హార్దిక్‌.. అవి పట్టించుకోవద్దు!

రోహిత్‌ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా నియమితుడైన హార్దిక్‌ పాండ్యకు ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం వెళ్లిన ప్రతి వేదికలోనూ ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత తప్పట్లేదు.

Published : 30 Mar 2024 02:28 IST

దిల్లీ: రోహిత్‌ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా నియమితుడైన హార్దిక్‌ పాండ్యకు ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం వెళ్లిన ప్రతి వేదికలోనూ ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత తప్పట్లేదు. అతణ్ని చూసి తరచుగా హేళనగా అరుస్తున్నారు. అహ్మదాబాద్‌, హైదరాబాద్‌లో ఎదురైన ఈ అనుభవం రేప్పొద్దున ముంబయిలోనూ తప్పకపోవచ్చు. అయితే హార్దిక్‌ ఇలాంటివి అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నాడు ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌. ఐపీఎల్‌ మ్యాచ్‌లకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న స్మిత్‌ ఈ విషయమై మాట్లాడుతూ.. ‘‘నేను ఒకటే చెబుతాను. వాటిని విస్మరించమని. అదసలు పట్టించుకోవాల్సిన విషయమే కాదు. బయటి వ్యక్తులకు లోపల ఏం జరుగుతోందో తెలియదు. డ్రెసింగ్‌ రూంలో వాళ్లెవ్వరూ ఉండరు’’ అని చెప్పాడు. 2018 నాటి బాల్‌ టాంపరింగ్‌ ఉదంతం తర్వాత స్మిత్‌ పునరాగమనం చేసినపుడు అతను మోసగాడంటూ వివిధ స్టేడియాల్లో అభిమానులు ఎగతాళి చేశారు. తాను వారి మాటల్ని అస్సలు పట్టించుకోలేదని స్మిత్‌ తెలిపాడు. ‘‘వ్యక్తిగతంగా నన్ను అవి ఇబ్బంది పెట్టవు. నేను తేలిగ్గా తీసుకుంటాను. అయితే ఇలాంటి వాటికి ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారు. ఏమో.. హార్దిక్‌ మీద ఇవి కొంత ప్రభావం చూపిస్తుండొచ్చు. ఎందుకంటే ఇలాంటిది ముందెన్నడూ అతడికి ఎప్పుడూ జరగలేదు కదా’’ అని స్మిత్‌ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని