ఆర్సీబీ.. ఉఫ్‌

సన్‌రైజర్స్‌పై ఆండ్రి రసెల్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌ చూశాక.. తర్వాతి మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు బాగా సహకరించే చిన్నస్వామి స్టేడియంలో, బలహీనంగా కనిపిస్తున్న ఆర్సీబీ బౌలింగ్‌ను అతనెలా ఉతికారేస్తాడో అని ఆర్సీబీ అభిమానులు కంగారు పడ్డారు! కానీ శుక్రవారం రసెల్‌ బ్యాటందుకోవాల్సిన అవసరమే పడలేదు.

Updated : 30 Mar 2024 06:49 IST

బెంగళూరును చిత్తు చేసిన కోల్‌కతా
183 లక్ష్యం.. 16.5 ఓవర్లకే ఖతం  
మెరిసిన నరైన్‌, వెంకటేశ్‌
కోహ్లి పోరాటం వృథా
బెంగళూరు

సన్‌రైజర్స్‌పై ఆండ్రి రసెల్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌ చూశాక.. తర్వాతి మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు బాగా సహకరించే చిన్నస్వామి స్టేడియంలో, బలహీనంగా కనిపిస్తున్న ఆర్సీబీ బౌలింగ్‌ను అతనెలా ఉతికారేస్తాడో అని ఆర్సీబీ అభిమానులు కంగారు పడ్డారు! కానీ శుక్రవారం రసెల్‌ బ్యాటందుకోవాల్సిన అవసరమే పడలేదు. 183 పరుగుల పెద్ద లక్ష్యమే అయినా.. రసెల్‌ దిగాల్సిన అవసరమే లేకుండా పని పూర్తి చేశారు మిగతా కోల్‌కతా బ్యాటర్లు. ముఖ్యంగా బౌలరైన సునీల్‌ నరైన్‌.. ఆర్సీబీ బౌలర్లను ఆటాడుకున్న తీరు మ్యాచ్‌లో హైలైట్‌. మొదట విరాట్‌ కోహ్లి ఎంతో కష్టపడి జట్టుకు మెరుగైన స్కోరు అందించినా.. పేలవ బౌలింగ్‌ పుణ్యమా అని బెంగళూరు ఘోర పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది.

పీఎల్‌-17లో బెంగళూరు గెలుపు సంబరం ఒక్క మ్యాచ్‌కు పరిమితమైంది. గత మ్యాచ్‌లో పంజాబ్‌ను కష్టపడి ఓడించిన ఆ జట్టు.. శుక్రవారం కోల్‌కతా చేతిలో చిత్తుగా ఓడింది. ఆ జట్టు నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని 16.5 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది నైట్‌రైడర్స్‌. ఓపెనర్‌గా వచ్చిన స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ (47; 22 బంతుల్లో 2×4, 5×6) ఉన్నంతసేపూ సిక్సర్ల మోత మోగించి ముందే మ్యాచ్‌ ఫలితాన్ని తేల్చేశాడు. వెంకటేశ్‌ అయ్యర్‌ (50; 30 బంతుల్లో 3×4, 4×6) కూడా చెలరేగాడు. మొదట ఆర్సీబీ 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. కోహ్లి (83 నాటౌట్‌; 59 బంతుల్లో 4×4, 4×6) టాప్‌స్కోరర్‌. ఆండ్రి రసెల్‌ (2/29), హర్షిత్‌ రాణా (2/39) ఆ జట్టును దెబ్బ తీశారు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ కోల్‌కతా నెగ్గగా.. బెంగళూరు మూడు మ్యాచ్‌ల్లో రెండో పరాజయం చవిచూసింది.

ముందే తేలిపోయింది..: చాలా ఏళ్ల ముందు ఒకట్రెండు సీజన్లలో ఓపెనర్‌గా మెరిశాడు సునీల్‌ నరైన్‌. ఆ తర్వాత మళ్లీ ఈ సీజన్లో అతను ఓపెనర్‌ పాత్ర పోషిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో విఫలమైన అతను.. ఈసారి మాత్రం రెచ్చిపోయాడు. బెంగళూరు ప్రధాన పేసర్లు అల్జారి జోసెఫ్‌, సిరాజ్‌లతో పాటు యశ్‌ దయాళ్‌కూ అతను చుక్కలు చూపించడంతో లక్ష్యం వేగంగా కరిగిపోయింది. మరో ఓపెనర్‌ సాల్ట్‌ (30; 20 బంతుల్లో 2×4, 2×6) ధాటిగానే ఆడడంతో కోల్‌కతా 3.3 ఓవర్లకే 50కి చేరుకుంది. పవర్‌ప్లేలో స్కోరు 83/0. ఏడో ఓవర్లో మయాంక్‌ దాగర్‌ (1/23).. నరైన్‌ను బౌల్డ్‌ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మూడో స్థానంలో వచ్చిన వెంకటేశ్‌ అయ్యర్‌.. నరైన్‌ బాధ్యత తీసుకున్నాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అతను కొట్టిన ఓ షాట్‌కు బంతి స్టేడియం పైకప్పుపై పడింది. సాల్ట్‌ను ఇంపాక్ట్‌ ప్లేయర్‌ వైశాఖ్‌ (1/23) ఔట్‌ చేసినా.. శ్రేయస్‌ అయ్యర్‌ (39 నాటౌట్‌; 24 బంతుల్లో 2×4, 2×6) అండతో వెంకటేశ్‌ దూకుడు కొనసాగించడంతో కోల్‌కతాకు ఎలాంటి ఇబ్బంది లేకపోయింది. విజయానికి ఇంకో 16 పరుగులే అవసరమైన స్థితిలో వెంకటేశ్‌ ఔటైనా.. రింకు (5 నాటౌట్‌)తో కలిసి శ్రేయస్‌ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

కోహ్లి ఒక్కడై..: అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు.. సొంతగడ్డపై తన సహజ శైలిలో ఆడలేకపోయింది. విరాట్‌ కోహ్లి ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచినా.. ఆశించినంత ధాటిగా మాత్రం ఆడలేకపోయాడు. కామెరూన్‌ గ్రీన్‌, మ్యాక్స్‌వెల్‌ మంచి ఊపు మీద కనిపించినా.. స్కోరు వేగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాల్సిన సమయంలో వెనుదిరగడం బెంగళూరుకు చేటు చేసింది. కోహ్లి చివరి వరకు క్రీజులో నిలిచి జట్టుకు మెరుగైన స్కోరునందించాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే డుప్లెసిస్‌ (8)ను ఔట్‌ చేసిన హర్షిత్‌ రాణా.. ఆర్సీబీని గట్టి దెబ్బ తీశాడు. తర్వాత గ్రీన్‌ (33; 21 బంతుల్లో 4×4, 2×6), మ్యాక్స్‌వెల్‌ (28; 19 బంతుల్లో 3×4, 1×6)లతో కోహ్లి భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టును మంచి స్థితికి చేర్చాడు. గ్రీన్‌ ఉన్నంతసేపు ధాటిగా ఆడగా.. రెండు జీవనదానాలు అందుకున్న మ్యాక్స్‌వెల్‌ తర్వాత చెలరేగేలా కనిపించాడు. 14 ఓవర్లకు స్కోరు 124/2. కోహ్లి, మ్యాక్స్‌వెల్‌ క్రీజులో ఉండడంతో ఆర్సీబీ.. 200 దాటుతుందనిపించింది. కానీ మ్యాక్సీ ఇచ్చిన మూడో క్యాచ్‌ను రింకు అందుకోవడంతో ఆర్సీబీకి గట్టి దెబ్బ తగిలింది. వైఫల్యాన్ని కొనసాగిస్తూ రజత్‌ పటీదార్‌ (3) మరోసారి స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. అనుజ్‌ రావత్‌ (3) సైతం ఎంతోసేపు నిలవలేదు. అయితే మరో ఎండ్‌లో కోహ్లి మాత్రం పోరాటం కొనసాగించాడు. చివర్లో దినేశ్‌ కార్తీక్‌ (20 నాటౌట్‌) కూడా కొన్ని షాట్లు ఆడడంతో స్కోరు 180 దాటింది.
బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి నాటౌట్‌ 83; డుప్లెసిస్‌ (సి) స్టార్క్‌ (బి) హర్షిత్‌ 8; గ్రీన్‌ (బి) రసెల్‌ 33; మ్యాక్స్‌వెల్‌ (సి) రింకు (బి) నరైన్‌ 28; పటీదార్‌ (సి) రింకు (బి) రసెల్‌ 3; అనుజ్‌ (సి) సాల్ట్‌ (బి) హర్షిత్‌ 3; దినేశ్‌ కార్తీక్‌ రనౌట్‌ 20; ఎక్స్‌ట్రాలు 4
మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 182
వికెట్ల పతనం: 1-17, 2-82, 3-124, 4-144, 5-151, 6-182
బౌలింగ్‌: స్టార్క్‌ 4-0-47-0; హర్షిత్‌ రాణా 4-0-39-2; అనుకుల్‌ రాయ్‌ 2-0-6-0; నరైన్‌ 4-0-40-1; రసెల్‌ 4-0-29-2; వరుణ్‌ చక్రవర్తి 2-0-20-0

కోల్‌కతా ఇన్నింగ్స్‌: ఫిల్‌ సాల్ట్‌ (సి) గ్రీన్‌ (బి) వైశాఖ్‌ 30; నరైన్‌ (బి) మయాంక్‌ 47; వెంకటేశ్‌ అయ్యర్‌ (సి) కోహ్లి (బి) యశ్‌ దయాల్‌ 50; శ్రేయస్‌ నాటౌట్‌ 39; రింకు సింగ్‌ నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 15;
మొత్తం: (16.5 ఓవర్లలో 3 వికెట్లకు) 186
వికెట్ల పతనం: 1-86, 2-92, 3-167
బౌలింగ్‌: సిరాజ్‌ 3-0-46-0; యశ్‌ దయాల్‌ 4-0-46-1; అల్జారి జోసెఫ్‌ 2-0-34-0; మయాంక్‌ దాగర్‌ 2.5-0-23-1; విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ 4-0-23-1; కామెరూన్‌ గ్రీన్‌ 1-0-7-0


25 కోట్ల వీరుడి సెంచరీ!

సారి ఐపీఎల్‌ వేలంలో ఏకంగా రూ.24.75 కోట్లు పలికిన బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌. ఈ సీజన్‌ ముందు వరకు రూ.18.5 కోట్లే అత్యధిక ధర. అలాంటిది ఒక్క ఆటగాడికి దాదాపు రూ.25 కోట్ల రేటంటే మాటలు కాదు. అయితే రేటు ఎక్కువ పలికే ఆటగాడు అందుకు న్యాయం చేయని ఆనవాయితీని కొనసాగిస్తూ.. స్టార్క్‌ సైతం ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. కోల్‌కతాకు ఆడుతున్న ఈ ఆస్ట్రేలియా పేసర్‌.. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్టూ తీయలేకపోయాడు. పైగా పరుగుల సమర్పణలో ఏకంగా సెంచరీ చేసేశాడు. సన్‌రైజర్స్‌తో తొలి మ్యాచ్‌లో 4 ఓవర్లలో ఏకంగా 53 పరుగులు ఇచ్చుకున్న స్టార్క్‌.. శుక్రవారం బెంగళూరుపై 4 ఓవర్లలో 47 పరుగులు సమర్పించుకున్నాడు.


‘‘పిచ్‌ రెండు రకాలుగా స్పందించింది. మొదట అది నెమ్మదిగా కనిపించింది. ఛేదనలో బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. మొదట బ్యాటింగ్‌ అంత తేలికగా అనిపించలేదు. విరాట్‌ సైతం ఇబ్బంది పడడం చూశాం. నరైన్‌, సాల్ట్‌ ధాటిగా ఆడి ఆరంభంలోనే మ్యాచ్‌ను మాకు దూరం చేశారు’’

డుప్లెసిస్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని