ఫైనల్లో బోపన్న జోడీ

వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని ఆటతీరుతో అదరగొడుతున్న భారత వెటరన్‌ టెన్నిస్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న మరో డబుల్స్‌ టైటిల్‌కు చేరువయ్యాడు.

Published : 30 Mar 2024 02:24 IST

మియామి ఓపెన్‌

మియామి: వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని ఆటతీరుతో అదరగొడుతున్న భారత వెటరన్‌ టెన్నిస్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న మరో డబుల్స్‌ టైటిల్‌కు చేరువయ్యాడు. ఈ ఏడాది మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా)తో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్‌లో విజేతగా నిలిచిన బోపన్న.. ఇప్పుడు మియామి ఓపెన్‌ ఫైనల్‌ చేరాడు. పురుషుల డబుల్స్‌ సెమీస్‌లో టాప్‌ సీడ్‌ బోపన్న- ఎబ్డెన్‌ జంట 6-1, 6-4 తేడాతో నాలుగో సీడ్‌ మార్సెల్‌ (స్పెయిన్‌)- హొరాసియో (అర్జెంటీనా)పై గెలిచింది. మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన బోపన్న ద్వయం వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తుచేసింది. ఎబ్డెన్‌ సర్వీస్‌లతో హడలెత్తిస్తే.. బోపన్న రిటర్న్‌లతో మెరిశాడు. బోపన్న కూడా బలమైన సర్వీస్‌లతో ఆకట్టుకున్నాడు. తొలి సెట్‌లో కేవలం ఒకే గేమ్‌ కోల్పోయిన బోపన్న జోడీకి.. రెండో సెట్లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. కానీ తడబడకుండా సాగిన ఈ జంట విజయకేతనం ఎగురవేసింది. ఫైనల్లో డోడిగ్‌ (క్రొయేషియా)- ఆస్టిన్‌ (అమెరికా)తో బోపన్న జంట తలపడనుంది. ఏటీపీ మాస్టర్స్‌ 1000 టోర్నీలో తుదిపోరు చేరడం 44 ఏళ్ల బోపన్నకు ఇది 14వ సారి. మియామి ఓపెన్‌లో మాత్రం ఇదే తొలిసారి. దీంతో లియాండర్‌ పేస్‌ తర్వాత అన్ని (9) ఏటీపీ మాస్టర్స్‌ టోర్నీల్లోనూ ఫైనల్‌ చేరిన రెండో భారత ఆటగాడిగా బోపన్న నిలిచాడు. బోపన్న ఇప్పటివరకూ 25 డబుల్స్‌ టైటిళ్లు గెలిచాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని