ఒలింపిక్స్‌కు మీరాబాయి చాను!

భారత స్టార్‌ వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తు పట్టేసినట్టే! అందుకు అవసరమైన అర్హత ప్రక్రియను ఈ టోక్యో ఒలింపిక్స్‌ రజత విజేత పూర్తి చేసింది.

Published : 02 Apr 2024 02:24 IST

పుకెట్‌ (థాయ్‌లాండ్‌): భారత స్టార్‌ వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తు పట్టేసినట్టే! అందుకు అవసరమైన అర్హత ప్రక్రియను ఈ టోక్యో ఒలింపిక్స్‌ రజత విజేత పూర్తి చేసింది. ఐడబ్ల్యూఎఫ్‌ ప్రపంచకప్‌ గ్రూప్‌- బిలో పోటీ పడ్డ ఆమె.. సోమవారం మహిళల 49 కేజీల విభాగంలో మూడో స్థానంలో నిలిచింది. గాయం కారణంగా ఆరు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న చాను.. పునరాగమనంలో మొత్తం 184 కేజీల బరువెత్తింది. స్నాచ్‌లో 81 కేజీలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 103 కేజీల ప్రదర్శన చేసింది. ఈ పోటీల్లో పాల్గొనడం ద్వారా పారిస్‌ ఒలింపిక్స్‌ అర్హతకు చాను మార్గం సుగమం చేసుకుంది. ప్రస్తుతం తన బరువు విభాగంలో క్వాలిఫికేషన్‌ ర్యాంకింగ్స్‌లో ఆమె రెండో స్థానంలో ఉంది. ఈ నెల 28లోపు ప్రతి వయసు విభాగంలోనూ టాప్‌-10లో ఉన్న వెయిట్‌లిఫ్టర్లు ఒలింపిక్స్‌ బెర్తు దక్కించుకుంటారు. ఈ నేపథ్యంలో చాను పారిస్‌ టికెట్‌ సొంతం చేసుకున్నట్లే. అధికారిక ప్రకటన రావడమే మిగిలింది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే కచ్చితంగా రెండు టోర్నీల్లో, ఇతర మూడు క్వాలిఫయర్స్‌లో పోటీ పడాల్సి ఉంటుంది. చాను ఆ పని పూర్తిచేసింది. ‘‘గాయం నుంచి కోలుకుని రావడం అద్భుతంగా అనిపిస్తోంది. కోలుకునే ప్రక్రియ ఎంతో కఠినంగా సాగింది. పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తు దక్కించుకోవడమే లక్ష్యం. ఇప్పుడు అందుకు చేరువయ్యా. ఆ ఒలింపిక్స్‌లో నా ముద్ర వేయడంపై దృష్టి పెట్టా’’ అని 29 ఏళ్ల చాను తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని