ధోని ఇంకాస్త ముందొస్తే..!

మహేంద్ర సింగ్‌ ధోని.. ఐపీఎల్‌కే ప్రత్యేక ఆకర్షణ ఈ దిగ్గజ ఆటగాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ను అభిమానులు అంతలా ఆదరిస్తున్నారంటే.. ఆ జట్టు ఎక్కడ మ్యాచ్‌ ఆడినా స్టేడియం మొత్తం పసుపు మయంగా మారుతుందంటే అందుకు కారణం మహి! ఆటగాడిగా అతనికి ఇదే చివరి సీజన్‌ అని..

Updated : 02 Apr 2024 06:44 IST

ఈనాడు - హైదరాబాద్‌

మహేంద్ర సింగ్‌ ధోని.. ఐపీఎల్‌కే ప్రత్యేక ఆకర్షణ ఈ దిగ్గజ ఆటగాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ను అభిమానులు అంతలా ఆదరిస్తున్నారంటే.. ఆ జట్టు ఎక్కడ మ్యాచ్‌ ఆడినా స్టేడియం మొత్తం పసుపు మయంగా మారుతుందంటే అందుకు కారణం మహి! ఆటగాడిగా అతనికి ఇదే చివరి సీజన్‌ అని.. మళ్లీ ధోనీని మైదానంలో చూడలేమనే ఊహాగానాల నేపథ్యంలో చివరి సారిగా అతని బ్యాటింగ్‌ను చూసేందుకు అభిమానులు స్టేడియాలకు పోటెత్తుతున్నారు. కానీ ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ధోని అసలు క్రీజులోకే రాలేదు. బ్యాటింగ్‌ ఆర్డర్లో ఎనిమిదో స్థానంలోకి వెళ్లిపోయాడు. అయితే దిల్లీతో పోరులో మాత్రం అతను క్రీజులోకి రావాల్సిన అవసరం వచ్చింది. ఇలా వచ్చాడో లేదో అలా ధనాధన్‌ బ్యాటింగ్‌తో సత్తాచాటాడు. 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 37 పరుగులు చేశాడు. 42 ఏళ్ల వయసులో అతని మెరుపులతో స్టేడియం దద్దరిల్లింది. ఆ మ్యాచ్‌లో సీఎస్కే 20 పరుగుల తేడాతో ఓడటంతో.. ధోని ఇంకాస్త ముందుగా బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే జట్టు గెలిచేదన్న చర్చ జరిగింది. అందుకే మిగతా మ్యాచ్‌ల్లోనైనా బ్యాటింగ్‌ ఆర్డర్లో ధోని మరింత పైన ఆడాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఆర్డర్లో కిందకు ఆడాలనేది ధోని నిర్ణయం లాగే కనిపిస్తోంది. ఎందుకంటే 2019 జులైలో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన ధోని.. 2020 నుంచి ఐపీఎల్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఆ ఏడాది నుంచి ఈ సీజన్‌ ముందు వరకూ ఐపీఎల్‌లో వరుసగా 25, 16.28, 33.14, 26 సగటు మాత్రమే నమోదు చేశాడు. పైగా ఈ సారి సీఎస్కే కెప్టెన్సీని కూడా వదులుకున్న ధోని.. క్రమంగా జట్టుకు దూరమవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నిరుడు మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న ధోని.. దిల్లీతో మ్యాచ్‌ తర్వాత కాలికి పట్టీతో కనిపించాడు. వయసు, ఫిట్‌నెస్‌, ఫామ్‌.. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే జట్టుకు భారంగా మారొద్దని అతను కిందకు వెళ్లిపోయాడని భావిస్తున్నారు. అంతే కాకుండా భవిష్యత్‌ దిశగా జట్టు నిర్మాణం కోసమూ అతను ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. సీఎస్కే బ్యాటింగ్‌ లోతు కూడా ఎక్కువే ఉంది. కానీ దిల్లీతో మ్యాచ్‌లో అతని బ్యాటింగ్‌ చూసిన తర్వాత ధోని జట్టుకు భారం కాదు.. ఇప్పటికీ గెలిపించే ఫినిషరే అని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా అతను బౌండరీలు కొట్టిన తీరు ఒకప్పటి ధోనీని గుర్తుకుతెచ్చింది. నోకియా బౌలింగ్‌లో ఒంటిచేతి సిక్సర్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి లయతో ఉన్న ధోని.. ముందుగా బ్యాటింగ్‌ రావాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. ఆఖరి సారి అతని బ్యాటింగ్‌ విన్యాసాలు చూసేందుకు.. అతని బాదుడు మాయలో పడిపోయేందుకు ఎదురు చూస్తున్నారు. మరి ధోని మనసులో ఏముందో? అతను బ్యాటింగ్‌ ఆర్డర్లో పైకి వస్తాడా? లేదా అదే స్థానంలో కొనసాగుతాడా?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని