బాబర్‌కు మళ్లీ పాక్‌ పగ్గాలు!

పాకిస్థాన్‌ స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజామ్‌ను పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా పీసీబీ తిరిగి నియమించనున్నట్లు సమాచారం. ఈ విషయంపై అతడింకా తుది నిర్ణయానికి రానట్లు తెలిసింది.

Published : 31 Mar 2024 02:13 IST

లాహోర్‌: పాకిస్థాన్‌ స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజామ్‌ను పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా పీసీబీ తిరిగి నియమించనున్నట్లు సమాచారం. ఈ విషయంపై అతడింకా తుది నిర్ణయానికి రానట్లు తెలిసింది. మూడు ఫార్మాట్లలో తనకు కెప్టెన్సీ ఇవ్వాలని బాబర్‌ షరతు విధించినట్లు దీనిపై సెలక్షన్‌ కమిటీలోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు పీసీబీ వర్గాలు చెబుతున్నాయి. 2023 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ పేలవ ప్రదర్శన తర్వాత బాబర్‌ అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా తప్పుకున్నాడు. ‘‘టీ20ల్లో షహీన్‌ షా అఫ్రిది కెప్టెన్సీపై సెలక్టర్లు సంతృప్తిగా లేరు. కానీ ఏప్రిల్‌లో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అతడి ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోవాలని కొందరు సెలక్టర్లు అంటున్నారు. లేదు బాబర్‌కే పగ్గాలు ఇవ్వాలని ఇంకొందరు వాదిస్తున్నారు’’ అని పీసీబీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి బాబర్‌ను పరిమిత ఓవర్ల కెప్టెన్సీని అంగీకరించేలా ఒప్పించాలని.. టీ20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత టెస్టు కెప్టెన్సీపై తుది నిర్ణయం తీసుకోవచ్చని చీఫ్‌ సెలక్టర్‌ నఖ్వి.. మిగిలిన సెలక్టర్లకు చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం పాక్‌ టెస్టు కెప్టెన్‌గా షాన్‌ మసూద్‌ వ్యవహరిస్తున్నాడు. విదేశీ కోచ్‌ను నియమించే విషయంపై కూడా త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కోచ్‌ పదవికి గ్యారీ కిర్‌స్టెన్‌, జాసన్‌ గిలెస్పీ పేర్లను పీసీబీ పరిశీలిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని