గిల్‌ వేగంగా నేర్చుకుంటున్నాడు

కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ వేగంగా ఎదుగుతున్నాడని గుజరాత్‌ టైటాన్స్‌ కోచ్‌ గ్యారీ కిర్‌స్టన్‌ అభిప్రాయపడ్డాడు. గత రెండు సీజన్లలో గుజరాత్‌ను నడిపించిన హార్దిక్‌ పాండ్య ముంబయికి వెళ్లిపోవడంతో గిల్‌ ఈ సీజన్‌కు సారథిగా బాధ్యతలు అందుకున్న సంగతి తెలిసిందే.

Published : 31 Mar 2024 02:11 IST

అహ్మదాబాద్‌: కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ వేగంగా ఎదుగుతున్నాడని గుజరాత్‌ టైటాన్స్‌ కోచ్‌ గ్యారీ కిర్‌స్టన్‌ అభిప్రాయపడ్డాడు. గత రెండు సీజన్లలో గుజరాత్‌ను నడిపించిన హార్దిక్‌ పాండ్య ముంబయికి వెళ్లిపోవడంతో గిల్‌ ఈ సీజన్‌కు సారథిగా బాధ్యతలు అందుకున్న సంగతి తెలిసిందే. ‘‘టీ20 క్రికెట్‌ వేగంగా సాగిపోయే ఫార్మాట్‌. వ్యూహాత్మక నిర్ణయాలు చకచకా తీసుకోవాలి. టెస్టుల్లో మాదిరి సుదీర్ఘ సమయం తర్వాత మలుపు తిరగదు. ఒక కెప్టెన్‌గా శుభ్‌మన్‌ వ్యవహరిస్తున్న తీరు నన్నెంతగానో ఆకట్టుకుంది. అతను సారథిగా వేగంగా రూపాంతరం చెందాడు. నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాడు’’ అని కిర్‌స్టన్‌ చెప్పాడు.


సిక్కి జోడీ కూడా..

మాడ్రిడ్‌: స్పెయిన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో సిక్కిరెడ్డి-సుమీత్‌రెడ్డి జోరుకు తెరపడింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీఫైనల్లో సిక్కీ ద్వయం 21-17, 21-12తో రినోవ్‌ రివాల్డీ-పిటా మెంటారి (ఇండోనేషియా) జంట చేతిలో ఓటమి చవిచూసింది. 29 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో తొలి గేమ్‌లో మాత్రమే సిక్కీ జంట ప్రత్యర్థి జోడీకి పోటీ ఇవ్వగలిగింది. ఈ ఓటమితో ఈ టోర్నమెంట్లో భారత్‌ కథ ముగిసింది.


విల్లీ స్థానంలో హెన్రీ

దిల్లీ: ఇంగ్లాండ్‌ పేస్‌ ఆల్‌రౌండర్‌ డేవిడ్‌ విల్లీ స్థానాన్ని న్యూజిలాండ్‌ ఫాస్ట్‌బౌలర్‌ మ్యాట్‌ హెన్రీతో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ భర్తీ చేసింది. 2022, 2023 సీజన్లలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఆడిన విల్లీని గత వేలంలో లఖ్‌నవూ దక్కించుకుంది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల అతను ఈ సీజన్‌కు దూరమవుతున్నట్లు ప్రకటించాడు. ఈ ఏడాది పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌, ఐఎల్‌టీ టీ20 లీగ్‌ల్లో ఆడిన విల్లీ అలసట వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో కనీస ధర రూ.1.25 కోట్లకు హెన్రీని లఖ్‌నవూ జట్టులో చేర్చుకుంది. హెన్రీ గతంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లకు ఆడాడు. ఐపీఎల్‌ ముగిశాక టీ20 ప్రపంచకప్‌ ఉండటంతో పనిభారం నిర్వహణలో భాగంగా మరో ఇంగ్లాండ్‌ పేసర్‌ మార్క్‌వుడ్‌ కూడా లఖ్‌నవూకు దూరమైన సంగతి తెలిసిందే. అతని స్థానంలో జట్టు విండీస్‌ పేసర్‌ షమార్‌ జోసెఫ్‌ను తీసుకుంది.


ప్రణీత్‌కు టైటిల్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఫాగర్‌నెస్‌  స్లో బ్లిట్జ్‌ 2024 చెస్‌ టోర్నీ గ్రూప్‌- ఎ విభాగంలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ప్రణీత్‌ ఉప్పల ఛాంపియన్‌గా నిలిచాడు. నార్వేలో జరిగిన ఈ పోటీల్లో ఏడు రౌండ్ల నుంచి 6 పాయింట్లు సాధించిన అతను అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అజేయంగా అతను ఈ పోటీలను ముగించాడు. టీమ్‌ చెస్‌లో ప్రణీత్‌, సిద్ధాంత్‌, దుష్యంత్‌, అమిత్‌ జట్టు రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని