పంత్‌ త్వరలోనే ప్రత్యేకంగా..

మధ్య ఓవర్లలో రిషబ్‌ పంత్‌ ఎలా ఆడతాడన్న దానిపై దిల్లీ క్యాపిటల్స్‌ ప్రదర్శన ఆధారపడిందని ఆ జట్టు బౌలింగ్‌ కోచ్‌ జేమ్స్‌ హోప్స్‌ పేర్కొన్నాడు.

Published : 30 Mar 2024 02:24 IST

దిల్లీ బౌలింగ్‌ కోచ్‌

జైపుర్‌: మధ్య ఓవర్లలో రిషబ్‌ పంత్‌ ఎలా ఆడతాడన్న దానిపై దిల్లీ క్యాపిటల్స్‌ ప్రదర్శన ఆధారపడిందని ఆ జట్టు బౌలింగ్‌ కోచ్‌ జేమ్స్‌ హోప్స్‌ పేర్కొన్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్‌ ఆడుతున్న పంత్‌ నుంచి ప్రత్యేకమైన ప్రదర్శనలను చూడబోతున్నామనే ఆశాభావం వ్యక్తం చేశాడు. 2022 డిసెంబర్‌ చివర్లో రోడ్డు ప్రమాదం కారణంగా ఆటకు దూరంగా ఉన్న పంత్‌.. ఈ ఐపీఎల్‌తోనే పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. తన కెప్టెన్సీలో దిల్లీ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. గురువారం రాజస్థాన్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌, బ్యాటింగ్‌లోనూ ద్వితీయార్థంలో విఫలమై ఓటమి పాలైంది. ‘‘ఇన్నింగ్స్‌ చివర్లో ఆటను చక్కదిద్దుకోవాలి. అలాగే మధ్య ఓవర్లలో బ్యాటింగ్‌పైనా దృష్టి పెట్టాలి. ఆ దశలో క్రీజులో నిలబడాలి. ఈ సమస్యకు పరిష్కారం రిషబ్‌ పంత్‌ అని తెలుసు. సుదీర్ఘ విరామం తర్వాత అతను రెండు మ్యాచ్‌లాడాడు. రాబోయే కొన్ని వారాల్లో అతని నుంచి ప్రత్యేకమైన ప్రదర్శనలు చూస్తారనే ఆశిస్తున్నా’’ అని హోప్స్‌ చెప్పాడు. మరోవైపు గాయంతో ఆరు నెలలు విరామం తీసుకున్న పేసర్‌ నోకియా కూడా క్రమంగా పుంజుకుంటాడని హోప్స్‌ ధీమా వ్యక్తం చేశాడు. గత సెప్టెంబర్‌ నుంచి ఆటకు దూరంగా ఉన్న నోకియా.. ఈ ఐపీఎల్‌కు ముందు దేశవాళీల్లో మూడు టీ20లు మాత్రమే ఆడాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో పరాగ్‌ ధాటికి 4 ఓవర్లలో 48 పరుగులు సమర్పించుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని