పోరాడి ఓడిన సింధు

మాడ్రిడ్‌ స్పెయిన్‌ మాస్టర్స్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో శుక్రవారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో దంపతులు సిక్కిరెడ్డి- సుమీత్‌ రెడ్డి సెమీస్‌ చేరారు.

Published : 30 Mar 2024 02:26 IST

సెమీస్‌లో సిక్కి జోడీ

మాడ్రిడ్‌: మాడ్రిడ్‌ స్పెయిన్‌ మాస్టర్స్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో శుక్రవారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో దంపతులు సిక్కిరెడ్డి- సుమీత్‌ రెడ్డి సెమీస్‌ చేరారు. మహిళల సింగిల్స్‌లో స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఓడిపోయింది. రెండో సీడ్‌ సింధు క్వార్టర్స్‌లో 26-24, 17-21, 20-22 తేడాతో ఆరో సీడ్‌ సుపనిద (థాయ్‌లాండ్‌) చేతిలో పోరాడి ఓడింది. తొలి గేమ్‌లో 4-8తో వెనుకబడ్డ దశ నుంచి అద్భుత పోరాటంతో పుంజుకున్న సింధు హోరాహోరీ పోరులో పైచేయి సాధించింది. ప్రత్యర్థి నుంచి ఆమెకు కఠిన సవాలు ఎదురైంది. ఎవరూ తగ్గకపోవడంతో స్కోరు 24-24తో సమమైంది. ఆ దశలో వరుసగా రెండు పాయింట్లతో సింధు నెగ్గింది. కానీ రెండో గేమ్‌లో అనవసర తప్పిదాలతో ఆమె ఓడిపోయింది. మూడో గేమ్‌లో 10-5తో ఆధిక్యంలో నిలిచినప్పటికీ సింధు అవకాశాన్ని చేజార్చుకుంది. చివరి వరకూ ప్రయత్నించినా.. ఆఖర్లో తప్పిదాలతో ఓటమి మూటగట్టుకుంది. మరోవైపు మిక్స్‌డ్‌ డబుల్స్‌లో క్వార్టర్స్‌లో సిక్కి- సుమీత్‌ జోడీ 14-21, 21-11, 21-17 తేడాతో నాలుగో సీడ్‌ లీసా- రెహాన్‌ (ఇండోనేసియా)పై విజయం సాధించింది. తొలి గేమ్‌లో ఓడినప్పటికీ సిక్కి ద్వయం గొప్పగా పుంజుకుంది. రెండో గేమ్‌ నుంచి అత్యుత్తమ ఆటతీరుతో సాగింది. స్మాష్‌లు, ర్యాలీలతో ఆకట్టుకుంది. 3-2తో ఆధిక్యంలో నిలిచిన తర్వాత ఎక్కడా తగ్గలేదు. ఆధిపత్యం కొనసాగించి గేమ్‌ దక్కించుకుంది. మూడో గేమ్‌లో ఓ దశలో 5-10తో వెనకబడ్డప్పటికీ సిక్కి జోడీ పట్టు వదల్లేదు. 13-13తో ప్రత్యర్థిని అందుకున్న ఈ జంట అదే ఊపులో గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. మహిళల డబుల్స్‌లో మూడో సీడ్‌ తనీష- అశ్విని జంట 13-21, 19-21తో ఆరో సీడ్‌ లీ చియా- తెంగ్‌ చున్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని