బోపన్న అదరహో

వయసు పెరుగుతున్నా కొద్దీ రోహన్‌ బోపన్నలోని ఆట పదునెక్కుతోంది. ఈ భారత టెన్నిస్‌ వెటరన్‌ స్టార్‌ను విజయాల ఆకలి కొత్త గమ్యాల వైపు నడిపిస్తోంది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచి, పురుషుల డబుల్స్‌లో గ్రాండ్‌స్లామ్‌ ఖాతా తెరిచిన బోపన్న..

Published : 01 Apr 2024 01:53 IST

మియామి ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్‌ సొంతం


మియామి

వయసు పెరుగుతున్నా కొద్దీ రోహన్‌ బోపన్నలోని ఆట పదునెక్కుతోంది. ఈ భారత టెన్నిస్‌ వెటరన్‌ స్టార్‌ను విజయాల ఆకలి కొత్త గమ్యాల వైపు నడిపిస్తోంది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచి, పురుషుల డబుల్స్‌లో గ్రాండ్‌స్లామ్‌ ఖాతా తెరిచిన బోపన్న.. ఇప్పుడు మియామి ఓపెన్‌ టైటిల్‌నూ సొంతం చేసుకున్నాడు. మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా)తో కలిసి అతను విజేతగా నిలిచాడు. పెద్ద వయసులో ఏటీపీ మాస్టర్స్‌ 1000 ఛాంపియన్‌గా నిలిచిన ఆటగాడిగా తన రికార్డు (నిరుడు ఇండియన్‌ వెల్స్‌ టైటిల్‌)ను 44 ఏళ్ల బోపన్న మెరుగుపరుచుకున్నాడు. ఈ విజయంతో ఏటీపీ డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో తిరిగి నంబర్‌వన్‌ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో టాప్‌సీడ్‌ బోపన్న- ఎబ్డెన్‌ జంట 6-7 (3-7), 6-3, 10-6 తేడాతో రెండో సీడ్‌ డోడిగ్‌ (క్రొయేషియా)- ఆస్టిన్‌ (అమెరికా)పై గెలిచింది. తొలి సెట్‌ను టైబ్రేకర్‌లో కోల్పోయిన తర్వాత బోపన్న జోడీ పుంజుకున్న వైనం అద్భుతం. ఆరంభంలో బోపన్న ద్వయం మెరుగ్గానే ఆడింది. 6-5తో సెట్‌ దక్కించుకునేలా కనిపించింది. కానీ ఆ దశలో అనవసర తప్పిదాలతో వెనుకబడింది. సెట్‌ పాయింట్‌ను గెలవలేకపోయింది. దీంతో ప్రత్యర్థి జోడీ సెట్‌ను టైబ్రేకర్‌కు మళ్లించి విజయం సాధించింది. కానీ రెండో సెట్లో బోపన్న జంట ఆగలేదు. నిర్ణయాత్మక టైబ్రేకర్‌లోనూ అదే జోరు కొనసాగించి టైటిల్‌ దక్కించుకుంది. ‘‘ఇదెంతో అద్భుతంగా ఉంది. ఇలాంటి పెద్ద టోర్నీల్లో రాణించడం కోసమే కదా మేం ఆడేది. మాస్టర్స్‌ 1000 టోర్నీలు, గ్రాండ్‌స్లామ్‌ల్లో ఉత్తమ ప్రదర్శన చేయాలనుకున్నా. రికార్డును కొనసాగిస్తుండటం బాగుంది’’ అని 26వ డబుల్స్‌ టైటిల్‌ గెలిచిన బోపన్న చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని