క్వార్టర్స్‌లో సింధు

మాడ్రిడ్‌ స్పెయిన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది.

Published : 29 Mar 2024 02:46 IST

మాడ్రిడ్‌: మాడ్రిడ్‌ స్పెయిన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. ఈ భారత స్టార్‌ షట్లర్‌ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. గురువారం మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సింధు 21-14, 21-12 తేడాతో హువాంగ్‌ యు సన్‌ (చైనీస్‌ తైపీ)ను చిత్తుచేసింది. మ్యాచ్‌ సాంతం ఆధిపత్యం ప్రదర్శించిన రెండో సీడ్‌ సింధు.. 36 నిమిషాల్లోనే వరుస గేమ్‌ల్లో ప్రత్యర్థిని మట్టికరిపించింది. తొలి గేమ్‌లో ఒక దశలో అనవసర తప్పిదాలతో సింధు కాస్త వెనుకబడింది. అయితే 12 పాయింట్ల దగ్గర ప్రత్యర్థిని అందుకున్న ఆమె.. ఇక ఆ తర్వాత స్మాష్‌లతో అదరగొట్టింది. వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచింది. అదే ఊపులో తొలి గేమ్‌ దక్కించుకుంది. రెండో గేమ్‌లో సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి.. అలవోకగా ప్రత్యర్థిని ఓడించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్‌ కిదాంబి శ్రీకాంత్‌ కథ ముగిసింది. అతను 18-21, 15-21తో క్వాలిఫయర్‌ తకహశి (జపాన్‌) చేతిలో కంగుతిన్నాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సుమీత్‌రెడ్డి-సిక్కిరెడ్డి జంట క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది. సుమీత్‌-సిక్కి ద్వయం 22-20, 21-18తో ప్రెస్లీ స్మిత్‌-అలిసన్‌ లీ (అమెరికా) జంటపై నెగ్గింది. పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో అర్జున్‌-ధ్రువ్‌ కపిల జోడీ 21-17, 21-19తో క్రిస్టఫర్‌ గ్రిమ్లీ-మాథ్యూ గ్రిమ్లీ (స్కాట్లాండ్‌) జంటపై గెలవగా.. కృష్ణప్రసాద్‌-సాయిప్రతీక్‌ 16-21, 21-15, 16-21తో టోమా-క్రిస్టో (ఫ్రాన్స్‌) చేతిలో తలొంచారు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో 21-14, 21-8తో టిఫానీ-గ్రోన్యా (ఆస్ట్రేలియా)పై నెగ్గి క్వార్టర్స్‌ చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని