కుర్రాడు.. హడలెత్తించాడు

లఖ్‌నవూ అదరగొట్టింది. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యంతో ఈ ఐపీఎల్‌లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కొత్త పేస్‌ సంచలనం మయాంక్‌ యాదవ్‌ మరోసారి విజృంభించిన వేళ.. బెంగళూరును అలవోకగా ఓడించింది. డికాక్‌, పూరన్‌లు లఖ్‌నవూకు మంచి స్కోరును అందిస్తే.. మయాంక్‌ పదునైన పేస్‌తో ఆర్సీబీ వెన్నువిరిచాడు.

Updated : 03 Apr 2024 06:55 IST

విజృంభించిన మయాంక్‌
చెలరేగిన డికాక్‌, పూరన్‌
ఆర్సీబీపై లఖ్‌నవూ విజయం
బెంగళూరు

లఖ్‌నవూ అదరగొట్టింది. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యంతో ఈ ఐపీఎల్‌లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కొత్త పేస్‌ సంచలనం మయాంక్‌ యాదవ్‌ మరోసారి విజృంభించిన వేళ.. బెంగళూరును అలవోకగా ఓడించింది. డికాక్‌, పూరన్‌లు లఖ్‌నవూకు మంచి స్కోరును అందిస్తే.. మయాంక్‌ పదునైన పేస్‌తో ఆర్సీబీ వెన్నువిరిచాడు. నాలుగు మ్యాచ్‌ల్లో బెంగళూరుకిది మూడో పరాజయం.

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ మురిసింది. యువ ఫాస్ట్‌బౌలర్‌ మయాంక్‌ యాదవ్‌ (3/14) విజృంభించడంతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై విజయం సాధించింది. డికాక్‌ (81; 56 బంతుల్లో 8×4, 5×6), పూరన్‌ (40 నాటౌట్‌; 21 బంతుల్లో 1×4, 5×6) చెలరేగడంతో మొదట లఖ్‌నవూ 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు సాధించింది. మ్యాక్స్‌వెల్‌ (2/23), యశ్‌ దయాల్‌ (1/24) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. ఛేదనలో మయాంక్‌ ధాటికి ఆర్సీబీ కకావికలమైంది. 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ లొమ్రార్‌ (33; 13 బంతుల్లో 3×4, 3×6) టాప్‌ స్కోరర్‌. నవీనుల్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

ఆర్సీబీ తడబాటు: నిజానికి బెంగళూరు ఛేదన బాగానే ఆరంభమైంది. ఓపెనర్లు విరాట్‌ కోహ్లి (22; 16 బంతుల్లో 2×4, 1×6), డుప్లెసిస్‌ (19; 13 బంతుల్లో 3×4) ధాటిగా ఆడడంతో ఆ జట్టు 4 ఓవర్లలో 36/0తో నిలిచింది. కానీ ఆర్సీబీ అనూహ్యంగా తడబడింది. మూడు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. కోహ్లిని మణిమారన్‌ ఔట్‌ చేయగా.. డుప్లెసిస్‌ రనౌటయ్యాడు. మ్యాక్స్‌వెల్‌ (0)ను మయాంక్‌ యాదవ్‌ పెవిలియన్‌ చేర్చాడు. కాసేపటి తర్వాత గ్రీన్‌ (9)ను మయాంక్‌ బౌల్డ్‌ చేయడంతో ఆర్సీబీ 58/4తో చిక్కుల్లో పడింది. ఆ దశలో నిలబడ్డ రజత్‌ పటీదార్‌ (29; 21 బంతుల్లో 2×4, 2×6).. అనుజ్‌ రావత్‌ (21 బంతుల్లో 11)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. కానీ పరుగులు వేగంగా రాలేదు. పటీదార్‌ కాస్త బ్యాట్‌ ఝళిపించినా.. రావత్‌ చెమటోడ్చాడు. 13వ ఓవర్లో రావత్‌ను ఔట్‌ చేయడం ద్వారా 36 పరుగుల అయిదో వికెట్‌ భాగస్వామ్యాన్ని స్టాయినిస్‌ విడదీశాడు. 15వ ఓవర్లో పటీదార్‌ను మయాంక్‌ వెనక్కి పంపేటప్పటికి స్కోరు 103. చివరి 5 ఓవర్లలో ఆర్సీబీకి 78 పరుగులు అవసరమైన స్థితిలో లఖ్‌నవూ విజయం లాంఛనమే అనిపించింది. కానీ అనూహ్యంగా చెలరేగి ఆడిన లొమ్రార్‌ ఆ జట్టును కలవరపెట్టాడు. యశ్‌ ఠాకూర్‌ ఓవర్లో వరుసగా 6, 4, 6.. నవీనుల్‌ బౌలింగ్‌లో వరుసగా 6, 4 బాదిన అతడు ఆర్సీబీని పోటీలోకి తెచ్చాడు. అయితే ఆ జట్టు సంతోషం కొద్దిసేపే. దినేశ్‌ కార్తీక్‌ (4)ను నవీనుల్‌ ఔట్‌ చేయడం, దూకుడు మీదున్న లొమ్రార్‌ను యశ్‌ వెనక్కి పంపడంతో లఖ్‌నవూ మళ్లీ పట్టుబిగించింది. లొమ్రార్‌ కన్నా ముందు దాగర్‌ రనౌటయ్యాడు. ఆర్సీబీ చివరి రెండు ఓవర్లలో 44 పరుగులు చేయాల్సిన స్థితిలో లఖ్‌నవూ విజయం ఖాయమైంది.

మెరిసిన డికాక్‌: లఖ్‌నవూ అంతకుముందు గౌరవప్రదమైన స్కోరు సాధించిందంటే ప్రధాన కారణం ఓపెనర్‌ డికాకే కీలక ఇన్నింగ్స్‌, ముగింపులో పూరన్‌ మెరుపులే. లఖ్‌నవూ టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించిన డికాక్‌.. ఆ తర్వాత సాధికారిక బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును నడిపించాడు. మరో ఓపెనర్‌ రాహుల్‌లో దూకుడు కొరవడినా డికాక్‌ ఆరంభం నుంచే రెచ్చిపోయాడు. టాప్లీ వేసిన ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్లో మూడు ఫోర్లు బాదేసిన అతడు.. సిరాజ్‌ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు, దయాల్‌ బౌలింగ్‌లో సిక్స్‌ దంచేశాడు. అయిదు ఓవర్లు ముగిసేసరికి లఖ్‌నవూ 46/0తో నిలిచింది. కానీ 6 నుంచి 10 ఓవర్ల మధ్య రెండు వికెట్లు కోల్పోయిన లఖ్‌నవూకు 30 పరుగులు మాత్రమే వచ్చాయి. మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో రాహుల్‌ (20; 14 బంతుల్లో 2×6) నిష్క్రమించగా.. పడిక్కల్‌ (11 బంతుల్లో 6)ను సిరాజ్‌ పెవిలియన్‌ చేర్చాడు. కానీ డికాక్‌, స్టాయినిస్‌ ఎడాపెడా సిక్స్‌లు, ఫోర్లు బాదడంతో స్కోరు బోర్డు జోరందుకుంది. దాగర్‌ ఓవర్లో ఫోర్‌, సిక్స్‌ కొట్టిన డికాక్‌.. గ్రీన్‌ బౌలింగ్‌లోనూ సిక్స్‌, ఫోర్‌ దంచాడు. గ్రీన్‌, మ్యాక్స్‌వెల్‌ ఓవర్లలో స్టాయినిస్‌ ఒక్కో సిక్స్‌ కొట్టాడు. దీంతో 13.4 ఓవర్లలో 129/2తో లఖ్‌నవూ బలంగా కనిపించింది. అయితే యశ్‌ దయాల్‌, టాప్లీ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 18వ ఓవర్‌ వరకు మరో 19 పరుగులే చేసిన సూపర్‌ జెయింట్స్‌.. స్టాయినిస్‌, డికాక్‌, బదోని వికెట్లు చేజార్చుకుంది. కానీ పూరన్‌ విధ్వంసక బ్యాటింగ్‌తో ఆ జట్టుకు మెరుపు ముగింపునిచ్చాడు. 19వ ఓవర్లో టాప్లీ (1/39) బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్స్‌లు దంచిన అతడు.. ఆ తర్వాత సిరాజ్‌ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు బాదేశాడు. పూరన్‌ జోరుతో ఆఖరి రెండు ఓవర్లలో లఖ్‌నవూ 33 పరుగులు రాబట్టింది. సిరాజ్‌ నాలుగు ఓవర్లలో 47 పరుగులు సమర్పించుకున్నాడు.

మయాంక్‌.. మళ్లీ

పంజాబ్‌ కింగ్స్‌తో గత మ్యాచ్‌లో లఖ్‌నవూ తరఫున మయాంక్‌ యాదవ్‌ అనే యువ ఫాస్ట్‌బౌలర్‌ ఎలా  చెలరేగిపోయాడో తెలిసిందే. ఆ ప్రదర్శన గాలివాటం కాదని రుజువు చేస్తూ తన రెండో మ్యాచ్‌లోనూ అతను విజృంభించాడు. అదే మెరుపు వేగంతో, కచ్చితత్వంతో బెంగళూరు బ్యాటర్లను అతను వణికించాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అతను మూడు వికెట్ల ప్రదర్శన చేయడం విశేషం. 4 ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి ప్రమాదకర మ్యాక్స్‌వెల్‌తో పాటు కామెరూన్‌ గ్రీన్‌, రజత్‌ పటీదార్‌ల వికెట్లు పడగొట్టాడు. గత మ్యాచ్‌లో 155.8 కి.మీ వేగంతో ఈ సీజన్లో అత్యంత వేగవంతమైన బౌలర్‌గా తాను నెలకొల్పిన రికార్డును 156.7   కి.మీ వేగంతో అతను అధిగమించడం విశేషం.

లఖ్‌నవూ ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) దాగర్‌ (బి) టాప్లీ 81; కేఎల్‌ రాహుల్‌ (సి) దాగర్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 20; పడిక్కల్‌ (సి) అనుజ్‌ రావత్‌ (బి) సిరాజ్‌ 6; స్టాయినిస్‌ (సి) దాగర్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 24; పూరన్‌ నాటౌట్‌ 40; బదోని (సి) డుప్లెసిస్‌ (బి) యశ్‌ దయాల్‌ 0; కృనాల్‌ పాండ్య నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 181

వికెట్ల పతనం: 1-53, 2-73, 3-129, 4-143, 5-148

బౌలింగ్‌: టాప్లీ 4-0-39-1; యశ్‌ దయాల్‌ 4-0-24-1; సిరాజ్‌ 4-0-47-1; మ్యాక్స్‌వెల్‌ 4-0-23-2; మయాంక్‌ దాగర్‌ 2-0-23-0; గ్రీన్‌ 2-0-25-0

బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) పడిక్కల్‌ (బి) సిద్దార్థ్‌ 22; డుప్లెసిస్‌ రనౌట్‌ 19; రజత్‌ పటీదార్‌ (సి) పడిక్కల్‌ (బి) మయాంక్‌ 29; మ్యాక్స్‌వెల్‌ (సి) పూరన్‌ (బి) మయాంక్‌ 0; గ్రీన్‌ (బి) మయాంక్‌ 9; అనుజ్‌ రావత్‌ (సి) పడిక్కల్‌ (బి) స్టాయినిస్‌ 11; లొమ్రార్‌ (సి) పూరన్‌ (బి) యశ్‌ ఠాకూర్‌ 33; దినేశ్‌ కార్తీక్‌ (సి) రాహుల్‌ (బి) నవీనుల్‌ 4; దాగర్‌ రనౌట్‌ 0; టాప్లీ నాటౌట్‌ 3; సిరాజ్‌ (సి) పూరన్‌ (బి) నవీనుల్‌ 12; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (19.4 ఓవర్లలో ఆలౌట్‌) 153

వికెట్ల పతనం: 1-40, 2-42, 3-43, 4-58, 5-94,  6-103, 7-136, 8-137, 9-138

బౌలింగ్‌: మణిమారన్‌ సిద్దార్థ్‌ 3-0-21-1; కృనాల్‌ పాండ్య 1-0-10-0; నవీనుల్‌ హక్‌ 3.4-0-25-2; మయాంక్‌ యాదవ్‌ 4-0-14-3; రవి బిష్ణోయ్‌ 3-0-33-0; యశ్‌ ఠాకూర్‌ 4-0-38-1; స్టాయినిస్‌ 1-0-9-1

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని