పరాగ్‌ ఫటాఫట్‌

ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్‌ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్‌ అయ్యేసరికి రాయల్స్‌దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్‌ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్‌ దూకుడు!

Updated : 29 Mar 2024 07:23 IST

దిల్లీకి మళ్లీ తప్పని ఓటమి
ఆఖరి ఓవర్లో అవేష్‌ అదుర్స్‌
రాజస్థాన్‌కు వరుసగా రెండో విజయం

ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్‌ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్‌ అయ్యేసరికి రాయల్స్‌దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్‌ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్‌ దూకుడు! ఇక మ్యాచ్‌ రాజస్థాన్‌దే అనుకుంటుండగా.. మళ్లీ రేసులోకొచ్చింది దిల్లీ. చివరి ఓవర్లో 17 పరుగులు చేస్తే ఆ జట్టుదే విజయం. అంతకుముందు ఓవర్ల జోరు చూసి డీసీనే మ్యాచ్‌ గెలిచేస్తుందనుకుంటే.. అవేష్‌ ఖాన్‌ ఆఖరి ఓవర్లో మరోసారి అద్భుతంగా బౌలింగ్‌ చేసి రాజస్థాన్‌ను గెలిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రియల్‌ హీరో మాత్రం మొదట సంచలన ఇన్నింగ్స్‌ ఆడిన రియాన్‌ పరాగే. రాయల్స్‌ రెండో విజయం సాధించగా.. దిల్లీ మళ్లీ ఓడింది.

జైపుర్‌

పీఎల్‌-17లో రాజస్థాన్‌ రాయల్స్‌ జోరు కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్‌లో లఖ్‌నవూపై విజయం సాధించిన ఆ జట్టు.. గురువారం ఉత్కంఠ పోరులో దిల్లీ క్యాపిటల్స్‌ను 12 పరుగుల తేడాతో ఓడించింది. మొదట రియాన్‌ పరాగ్‌ (84 నాటౌట్‌; 45 బంతుల్లో 7×4 6×6) మెరుపులతో రాయల్స్‌ 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. దిల్లీ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ (1/24), అక్షర్‌ పటేల్‌ (1/21) ఆకట్టుకున్నారు. ఛేదనలో డేవిడ్‌ వార్నర్‌ (49; 34 బంతుల్లో 5×4, 3×6), ట్రిస్టియన్‌ స్టబ్స్‌ (44 నాటౌట్‌; 23 బంతుల్లో 2×4, 3×6) పోరాడినా దిల్లీని గెలిపించలేకపోయారు. ఆ జట్టు 173/5కు పరిమితమైంది. బర్గర్‌ (2/29), చాహల్‌ (2/19) డీసీకి బ్రేకులేశారు.

స్టబ్స్‌ ఆశలు రేపినా..: భారీ ఛేదనలో దిల్లీకి ఎలాంటి ఆరంభం కావాలో అలాంటిదే అందించారు మిచెల్‌ మార్ష్‌ (23; 12 బంతుల్లో 5×4), వార్నర్‌. మార్ష్‌ బౌండరీల మోత మోగించడంతో 3 ఓవర్లకు డీసీ 29/0తో నిలిచింది. కానీ ఈ ఆనందాన్ని ఆవిరి చేస్తూ బర్గర్‌.. మార్ష్‌ను బౌల్డ్‌ చేశాడు. తర్వాతి బంతికే రికీ భుయ్‌ (0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అయితే సమీక్షలో బయటపడ్డ భుయ్‌.. ఆ తర్వాతి బంతికే క్యాచౌట్‌తో వెనుదిరిగాడు. ఈ స్థితిలో పంత్‌ అండతో వార్నర్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. మార్ష్‌ బాధ్యతను తాను తీసుకుని వార్నర్‌ షాట్లు ఆడుతుంటే.. కుదురుకున్నాక పంత్‌ (28) సైతం బ్యాట్‌ ఝళిపించాడు. 11 ఓవర్లకు 93/2తో డీసీ పటిష్ట స్థితికి చేరుకుంది. ఈ దశలో వార్నర్‌ను అవేష్‌, పంత్‌ను చాహల్‌ ఔట్‌ చేయడంతో దిల్లీకి కష్టాలు తప్పలేదు. పొదుపుగా బౌలింగ్‌ చేసిన చాహల్‌.. ఇంపాక్ట్‌ ప్లేయర్‌  అభిషేక్‌ పోరెల్‌ (9)ను కూడా ఎక్కువసేపు నిలవనీయలేదు. 16 ఓవర్లకు స్కోరు 126/5. చివరి 4 ఓవర్లలో 60 పరుగులంటే దిల్లీ ఓటమి ఖాయమే అనిపించింది. కానీ ఐపీఎల్‌లో ఇప్పటిదాకా పెద్దగా రాణించని దక్షిణాఫ్రికా కుర్రాడు స్టబ్స్‌ అనూహ్యంగా చెలరేగాడు. అశ్విన్‌ వేసిన 17వ ఓవర్‌ చివరి రెండు బంతులకు సిక్సర్లు బాదిన స్టబ్స్‌.. ఆ తర్వాత కూడా భారీ షాట్లు ఆడడంతో చివరి ఓవర్లో డీసీ 17 పరుగులు చేయాల్సిన స్థితికి చేరుకుంది. అయితే గత మ్యాచ్‌లో లఖ్‌నవూకు చివరి ఓవర్లో 27 పరుగులు అవసరమైతే 11 పరుగులే ఇచ్చిన అవేష్‌.. ఈ మ్యాచ్‌లో మరింత కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి ఆఖరి ఓవర్లో 4 పరుగులే ఇచ్చాడు. అతను స్టబ్స్‌, అక్షర్‌ (15 నాటౌట్‌)లకు షాట్లు ఆడే అవకాశమే ఇవ్వలేదు.

ఆ ఒక్కడు మార్చేశాడు..: ఈ మ్యాచ్‌ను రాజస్థాన్‌ ఆరంభించిన తీరు చూస్తే.. దిల్లీ ముందు 186 పరుగుల లక్ష్యం నిలుస్తుందని ఎవ్వరూ అనుకుని ఉండరు. తొలి పది ఓవర్లలో ఆ జట్టు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. దిల్లీ పేసర్లు ముకేశ్‌కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌.. స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌.. రాయల్స్‌ బ్యాటర్లను కట్టిపడేశారు. ఇటు పరుగులూ రాక, అటు వికెట్లూ నిలవక రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో సగ భాగం తీవ్రంగా ఇబ్బంది పడింది. దూకుడుకు మారుపేరైన యశస్వి (5), బట్లర్‌ (11) బ్యాట్లు ఝళిపించలేకపోయారు. యశస్విని ముకేశ్‌ బౌల్డ్‌ చేస్తే.. బట్లర్‌ను కుల్‌దీప్‌ వికెట్ల ముందు బలిగొన్నాడు. సంజు శాంసన్‌ (15) రెండు షాట్లు ఆడి.. ఖలీల్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ జట్టు 50కి చేరుకోవడానికి 9.3 ఓవర్లు పట్టాయి. అయితే మూడో వికెట్‌ పడ్డాక హెట్‌మయర్‌ను కాదని అశ్విన్‌ను బ్యాటింగ్‌కు పంపగా.. అతను పరాగ్‌తో కలిసి ఇన్నింగ్స్‌కు మళ్లీ ఊపు తెచ్చాడు. అశ్విన్‌ బాదిన మూడు సిక్సర్లు మ్యాచ్‌లో హైలైట్‌. అయితే అశ్విన్‌ (29; 19 బంతుల్లో 3×6) ఆట ఇన్నింగ్స్‌ను కుదుటపరిస్తే.. మలుపు తిప్పింది మాత్రం రియాన్‌ పరాగే. నాలుగో స్థానంలో దిగి ఆరంభంలో కొంత ఆచితూచి ఆడిన అతను.. తర్వాత రెచ్చిపోయాడు. గత సీజన్లలో మాదిరి ఒకట్రెండు షాట్లు ఆడి ఔటైపోకుండా ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే పరాగ్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అతను ఇంకా రెచ్చిపోయాడు. మైదానం నలుమూలలా భారీ షాట్లు ఆడి రాయల్స్‌కు ఊహించని స్కోరునందించాడు. ఖలీల్‌ వేసిన 15వ ఓవర్లో వరుసగా 6, 4, 4 కొట్టిన రియాన్‌.. చివరి ఓవర్లో (నోకియా) 4, 4, 6, 4, 4 బాదేశాడు. అశ్విన్‌ ఔటయ్యాక జురెల్‌ (20), హెట్‌మెయర్‌ (14 నాటౌట్‌)ల నుంచి అతడికి సహకారం లభించింది.

రాజస్థాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (బి) ముకేశ్‌ 5; బట్లర్‌ ఎల్బీ (బి) కుల్‌దీప్‌ 11; శాంసన్‌ (సి) పంత్‌ (బి) ఖలీల్‌ 15; పరాగ్‌ నాటౌట్‌ 84; అశ్విన్‌ (సి) స్టబ్స్‌ (బి) అక్షర్‌ 29; జురెల్‌ (బి) నోకియా 20; హెట్‌మయర్‌ నాటౌట్‌ 14; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 185; వికెట్ల పతనం: 1-9, 2-30, 3-36, 4-90, 5-142; బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 4-0-24-1; ముకేశ్‌ కుమార్‌ 4-0-49-1; నోకియా 4-0-48-1; అక్షర్‌ పటేల్‌ 4-0-21-1; కుల్‌దీప్‌ యాదవ్‌ 4-0-41-1

దిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) సందీప్‌శర్మ (బి) అవేష్‌ 49; మిచెల్‌ మార్ష్‌ (బి) బర్గర్‌ 23; రికీభుయ్‌ (సి) శాంసన్‌ (బి) బర్గర్‌ 0; రిషబ్‌ పంత్‌ (సి) శాంసన్‌ (బి) చాహల్‌ 28; స్టబ్స్‌ నాటౌట్‌ 44; అభిషేక్‌ పొరెల్‌ (సి) బట్లర్‌ (బి) చాహల్‌ 9; అక్షర్‌ పటేల్‌ నాటౌట్‌ 15; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 173; వికెట్ల పతనం: 1-30, 2-30, 3-97, 4-105, 5-122; బౌలింగ్‌: బౌల్ట్‌ 3-0-29-0; బర్గర్‌ 3-0-29-2; అశ్విన్‌ 3-0-30-0; అవేష్‌ ఖాన్‌ 4-0-29-1; చాహల్‌ 3-0-19-2; సందీప్‌శర్మ 4-0-36-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని