సంక్షిప్త వార్తలు

ఈడెన్‌ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ తేదీ మారనుంది. ఈనెల 17న శ్రీరామ నవమి ఉండటంతో ఆ రోజు జరిగే మ్యాచ్‌కు కావాల్సినంత భద్రత కల్పించలేమని బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌)కు పోలీసులు తెలియజేశారు.

Published : 02 Apr 2024 02:16 IST

కోల్‌కతా-రాజస్థాన్‌ మ్యాచ్‌ తేదీ మార్పు!

కోల్‌కతా: ఈడెన్‌ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ తేదీ మారనుంది. ఈనెల 17న శ్రీరామ నవమి ఉండటంతో ఆ రోజు జరిగే మ్యాచ్‌కు కావాల్సినంత భద్రత కల్పించలేమని బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌)కు పోలీసులు తెలియజేశారు. ‘‘మ్యాచ్‌ తేదీని మార్చాలని స్థానిక పోలీసులు విజ్ఞప్తి చేసినట్లు బీసీసీఐకి క్యాబ్‌ సమాచారం అందించింది. కొత్త తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు’’ అని బీసీసీఐ సీనియర్‌ అధికారి పేర్కొన్నాడు.


పంత్‌కు రూ.12 లక్షల జరిమానా

విశాఖపట్నం: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ బోణీతో సంతోషంలో ఉన్న కెప్టెన్‌ పంత్‌కు షాక్‌ తగిలింది. ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా అతనికి రూ.12 లక్షల జరిమానా పడింది. ‘‘సీఎస్కేతో మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా దిల్లీ కెప్టెన్‌ పంత్‌కు జరిమానా పడింది. ఈ సీజన్‌లో ఆ జట్టుకిదే తొలి తప్పిదం. కాబట్టి ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళి ప్రకారం స్లో ఓవర్‌రేట్‌కు కనీస శిక్ష అయిన రూ.12 లక్షలు జరిమానాగా విధించాం’’ అని ఐపీఎల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సీజన్‌లో వరుసగా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన దిల్లీ.. ఆదివారం విశాఖ మైదానంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సీఎస్కేను ఓడించిన సంగతి తెలిసిందే.


బ్యాటర్లు లయ అందుకుంటారు: ఫ్లవర్‌

బెంగళూరు: తమ టాప్‌ఆర్డర్‌ ఈ ఐపీఎల్‌ సీజన్లో ఇప్పటిదాకా ఆశించిన స్థాయిలో సత్తాచాటలేదని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చీఫ్‌ కోచ్‌ ఆండీ ఫ్లవర్‌ అన్నాడు. వీలైనంత త్వరగా బ్యాటర్లు లయను అందుకుంటారని ఫ్లవర్‌ ఆశాభావం వ్యక్తంజేశాడు. ‘‘అయిదుగురు టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు ఇంకా చెలరేగలేదు. చిన్నస్వామి స్టేడియంలో పెద్ద స్కోర్లు రావాల్సి ఉన్నాయి. స్టార్‌ బ్యాటర్లు ఒక్కసారి పరుగులు రాబట్టడం మొదలుపెడితే భారీ స్కోర్లు చూడొచ్చు. అందులో నాకెలాంటి అనుమానం లేదు’’ అని ఫ్లవర్‌ తెలిపాడు. ఈ సీజన్లో సొంతగడ్డపై ఓడిన తొలి జట్టు ఆర్సీబీనే. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన గత మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 17వ ఓవర్లోనే ఛేదించింది. మంగళవారం ఇదే వేదికలో బెంగళూరు.. లఖ్‌నవూను ఢీకొనబోతోంది. ఈ మ్యాచ్‌కు పిచ్‌ మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నట్లు ఫ్లవర్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని