ మాకు తెలుసు’’ అని ఓ ఏసీఏ ప్రతినిధి తెలిపాడు. కానీ ఆ నోటీసుకు బదులిచ్చానని విహారి పేర్కొన్నాడు. తన పట్ల అన్యాయంగా వ్యవహరించారని, రాబోయే దేశవాళీ సీజన్‌లో ఇతర రాష్ట్ర జట్టుకు ఆడేందుకు నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) అడిగానని అతను వెల్లడించాడు. ఏసీఏ స్పందన కోసం ఎదురు చూస్తున్నానని చెప్పాడు. గత నెల 26న మధ్యప్రదేశ్‌తో క్వార్టర్స్‌లో ఆంధ్ర ఓటమి అనంతరం.. రాజకీయ నాయకుల జోక్యంతో తనను జట్టు కెప్టెన్‌గా తప్పించారని, మరోసారి ఆంధ్రకు ఆడనని విహారి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. జట్టులో 17వ ఆటగాడి (కేఎన్‌ పృథ్వీ రాజ్‌)పై అరవడంతో, రాజకీయ నాయకుడైన అతని తండ్రి ఏసీఏపై ఒత్తిడి తెచ్చి తనపై వేటు వేయించాడని విహారి ఆరోపించాడు. తనకు మద్దతుగా జట్టు ఆటగాళ్లు సంతకాలు చేసిన లేఖనూ పోస్టు చేశాడు. గత రంజీ సీజన్‌లో ఆంధ్ర తొలి మ్యాచ్‌ తర్వాత విహారిని కెప్టెన్‌గా తొలగించిన విషయం విదితమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని