సన్‌రైజర్స్‌ను దించేశారు

గుజరాత్‌తో సన్‌రైజర్స్‌ మ్యాచ్‌. టాస్‌ హైదరాబాదే గెలిచింది. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు చేసిన ఊపులో సన్‌రైజర్స్‌. ఇంకేముంది.. గుజరాత్‌ బౌలర్లకు చుక్కలే అనుకున్నారంతా!

Published : 01 Apr 2024 02:02 IST

అదరగొట్టిన మోహిత్‌
రాణించిన మిల్లర్‌, సుదర్శన్‌
గుజరాత్‌ ఘన విజయం

గుజరాత్‌తో సన్‌రైజర్స్‌ మ్యాచ్‌. టాస్‌ హైదరాబాదే గెలిచింది. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు చేసిన ఊపులో సన్‌రైజర్స్‌. ఇంకేముంది.. గుజరాత్‌ బౌలర్లకు చుక్కలే అనుకున్నారంతా! అయినా వాళ్లు బెదరలేదు. చక్కని నియంత్రణతో బంతులు వేసి.. సరైన సమయంలో వికెట్లు తీసి.. సన్‌రైజర్స్‌ను కట్టిపడేశారు. ఆ తర్వాత ఆ జట్టు బ్యాటర్లు ప్రశాంతంగా ఆడి గుజరాత్‌కు రెండో విజయాన్ని అందించారు. మోహిత్‌శర్మ అదిరే బౌలింగ్‌కు.. మిల్లర్‌, సుదర్శన్‌ మెరుపులు తోడవడంతో టైటాన్స్‌ పెద్దగా కష్టపడకుండానే విజయాన్ని సొంతం చేసుకుంది.


అహ్మదాబాద్‌

ఐపీఎల్‌-17లో గుజరాత్‌ టైటాన్స్‌ ఖాతాలో రెండో విజయం. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన ఆ జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఆదివారం మొదట సన్‌రైజర్స్‌ 162/8కే పరిమితమైంది. అభిషేక్‌శర్మ (29; 20 బంతుల్లో 2×4, 2×6), అబ్దుల్‌ సమద్‌ (29; 14 బంతుల్లో 3×4, 1×6) మాత్రమే పర్వాలేదనిపించారు. మోహిత్‌శర్మ (3/25) ప్రత్యర్థికి కళ్లెం వేశాడు. లక్ష్యాన్ని గుజరాత్‌ 19.1 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి అందుకుంది. డేవిడ్‌ మిల్లర్‌ (44 నాటౌట్‌; 27 బంతుల్లో 4×4, 2×6), సాయి సుదర్శన్‌ (45; 36 బంతుల్లో 4×4, 1×6) జట్టు విజయంలో కీలకమయ్యారు.
మొదట సాయి.. ఆపై మిల్లర్‌: ఛేదనలో గుజరాత్‌కు ఇంపాక్ట్‌ ప్లేయర్‌ సాయి సుదర్శన్‌ గెలుపు బాట వేస్తే... మిల్లర్‌ ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. మొదట ఓపెనర్లు వృద్ధిమాన్‌ సాహా (25), శుభ్‌మన్‌ గిల్‌ (36) జీటీకి బలమైన ఆరంభాన్ని ఇచ్చారు. సన్‌రైజర్స్‌ బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా చకచకా బౌండరీలు రాబట్టి స్కోరు పెంచారు. వీరి తర్వాత సుదర్శన్‌, మిల్లర్‌ జంట గుజరాత్‌ను నడిపించింది. ప్రశాంతంగా ఆడుతూ లక్ష్యాన్ని కరిగించింది. మార్కండే వేసిన 16వ ఓవర్లో మిల్లర్‌ ఒక సిక్స్‌, రెండు ఫోర్లు, సుదర్శన్‌ ఒక సిక్స్‌ బాది 24 పరుగులు రాబట్టి లక్ష్యాన్ని చేరువ చేశారు. సుదర్శన్‌ వెనుదిరిగినా.. విజయ్‌శంకర్‌ (14 నాటౌట్‌)తో కలిసి మిల్లర్‌ పని పూర్తి చేశాడు. గుజరాత్‌ మరో 5 బంతులు ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది.
మోహిత్‌ మాయ: గత మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై 277 పరుగులు సాధించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మొదట బ్యాటింగ్‌కు దిగడంతో ఈసారి కూడా అదరగొడుతుందేమో అనిపించింది. అయితే ట్రావిస్‌ హెడ్‌ (19), మయాంక్‌ అగర్వాల్‌ (16) తొలి వికెట్‌కు 4.1 ఓవర్లలో 34 పరుగులు జత చేసి శుభారంభం ఇచ్చినా.. ఆ తర్వాత ఆ జట్టు ఇన్నింగ్స్‌ సాఫీగా సాగలేదు. 40 పరుగుల తేడాతో 3 వికెట్లు కోల్పోయింది. హెడ్‌, మయాంక్‌తో పాటు అభిషేక్‌శర్మ వెనుదిరిగారు. ఈ స్థితిలో మార్‌క్రమ్‌ (17)కు జత కలిసిన క్లాసెన్‌ (24; 13 బంతుల్లో 1×4, 2×6) వేగంగా ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ క్లాసెన్‌కు రషీద్‌ఖాన్‌ (1/31) చెక్‌ పెట్టాడు. మార్‌క్రమ్‌ కూడా వెనుదిరిగినా.. సమద్‌, షాబాజ్‌ (22) పోరాడడంతో సన్‌రైజర్స్‌ పోరాడే స్కోరు సాధించగలిగింది. పొదుపుగా బౌలింగ్‌ చేసిన మోహిత్‌శర్మ చివరి ఓవర్లో 3 పరుగులకే 2 వికెట్లు పడగొట్టాడు. ఒమర్‌జాయ్‌ (1/24), ఉమేశ్‌ యాదవ్‌ (1/28), నూర్‌ అహ్మద్‌ (1/32) కూడా ప్రత్యర్థి కట్టడిలో కీలకపాత్ర పోషించారు.


హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: హెడ్‌ (బి) నూర్‌ 19; మయాంక్‌ (సి) దర్శన్‌ (బి) ఒమర్‌జాయ్‌ 16; అభిషేక్‌ (సి) శుభ్‌మన్‌ (బి) మోహిత్‌ 29; మార్‌క్రమ్‌ (సి) రషీద్‌ (బి) ఉమేశ్‌ 17; క్లాసెన్‌ (బి) రషీద్‌ 24; షాబాజ్‌ (సి) తెవాతియా (బి) మోహిత్‌ 22; సమద్‌ రనౌట్‌ 29; సుందర్‌ (సి) రషీద్‌ (బి) మోహిత్‌ 0; కమిన్స్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 162; వికెట్ల పతనం: 1-34, 2-58, 3-74, 4-108, 5-114, 6-159, 7-159, 8-162; బౌలింగ్‌: ఒమర్‌జాయ్‌ 3-0-24-1; ఉమేశ్‌ 3-0-28-1; రషీద్‌ఖాన్‌ 4-0-33-1; నూర్‌ 4-0-32-1; మోహిత్‌ 4-0-25-3; దర్శన్‌ 2-0-18-0
గుజరాత్‌ ఇన్నింగ్స్‌: సాహా (సి) కమిన్స్‌ (బి) షాబాజ్‌ 25; శుభ్‌మన్‌ (సి) సమద్‌ (బి) మార్కండే 36; సుదర్శన్‌ (సి) అభిషేక్‌ (బి) కమిన్స్‌ 45; మిల్లర్‌ నాటౌట్‌ 44; శంకర్‌ నాటౌట్‌ 14; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (19.1 ఓవర్లలో 3 వికెట్లకు) 168; వికెట్ల పతనం: 1-36, 2-74, 3-138; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-27-0; షాబాజ్‌ 2-0-20-1; ఉనద్కత్‌ 3.1-0-33-0; సుందర్‌ 3-0-27-0; మార్కండే 3-0-33-1; కమిన్స్‌ 4-0-28-1

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని