హ్యాట్రిక్‌.. వాళ్లకు విజయాల్లో.. వీళ్లకు ఓటముల్లో

హార్దిక్‌ పాండ్య నేతృత్వంలోని ముంబయి ఇండియన్స్‌కు మరో పరాభవం. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన రాజస్థాన్‌.. సోమవారం 6 వికెట్ల తేడాతో ముంబయిని దాని సొంతగడ్డపై చిత్తు చేసింది.

Updated : 02 Apr 2024 06:38 IST

రాయల్స్‌కు వరుసగా మూడో విజయం
ఓటమి బాట వీడని ముంబయి
మెరిసిన పరాగ్‌, బౌల్ట్‌, చాహల్‌

ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ అదరగొడుతోంది. బంతితో బౌల్ట్‌, చాహల్‌, బర్గర్‌.. బ్యాటుతో రియాన్‌ పరాగ్‌ చెలరేగడంతో ఆ జట్టు.. ముంబయి ఇండియన్స్‌ను మట్టికరిపించింది. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకున్న రాయల్స్‌.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. కెప్టెన్‌ మారినా రాత మారని ముంబయి.. టోర్నీలో ఇంకా ఖాతా తెరవలేదు. సొంతగడ్డపైనా ఆ జట్టుకు చేదు అనుభవం తప్పలేదు. ఆ జట్టుకిది వరుసగా మూడో ఓటమి.


ముంబయి

హార్దిక్‌ పాండ్య నేతృత్వంలోని ముంబయి ఇండియన్స్‌కు మరో పరాభవం. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన రాజస్థాన్‌.. సోమవారం 6 వికెట్ల తేడాతో ముంబయిని దాని సొంతగడ్డపై చిత్తు చేసింది. బౌల్ట్‌ (3/22), చాహల్‌ (3/11), బర్గర్‌ (2/32) ధాటికి మొదట ముంబయి 9 వికెట్లకు 125 పరుగులే చేయగలిగింది. హార్దిక్‌ (34; 21 బంతుల్లో 6×4) టాప్‌ స్కోరర్‌. రియాన్‌ పరాగ్‌ (54 నాటౌట్‌; 39 బంతుల్లో 5×4, 3×6) మెరుపులతో లక్ష్యాన్ని రాజస్థాన్‌ 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆకాశ్‌ మధ్వాల్‌ (3/20) గొప్పగా బౌలింగ్‌ చేశాడు.
పరాగ్‌ అదుర్స్‌: ఛేదనలో రియాన్‌ పరాగ్‌ ఆటే హైలైట్‌. ఒత్తిడిలో కీలక ఇన్నింగ్స్‌తో అతడు జట్టును విజయపథంలో నడిపించాడు. స్వల్ప లక్ష్యమే అయినా.. ఛేదన ఆరంభంలో రాయల్స్‌కు కాస్త ఇబ్బంది తప్పలేదు. తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్‌ (10)ను కోల్పోయినా.. 4 ఓవర్లు ముగిసే సరికి 41/1తో రాయల్స్‌ బాగానే కనిపించింది. కానీ కష్టంగా ఖాతా తెరిచినా.. చకచకా బౌండరీలతో జోరందుకున్న సంజు శాంసన్‌ (12)ను మధ్వాల్‌ ఔట్‌ చేయడంతో పరిస్థితి మారింది. ఏడో ఓవర్లో అతడు బట్లర్‌ (13)నూ వెనక్కి పంపాడు. బౌలర్లు ఒత్తిడి తెస్తున్న దశలో రియాన్‌ పరాగ్‌ చక్కగా బ్యాటింగ్‌ చేశాడు. అశ్విన్‌ (16)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. పరుగులు  మాత్రం వేగంగా రాలేదు. 10 ఓవర్లకు స్కోరు 73/3. ఆ తర్వాత కొయెట్జీ బౌలింగ్‌లో పరాగ్‌, అశ్విన్‌  చెరో ఫోర్‌ కొట్టారు. అయితే మధ్వాల్‌ బౌలింగ్‌లో అశ్విన్‌ వెనుదిరిగాడు. ఆఖరి ఆరు ఓవర్లలో రాజస్థాన్‌కు 25 పరుగులు అవసరయ్యాయి. కానీ చెలరేగి ఆడిన పరాగ్‌ ఊహించినదానికన్నా ముందే మ్యాచ్‌ను ముగించాడు. కళ్లుచెదిరే షాట్లతో విరుచుకుపడ్డ అతడు.. బుమ్రా బౌలింగ్‌లో ఫోర్‌, చావ్లా ఓవర్లో సిక్స్‌, కొయెట్జీ బౌలింగ్‌లో వరుసగా 6, 6, 4తో పని పూర్తి చేశాడు. శుభమ్‌  దూబె (8 నాటౌట్‌)తో అభేద్యమైన అయిదో వికెట్‌కు అతడు 39 పరుగులు జోడించాడు. అంతకుముందు అశ్విన్‌తో 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
ముంబయికి చెక్‌: నాలుగు ఓవర్లలో 20/4. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్‌ పరిస్థితిది. ఆరంభం అత్యంత పేలవం. బౌల్ట్‌ ధాటికి విలవిల్లాడిన ఆ జట్టు చకచకా వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మను బౌల్ట్‌ ఖాతా అయినా తెరవనివ్వలేదు. పదునైన పేస్‌తో విజృంభించిన అతడు తొలి ఓవర్లో వరుస బంతుల్లో రోహిత్‌, నమన్‌ ధీర్‌ (0)ను పెవిలియన్‌ చేర్చాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ బ్రెవిస్‌ (0) కూడా ఏమాత్రం ప్రభావం చూపలేదు. బౌల్ట్‌ తన తర్వాతి ఓవర్లో అతణ్ని వెనక్కి పంపాడు. 3-0-14-3.. తన తొలి మూడు ఓవర్లలో బౌల్ట్‌ గణాంకాలివి. నాలుగో ఓవర్లో ఇషాన్‌ కిషన్‌ (16) ఇన్నింగ్స్‌కు బర్గర్‌ తెరదించాడు. ఇబ్బందుల్లో పడ్డ ముంబయిని  కెప్టెన్‌ హార్దిక్‌, తిలక్‌ వర్మ (32) ఆదుకున్నారు. ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలోనూ ఈ ఇద్దరు ధాటిగా బ్యాటింగ్‌ చేశారు. బౌల్ట్‌, అవేష్‌ బౌలింగ్‌లో తిలక్‌ సిక్స్‌లు బాదేయగా.. బర్గర్‌ ఓవర్లో హార్దిక్‌ మూడు బంతులను బౌండరీ దాటించాడు. 9 ఓవర్లలో 75/4తో ముంబయి కోలుకుంటున్నట్లే కనిపించింది. కానీ మళ్లీ గతి తప్పింది. తిలక్‌తో కలిసి బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తోన్న హార్దిక్‌ను చాహల్‌ ఔట్‌ చేయడంతో ఇన్నింగ్స్‌ గమనం మారిపోయింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన ముంబయికి పరుగులు కష్టంగా వచ్చాయి. హార్దిక్‌ నిష్క్రమణ తర్వాత తిలక్‌ ఎంతో సేపు నిలువలేదు. టిమ్‌ డేవిడ్‌ (17) కూడా నిలవలేకపోయాడు. ఇన్నింగ్స్‌లో అన్ని ఓవర్లూ ఆడగలిగినా ముంబయి స్కోరు బోర్డుపై పెద్దగా పరుగులు చేరలేదు. రాజస్థాన్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో బౌండరీలు రాలేదు. ఆఖరి పది ఓవర్లలో 48 పరుగులే చేసిన ముంబయి.. 9 వికెట్లు కోల్పోయింది. అద్భుతంగా బౌలింగ్‌ చేసిన చాహల్‌.. బ్యాటర్లకు ఏమాత్రం బ్యాట్‌ ఝళిపించే అవకాశం ఇవ్వలేదు. అశ్విన్‌ (0/27) కూడా పొదుపుగా బౌలింగ్‌ చేశాడు.


ముంబయి ఇన్నింగ్స్‌: ఇషాన్‌ కిషన్‌ (సి) శాంసన్‌ (బి) బర్గర్‌ 16; రోహిత్‌ (సి) శాంసన్‌ (బి) బౌల్ట్‌ 0; నమన్‌ ధిర్‌ ఎల్బీ (బి) బౌల్ట్‌ 0; బ్రెవిస్‌ (సి) బర్గర్‌ (బి) బౌల్ట్‌ 0; తిలక్‌ వర్మ (సి) అశ్విన్‌ (బి) చాహల్‌ 32; హార్దిక్‌ (సి) పావెల్‌ (బి) చాహల్‌ 34; పియూష్‌ చావ్లా (సి) హెట్‌మయర్‌ (బి) అవేష్‌ ఖాన్‌ 2; టిమ్‌ డేవిడ్‌ (సి) బౌల్ట్‌ (బి) బర్గర్‌ 17; కొయెట్జీ (సి) హెట్‌మయర్‌ (బి) చాహల్‌ 4; బుమ్రా నాటౌట్‌ 8; ఆకాశ్‌ మధ్వాల్‌ నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 125 వికెట్ల పతనం: 1-1, 2-1, 3-14, 4-20, 5-76, 6-83, 7-95, 8-111, 9-114 బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-22-3; బర్గర్‌ 4-0-32-2; అవేష్‌ ఖాన్‌ 4-0-30-1; చాహల్‌ 4-0-11-3; అశ్విన్‌ 4-0-27-0

రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌: యశస్వి జైస్వాల్‌ (సి) డేవిడ్‌ (బి) మఫాక 10; బట్లర్‌ (సి) చావ్లా (బి) మధ్వాల్‌ 13; శాంసన్‌ (బి) మధ్వాల్‌ 12; రియాన్‌ పరాగ్‌ నాటౌట్‌ 54; అశ్విన్‌ (సి) తిలక్‌ (బి) మధ్వాల్‌ 16; శుభమ్‌ దూబె నాటౌట్‌ 8; ఎక్స్‌ట్రాలు 14 మొత్తం: (15.3 ఓవర్లలో 4 వికెట్లకు) 127 వికెట్ల పతనం: 1-10, 2-42, 3-48, 4-88 బౌలింగ్‌: మఫాక 2-0-23-1; బుమ్రా 4-0-26-0; ఆకాశ్‌ మధ్వాల్‌ 4-0-20-3; కొయెట్జీ 2.3-0-36-0; పియూష్‌ చావ్లా 3-0-18-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు