పరాగ్‌ పట్టుదలతో

ఆ యువ ఆటగాడు మైదానంలో కనిపిస్తే చాలు ఎగతాళి.. అంచనాలు అందుకోవడం లేదంటూ విమర్శలు.. నిలకడ లేదనే వ్యాఖ్యలు.. అంతర్జాలంలో దూషణలు.. ఇలా ఎంతో వ్యతిరేకత! కానీ ఆ కుర్రాడు కుంగిపోలేదు. పట్టుదలతో సాగుతున్నాడు.

Published : 30 Mar 2024 02:28 IST

దిల్లీ: ఆ యువ ఆటగాడు మైదానంలో కనిపిస్తే చాలు ఎగతాళి.. అంచనాలు అందుకోవడం లేదంటూ విమర్శలు.. నిలకడ లేదనే వ్యాఖ్యలు.. అంతర్జాలంలో దూషణలు.. ఇలా ఎంతో వ్యతిరేకత! కానీ ఆ కుర్రాడు కుంగిపోలేదు. పట్టుదలతో సాగుతున్నాడు. కసితో సత్తాచాటుతున్నాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సరికొత్తగా అదరగొడుతున్నాడు. అతనే.. రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు రియాన్‌ పరాగ్‌. ఈ సీజన్‌లో జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ కీలక ఇన్నింగ్స్‌లతో విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడీ 22 ఏళ్ల అస్సాం కుర్రాడు. లఖ్‌నవూపై 29 బంతుల్లో 43 పరుగులు, దిల్లీపై 45 బంతుల్లో 84 పరుగులు చేశాడు. ముఖ్యంగా దిల్లీతో మ్యాచ్‌లో 36/3తో కష్టాల్లో ఉన్న జట్టును అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. ఈ సీజన్లో అతను నాలుగో స్థానంలో వచ్చి రాణిస్తున్నాడు. 2019 నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్నా పేలవ ప్రదర్శన చేస్తున్నాడని పరాగ్‌పై విమర్శలు వచ్చాయి. అతని కోసం రాజస్థాన్‌ రూ.3.80 కోట్లు చెల్లించడం అనవసరమని సామాజిక మాధ్యమాల్లో ఎగతాళి చేశారు. ‘‘అభిమానులు నిన్ను ఎందుకు ఎగతాళి చేస్తున్నారో తెలుసా?’’ అని సీజన్‌కు ముందు తండ్రి పరాగ్‌ దాస్‌ అడిగిన ప్రశ్నకు.. ‘‘నాపై అంచనాలున్నాయి. నేను విజయవంతం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. పరుగులు చేయడం మొదలెడితే ఇకపై నా పేరే వినిపిస్తుంది’’ అని రియాన్‌ సమాధానమిచ్చాడు. ఇప్పుడు అతనదే చేస్తున్నాడు. ‘‘నేనెంతగానో చేసిన ప్రాక్టీస్‌కు ఫలితమిది. నేను కాస్త భావోద్వేగానికి గురవుతా. నా కష్టానికి ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నా. భావోద్వేగాలను నియంత్రించుకుంటున్నా. నా ఇబ్బందులను చూసిన అమ్మ అండగా నిలుస్తోంది. ఏదేమైనా నాపై నాకున్న అభిప్రాయం మారదు. నా ప్రదర్శన ఎలా ఉన్నా నాకు నేను మద్దతుగానే ఉంటా’’ అని రియాన్‌ తెలిపాడు. సామాజిక మాధ్యమాల్లో రియాన్‌ను ఇష్టమొచ్చినట్లు ఎగతాళి చేయడం, విమర్శించడం, దూషించడం చాలా దారుణమని తండ్రి పరాగ్‌ చెప్పాడు. వాటన్నింటినీ అతను దాటాడని పేర్కొన్నాడు. మరోవైపు దేశవాళీల్లో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ, దేవధర్‌ ట్రోఫీ, రంజీల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అదరగొట్టిన రియాన్‌కు రాజస్థాన్‌ కూడా మద్దతుగా నిలిచింది. ఈ సీజన్‌లో అతణ్ని బ్యాటింగ్‌ ఆర్డర్లో పైకి తీసుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని